Skip to content
2 దినవృత్తాంతములు 28:6-19

2 దినవృత్తాంతములు 28:6-19

6
రెమల్యా కుమారుడైన పెకహు ఒకేరోజున యూదాలో 1,20,000 మంది సైనికులను చంపాడు, అలా జరగడానికి కారణం యూదా వారు తమ పూర్వికుల దేవుడైన యెహోవాను విడిచిపెట్టడమే.
7
ఎఫ్రాయిమీయుల యోధుడైన జిఖ్రీ, రాజకుమారుడైన మయశేయాను, రాజభవనానికి అధికారియైన అజ్రీకామును, రాజు తర్వాత రెండవ స్థాయి వాడైన ఎల్కానాను చంపాడు.
8
ఇశ్రాయేలీయులు తమ తోటి ఇశ్రాయేలీయుల నుండి రెండు లక్షలమంది భార్యలను, కుమారులను, కుమార్తెలను యూదా నుండి బందీలుగా తీసుకున్నారు. వారు గొప్ప దోపుడుసొమ్మును దోచుకుని తిరిగి సమరయకు తీసుకెళ్లారు.
9
అయితే యెహోవా ప్రవక్తయైన ఓదేదు అనే ఒకడు అక్కడ ఉన్నాడు. అతడు సమరయకు వస్తున్న సైన్యాన్ని కలుసుకోడానికి వెళ్లి వారితో ఇలా చెప్పాడు, “మీ పూర్వికుల దేవుడైన యెహోవాకు యూదా వారి మీద కోపం వచ్చి, వారిని మీ చేతికి అప్పగించారు. కానీ మీరు ఆకాశాన్నంటే క్రోధంతో వారిని చంపేశారు.
10
ఇప్పుడు యూదా, అలాగే యెరూషలేములోని స్త్రీ పురుషులను మీ బానిసలుగా చేసుకోవాలనేది మీ ఆలోచన. అయితే మీరు మీ దేవుడైన యెహోవాకు వ్యతిరేకంగా చేసిన పాపాలకు కూడా అపరాధులు కారా?
11
ఇప్పుడు నా మాట వినండి! మీరు బందీలుగా పట్టుకున్న మీ తోటి ఇశ్రాయేలీయులను తిరిగి పంపించండి, ఎందుకంటే యెహోవా తీవ్రమైన కోపం మీపై ఉంది.”
12
ఎఫ్రాయిమీయుల పెద్దలైన యెహోహనాను కుమారుడైన అజర్యా, మెషిల్లేమోతు కుమారుడైన బెరెక్యా, షల్లూము కుమారుడైన యెహిజ్కియా, హద్లాయి కుమారుడైన అమాశా అనేవారు యుద్ధం నుండి తిరిగివస్తున్న వారికి ఎదురుగా నిలబడి.
13
వారితో, “మీరు ఈ బందీలను ఇక్కడకు తీసుకురాకూడదు, యెహోవా ఎదుట మేము దోషులమవుతాము. మీరు మా పాపాలను దోషాలను ఇంకా ఎక్కువ వేయాలనుకుంటున్నారా? ఇప్పటికే మా దోషం ఎంతో ఎక్కువగా ఉంది, యెహోవా రగులుతున్న కోపం ఇశ్రాయేలు మీద ఉంది” అని చెప్పారు.
14
కాబట్టి సైనికులు ఆ బందీలను, దోపుడుసొమ్మును అధికారులు, సమాజమంతటి సమక్షంలో విడిచిపెట్టారు.
15
పేరు బట్టి నియమితులైన వారు దోపిడిలో నుండి వస్త్రాలు, చెప్పులు తీసి నగ్నంగా ఉన్న బందీలకు ఇచ్చారు. తినడానికి ఆహారం, త్రాగడానికి నీరు, ఔషధ తైలాన్ని ఇచ్చారు. నీరసించిన వారిని గాడిదల మీద ఎక్కించారు. అప్పుడు బందీలను ఖర్జూరపు చెట్ల పట్టణం అనే పేరున్న యెరికోకు తీసుకెళ్లి వారి స్వదేశస్థుల దగ్గర వదిలి, తిరిగి సమరయకు వచ్చారు.
16
ఆ కాలంలో అష్షూరుదేశపు రాజులను సాయం చేయమని ఆహాజు రాజు కబురు పంపాడు.
17
ఎందుకంటే, మరోసారి ఎదోమీయులు యూదా మీదికి దండెత్తివచ్చి, కొందరిని బందీలుగా పట్టుకుపోయారు.
18
ఫిలిష్తీయులు యూదాలోని దక్షిణ పర్వత ప్రాంతాలలోని పట్టణాలపై దాడి చేశారు. వారు బేత్-షెమెషు, అయ్యాలోను గెదెరోతు, అలాగే శోకో, తిమ్నా గిమ్జో వాటి చుట్టుప్రక్కల గ్రామాలను స్వాధీనం చేసుకుని ఆక్రమించారు.
19
ఆహాజు యూదా ప్రజల్లో దుష్టత్వం పెరిగేలా చేసి యెహోవాకు నమ్మకద్రోహం చేశాడు, కాబట్టి ఇశ్రాయేలు రాజైన ఆహాజు కారణంగా యెహోవా యూదా రాజ్యాన్ని అణచివేశారు.

బైబిల్ పాఠం: Biblica® Open Telugu Contemporary Version™, © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. · CC BY-SA 4.0“Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc., used with permission.

Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options