Skip to content
1 రాజులు 20:22-43

1 రాజులు 20:22-43

22
తర్వాత ఇశ్రాయేలు రాజు దగ్గరకు ఆ ప్రవక్త వచ్చి అన్నాడు, “ధైర్యం తెచ్చుకుని నీవు ఏం చేయాలో నిర్ణయించుకో, ఎందుకంటే, వచ్చే వసంతకాలంలో అరాము రాజు మళ్ళీ నీ మీద దాడి చేస్తాడు.”
23
ఇంతలో అరాము రాజు పరివారం అతనితో, “ఇశ్రాయేలు దేవుళ్ళు కొండల దేవుళ్ళు. అందుకే వారు మనకంటే బలంగా ఉన్నారు. కాని మనం సమతల మైదాన ప్రాంతంలో వారితో పోరాడితే మనం తప్పనిసరిగా గెలుస్తాము.
24
ఇలా చేయండి: రాజులందరినీ తొలగించి వారికి బదులు అధిపతులను నియమించండి.
25
మీరు పోగొట్టుకున్న సైన్యంలాంటి మరో సైన్యాన్ని సమకూర్చండి అంటే గుర్రానికి గుర్రం, రథానికి రథం. తద్వారా ఇశ్రాయేలుతో మైదాన ప్రాంతంలో యుద్ధం చేయవచ్చు. అప్పుడు మనం వారిపై గెలుస్తాం” అని చెప్పారు. అతడు వారి సలహా అంగీకరించి అల చేశాడు.
26
మరుసటి వసంతకాలంలో, బెన్-హదదు ఇశ్రాయేలుతో యుద్ధం చేయడానికి అరాము సైన్యాన్ని పోగుచేసి, ఆఫెకు ప్రాంతానికి వెళ్లాడు.
27
ఇశ్రాయేలీయులు కూడా తమ సైన్యాన్ని పోగుచేసుకుని సామాగ్రి పొందుకున్నప్పుడు, వారిని ఎదుర్కోడానికి వెళ్లారు. ఇశ్రాయేలీయులు రెండు చిన్న మేకల మందలా వారికి ఎదురుగా బస చేశారు, మరోవైపు అరామీయులు గ్రామీణ ప్రాంతాల్లో నిండి ఉన్నారు.
28
దైవజనుడు ఒకడు ఇశ్రాయేలు రాజు దగ్గరకు వచ్చి అన్నాడు, “యెహోవా చెప్పే మాట ఇదే: ‘యెహోవా కొండ దేవుడే గాని లోయ దేవుడు కాదని అరామీయులు అనుకుంటున్నారు కాబట్టి, ఈ గొప్ప సైన్యాన్ని మీ చేతికి అప్పగిస్తాను, అప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకుంటారు.’ ”
29
వారు ఏడు రోజులు ఎదురెదురుగా గుడారాలు వేసుకుని ఉన్నారు, ఏడవ రోజున యుద్ధం ఆరంభమైంది. ఆ ఒక్క రోజున ఇశ్రాయేలీయులు అరాము కాల్బలంలో లక్ష మందికి ప్రాణనష్టం కలిగించారు.
30
మిగతావారు ఆఫెకు పట్టణముకు పారిపోయారు, వారిలో ఇరవై ఏడు వేలమంది మీద ప్రాకారం కూలింది. బెన్-హదదు పట్టణానికి పారిపోయి లోపలి గదిలో చొరబడ్డాడు.
31
అతని అధికారులు అతనితో అన్నారు, “చూడండి, ఇశ్రాయేలు రాజులు దయ గలవారని విన్నాము. ఇప్పుడు మేము నడుముకు గోనెపట్ట కట్టుకుని, తల చుట్టూ త్రాళ్లు వేసుకుని, ఇశ్రాయేలు రాజు దగ్గరకు వెళ్తాము. బహుశ అతడు మిమ్మల్ని బ్రతుకనీయవచ్చు.”
32
వారు నడుముకు గోనెపట్ట కట్టుకుని, తలమీద త్రాళ్లు వేసుకుని, ఇశ్రాయేలు రాజు దగ్గరకు వెళ్లి అన్నారు, “మీ సేవకుడైన బెన్-హదదు ఇలా చెప్తున్నాడు: ‘దయచేసి నన్ను బ్రతకనివ్వండి.’ ” రాజు జవాబిస్తూ, “అతడు ఇంకా ప్రాణంతో ఉన్నాడా? అతడు నా సోదరుడు” అని అన్నాడు.
