Skip to content
1 రాజులు 20:1-15

1 రాజులు 20:1-15

1
తర్వాత అరాము రాజైన బెన్-హదదు తన సైన్యమంతటిని సమకూర్చుకున్నాడు. అతనితో ముప్పై రెండు మంది రాజులు తమ గుర్రాలు రథాలతో ఉన్నారు. అతడు వచ్చి సమరయను ముట్టడించి దాడి చేశాడు.
2
అతడు పట్టణంలో ఉన్న ఇశ్రాయేలు రాజైన అహాబు దగ్గరకు దూతలను పంపి, “బెన్-హదదు చెప్పేది ఇదే: ‘నీ వెండి బంగారాలు నావే, నీ భార్యల్లో నీ పిల్లల్లో ఉత్తమమైన వారు నా వారే’ ” అని కబురు పంపాడు.
4
అందుకు ఇశ్రాయేలు రాజు, “నా ప్రభువా, రాజా, మీరు చెప్పినట్టే నేనూ, నాకు కలిగినదంతా మీ వశంలో ఉన్నాం” అని జవాబిచ్చాడు.
5
తర్వాత బెన్-హదదు దూతలు తిరిగివచ్చి ఇలా చెప్పారు: “బెన్-హదదు చెప్పేదేంటంటే, ‘నీ వెండిని, నీ బంగారాన్ని, నీ భార్యలను, నీ పిల్లలను నా స్వాధీనం చేయాలని నేను కబురు పంపాను.
6
అయితే రేపు ఇదే వేళకు, నా సేవకులను నీ దగ్గరకు పంపిస్తాను. వారు నీ రాజభవనాన్ని, నీ అధికారుల ఇళ్ళను వెదుకుతారు, నీకు విలువైన ప్రతిదాన్ని వారు తీసుకెళ్తారు.’ ”
7
అప్పుడు ఇశ్రాయేలు రాజు ఆ దేశంలోని పెద్దలందరినీ పిలిపించి వారితో అన్నాడు, “ఈ మనిషి ఎలా కీడును తలపట్టాడో చూడండి! నా భార్యలు, నా పిల్లలు, నా వెండి బంగారాలు కావాలంటూ నాకు కబురు పంపినప్పుడు, నేను కాదనలేదు.”
8
పెద్దలు, ప్రజలు అందరు, “మీరు అతని మాట వినకండి, అతడు అడిగిన వాటికి ఒప్పుకోకండి” అని అన్నారు.
9
కాబట్టి అతడు బెన్-హదదు యొక్క దూతలతో ఇలా అన్నాడు, “నా ప్రభువా, రాజుతో చెప్పండి, ‘మీ సేవకుడనైన నాకు మీరు మొదట చెప్పిన మాట ప్రకారం చేస్తాను. కాని, ఈసారి మీరు కోరినట్టు నేను చేయలేను.’ ” వారు వెళ్లి బెన్-హదదుతో ఆ వార్త చెప్పారు.
10
అప్పుడు బెన్-హదదు అహాబుకు ఇంకొక వార్త పంపాడు: “నా సైనికుల్లో ప్రతి ఒకరు తీసుకెళ్లడానికి సమరయలో పిడికెడు ధూళి మిగిలితే, దేవుళ్ళు నన్ను ఇంతగా, ఇంతకంటే తీవ్రంగా శిక్షించును గాక.”
11
అందుకు ఇశ్రాయేలు రాజు అన్నాడు, “అతనికి చెప్పండి: ‘యుద్ధానికి ఆయుధాలు ధరించినవాడు, యుద్ధం తర్వాత వాటిని తీసివేసే వానిలా అతిశయించకూడదు.’ ”
12
ఈ వార్త వచ్చినప్పుడు బెన్-హదదు, అతనితో ఉన్న రాజులు తమ గుడారాల్లో త్రాగుతూ ఉన్నారు. అతడు తన మనుష్యులతో, “దాడికి సిద్ధపడండి” అని ఆదేశించాడు. కాబట్టి వారు పట్టణం మీద దాడి చేయడానికి సిద్ధపడ్డారు.
13
ఈలోగా, ఇశ్రాయేలు రాజైన అహాబు దగ్గరకు ఒక ప్రవక్త వచ్చి, “యెహోవా చెప్పే మాట ఇదే: ‘ఈ గొప్ప సైన్యాన్ని చూస్తున్నావా? దానిని ఈ రోజు నీ చేతికి అప్పగిస్తాను, అప్పుడు యెహోవాను నేనని నీవు తెలుసుకుంటావు’ ” అని ప్రకటించాడు.
14
“కాని ఇది ఎవరు చేస్తారు?” అని అహాబు అడిగాడు. అందుకు ప్రవక్త అన్నాడు, “యెహోవా చెప్పే మాట ఇదే: ‘ప్రాంతీయ అధికారుల దగ్గర పని చేసే యువ అధికారులు చేస్తారు.’ ” “ఎవరు యుద్ధం ఆరంభిస్తారు?” అని అహాబు అడిగాడు. “నీవే” అని ప్రవక్త జవాబిచ్చాడు.
15
కాబట్టి అహాబు ప్రాంతీయ అధికారుల దగ్గర పని చేసే 232 యువ అధికారులను పిలిపించాడు. తర్వాత అతడు మిగితా ఇశ్రాయేలీయులను, మొత్తం 7,000 మందిని సమకూర్చాడు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options