Skip to content
1 సమూయేలు 28:7-20

1 సమూయేలు 28:7-20

7
సౌలు తన సహాయకులకు, “మీరు వెళ్లి మృతుల ఆత్మలతో మాట్లాడే స్త్రీని వెదకండి, అప్పుడు నేను వెళ్లి ఆమె దగ్గర విచారణ చేస్తాను” అని ఆజ్ఞాపించాడు. అప్పుడు వారు, “ఎన్-దోరులో ఒక స్త్రీ ఉంది” అని చెప్పారు.
8
కాబట్టి సౌలు మారువేషం వేసుకుని వేరే బట్టలు ధరించి ఇద్దరు మనుష్యులతో పాటు బయలుదేరి రాత్రివేళ ఆ స్త్రీ దగ్గరకు వచ్చి, “చనిపోయినవారి ఆత్మతో మాట్లాడి నాకు శకునం చెప్పి, నాతో మాట్లాడడానికి నేను నీతో చెప్పేవాన్ని రప్పించు” అని అడిగాడు.
9
అయితే ఆ స్త్రీ అతనితో, “సౌలు ఏమి చేశాడో నీకు తెలుసు కదా; అతడు మృతుల ఆత్మలతో మాట్లాడేవారిని, ఆత్మలతో మాట్లాడేవారిని దేశంలో ఉండకుండ వారిని తొలగించాడు. నాకు మరణం వచ్చేలా నా ప్రాణానికి ఎందుకు ఉచ్చు బిగిస్తున్నావు?” అన్నది.
10
అందుకు సౌలు ఆమెతో, “సజీవుడైన యెహోవా పేరిట ప్రమాణం చేసి చెప్తున్న, ఇలా చేసినందుకు నీవు శిక్షించబడవు” అని యెహోవాను బట్టి ప్రమాణం చేశాడు.
11
అప్పుడు ఆ స్త్రీ, “నీతో మాట్లాడడానికి నేనెవరిని రప్పించాలి?” అని అడిగింది. అందుకతడు, “సమూయేలును రప్పించు” అన్నాడు.
12
ఆ స్త్రీ సమూయేలును చూసినప్పుడు చాలా గట్టిగా కేక వేసి, “నీవు సౌలువే కదా నీవు నన్నెందుకు మోసం చేశావు?” అని సౌలును అడిగింది.
13
అందుకు రాజు ఆమెతో, “భయపడకు, నీకు ఏమి కనబడింది?” అని అడిగాడు. ఆమె, “దేవుళ్ళలో ఒకడు భూమిలో నుండి పైకి రావడం నేను చూశాను” అని చెప్పింది.
14
అందుకు, “అతని రూపం ఎలా ఉంది?” అని అడిగాడు. ఆమె, “దుప్పటి కప్పుకున్న ఒక ముసలివాడు పైకి వస్తున్నాడు” అన్నది. సౌలు అతడు సమూయేలు అని తెలుసుకుని మోకరించి సాష్టాంగపడ్డాడు.
15
అప్పుడు సమూయేలు సౌలును, “నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందరపెట్టావు?” అని అడిగాడు. అందుకు సౌలు, “నేను చాలా బాధల్లో ఉన్నాను; ఫిలిష్తీయులు నా మీదికి యుద్ధానికి వస్తే దేవుడు నా నుండి దూరమయ్యారు. ప్రవక్తల ద్వారా గాని కలల ద్వారా గాని ఆయన నాకు ఏ సమాధానం ఇవ్వడం లేదు. కాబట్టి నేను ఏం చేయాలో నాకు చెప్తావని నిన్ను పిలిచాను” అన్నాడు.
16
అందుకు సమూయేలు, “యెహోవా నిన్ను విడిచిపెట్టి నీకు శత్రువైనప్పుడు నీవు నన్ను ఎందుకు అడుగుతావు?
17
యెహోవా నా ద్వారా ప్రవచించిన దానిని నెరవేర్చారు. యెహోవా నీ చేతి నుండి రాజ్యాన్ని తీసివేసి దానిని నీ పొరుగువాడైన దావీదుకు ఇచ్చారు.
18
నీవు యెహోవా ఆజ్ఞకు లోబడకుండా అమాలేకీయుల విషయంలో ఆయన తీక్షణమైన కోపాన్ని అమలు చేయలేదు కాబట్టి యెహోవా ఈ రోజు నీకు ఈ విధంగా చేస్తున్నారు.
19
యెహోవా నిన్ను ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతికి అప్పగిస్తారు, రేపు నీవు నీ కుమారులు నాతో పాటు ఉంటారు. యెహోవా ఇశ్రాయేలీయుల సైన్యాన్ని కూడా ఫిలిష్తీయుల చేతికి అప్పగిస్తారు” అని సౌలుతో చెప్పాడు.
20
సమూయేలు మాటలకు చాలా భయపడిన సౌలు వెంటనే నేలపై నిలువుగా పడిపోయాడు. అతడు ఆ రోజంతా పగలు రాత్రి భోజనం చేయకపోవడంతో చాలా బలహీనమయ్యాడు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options