Skip to content
2 సమూయేలు 15:1-12

2 సమూయేలు 15:1-12

1
కొంతకాలం తర్వాత అబ్షాలోము ఒక రథాన్ని, గుర్రాలను తన ముందు పరుగెత్తడానికి యాభైమంది పురుషులను అంగరక్షకులుగా సమకూర్చుకున్నాడు.
2
అతడు ఉదయాన్నే లేచి పట్టణ ద్వారానికి వెళ్లే దారి ప్రక్కన నిలబడేవాడు. రాజు తీర్పు పొందడానికి ఎవరైనా ఫిర్యాదులతో వస్తే అబ్షాలోము వారిని పిలిచి, “మీది ఏ ఊరు?” అని అడిగేవాడు. “నీ సేవకుడైన నేను ఇశ్రాయేలు గోత్రాల్లో ఫలాన దానికి చెందిన వాడినని” ఆ వ్యక్తి చెప్పినప్పుడు,
3
అప్పుడు అబ్షాలోము, “చూడు, నీ ఫిర్యాదులు విలువైనవి, సరియైనవే కాని, వాటిని వినడానికి రాజు ప్రతినిధులెవరు లేరు” అని అనేవాడు.
4
ఇంకా అబ్షాలోము, “నేను ఈ దేశానికి న్యాయమూర్తిగా నియమించబడి ఉంటే బాగుండేది! అప్పుడు ఎవరైనా ఫిర్యాదులతో వివాదాలతో నా దగ్గరకు వస్తే, వారికి న్యాయం జరిగేలా చూసేవాన్ని” అని చెప్పేవాడు.
5
అలాగే, ఎవరైనా తనకు నమస్కారం చేయడానికి వచ్చినప్పుడు అబ్షాలోము తన చేయి చాచి, అతన్ని పట్టుకుని ముద్దు పెట్టుకునేవాడు.
6
తీర్పు కోసం రాజు దగ్గరకు వచ్చిన ఇశ్రాయేలీయులందరితో అబ్షాలోము ఇలానే మాట్లాడుతూ ఇశ్రాయేలు ప్రజల హృదయాలను గెలుచుకున్నాడు.
7
ఇలా నాలుగు సంవత్సరాలు గడిచిన తర్వాత అబ్షాలోము రాజు దగ్గరకు వెళ్లి, “నేను హెబ్రోనుకు వెళ్లి యెహోవాకు నేను చేసిన మ్రొక్కుబడిని తీర్చుకోనివ్వండి.
8
నీ సేవకుడు అరాములోని గెషూరులో ఉన్నప్పుడు, ‘ఒకవేళ యెహోవా నన్ను తిరిగి యెరూషలేముకు తీసుకెళ్తే నేను హెబ్రోనులో యెహోవాను ఆరాధిస్తాను’ అని మ్రొక్కుబడి చేశాను” అని మనవి చేశాడు.
9
రాజు అతనితో, “సమాధానంగా వెళ్లు” అని చెప్పి అనుమతి ఇచ్చాడు. కాబట్టి అతడు హెబ్రోనుకు వెళ్లాడు.
10
అబ్షాలోము, “మీరు బూరల ధ్వని వినగానే, ‘హెబ్రోనులో అబ్షాలోము రాజు’ అని కేకలు వేయండి” అని చెప్పడానికి ఇశ్రాయేలీయుల గోత్రాలన్నిటికి రహస్యంగా దూతలను పంపాడు.
11
యెరూషలేము నుండి 200 మంది పురుషులు అబ్షాలోముతో పాటు వచ్చారు. అతడు వారిని అతిథులుగా రమ్మని పిలిచినప్పుడు, వారు విషయం తెలియక అమాయకంగా వెళ్లారు.
12
అబ్షాలోము బలులు అర్పిస్తున్నప్పుడు, దావీదు సలహాదారుడైన గిలోనీయుడైన అహీతోపెలును తన స్వగ్రామమైన గిలోహు నుండి రమ్మని పిలిపించాడు. అబ్షాలోము అనుచరులు పెరుగుతూనే ఉండడంతో కుట్ర మరింత బలపడింది.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options