33
ఆ మనుష్యులు దీనిని మంచి సూచనగా తీసుకుని, అతని మాటను త్వరగా అందుకున్నారు. “అవును, బెన్-హదదు మీ సోదరుడు” అని వారు అన్నారు. అప్పుడు రాజు, “మీరు వెళ్లి అతన్ని తీసుకురండి” అన్నాడు. బెన్-హదదు బయటకు వచ్చినప్పుడు, అహాబు అతన్ని తన రథంలో ఎక్కించుకున్నాడు.
34
అప్పుడు బెన్-హదదు, “మీ తండ్రి నుండి నా తండ్రి తీసుకున్న పట్టణాలను మీకు తిరిగి ఇస్తాను. నా తండ్రి సమరయలో చేసినట్టుగా మీరు దమస్కులో మీ సొంత వ్వాపార కేంద్రాలు ఏర్పరచుకోవచ్చు” అని అన్నాడు. అందుకు అహాబు, “ఈ ఒప్పందం మీద నేను నిన్ను విడుదల చేస్తాను” అని అన్నాడు. కాబట్టి అతడు ఒప్పందం చేసుకుని అతన్ని పంపించాడు.
35
యెహోవా మాటచేత, ప్రవక్త బృందంలో ఒకడు తన తోటి ప్రవక్తతో, “నీ ఆయుధంతో నన్ను కొట్టు” అన్నాడు, కాని అతడు నిరాకరించాడు.
36
కాబట్టి ప్రవక్త అన్నాడు, “నీవు యెహోవాకు లోబడలేదు కాబట్టి నన్ను విడిచి వెళ్లిన వెంటనే సింహం నిన్ను చంపుతుంది.” ఆ మనిషి వెళ్లిన తర్వాత ఒక సింహం అతనిపై దాడి చేసి అతన్ని చంపింది.
37
ఆ ప్రవక్త మరొకరి కనుగొని అతనితో, “దయచేసి నన్ను కొట్టు” అన్నాడు. ఆ మనిషి అతని కొట్టి గాయపరచాడు.
38
అప్పుడు ఆ ప్రవక్త వెళ్లి, దారి ప్రక్కన నిలబడి, రాజు కోసం ఎదురుచూశాడు. అతడు తన కళ్లకు గుడ్డ కట్టుకుని మారువేషం వేసుకున్నాడు.
39
రాజు దారిన వెళ్తుండగా, ప్రవక్త రాజును పిలిచి, “మీ సేవకుడనైన నేను యుద్ధం మధ్యలోకి వెళ్లాను. అక్కడ ఒకడు ఒక బందీని తీసుకుని నా దగ్గరకు వచ్చి, ‘ఈ వ్యక్తిని చూసుకోండి. ఒకవేళ అతడు తప్పిపోతే, వాడి ప్రాణానికి బదులుగా నీ ప్రాణం పెట్టాలి. లేదా నీవు ఒక తలాంతు వెండి ఇవ్వాలి’ అని చెప్పాడు.
40
మీ సేవకుడు అక్కడా ఇక్కడా తిరుగుతూ ఉన్నప్పుడు, వాడు కనిపించకుండా పోయాడు” అని చెప్పాడు. ఇశ్రాయేలు రాజు అతనితో, “అది నీ తప్పు, నీ మీదికి నీవే తీర్పు తెచ్చుకున్నావు” అన్నాడు.
41
అప్పుడు ప్రవక్త తన కళ్లకు కట్టుకున్న గుడ్డ త్వరగా తీసివేశాడు, అతడు ప్రవక్తల్లో ఒకడని ఇశ్రాయేలు రాజు అతన్ని గుర్తించాడు.
42
ప్రవక్త రాజుతో అన్నాడు, “యెహోవా చెప్పే మాట ఇదే: ‘చంపబడాలని నేను నిశ్చయించిన మనిషిని నీవు వెళ్లిపోనిచ్చావు. కాబట్టి అతని ప్రాణానికి నీ ప్రాణం, అతని ప్రజలకు బదులు నీ ప్రజలను అర్పిస్తావు.’ ”
43
ఇశ్రాయేలు రాజు విచారంతో, కోపంతో సమరయలో ఉన్న తన భవనానికి వెళ్లిపోయాడు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options