Truth గురించి బైబిల్ వచనాలు
ముఖ్య బైబిల్ వచనాలు
దేవునికి భయపడే, అన్యాయపు లాభాన్ని అసహ్యించుకునే, నమ్మదగిన సామర్థ్యం కలిగిన పురుషులను ప్రజలందరిలో నుండి ఎంపికచేయాలి. తర్వాత వారిని వేయిమందికి, వందమందికి, యాభైమందికి, పదిమందికి ఒక అధికారి ప్రకారం అధికారులుగా నియమించాలి.
మోషే ఎదుట నుండి ఆయన దాటి వెళ్తూ, “యెహోవా, దేవుడైన యెహోవా కనికరం దయ కలిగినవారు, త్వరగా కోప్పడరు, ప్రేమ నమ్మకత్వాలతో నిండియున్నవారు,
ఆయన మనకు ఆశ్రయదుర్గం, ఆయన పనులు పరిపూర్ణం, ఆయన మార్గాలన్నీ న్యాయమైనవి. ఆయన తప్పుచేయని నమ్మదగిన దేవుడు, ఆయన యథార్థవంతుడు న్యాయవంతుడు.
“ఇప్పుడు యెహోవాకు భయపడి పూర్తి నమ్మకత్వంతో ఆయనను సేవించండి. యూఫ్రటీసు నది అవతల, ఈజిప్టులో మీ పూర్వికులు పూజించిన దేవుళ్ళను విడిచిపెట్టి యెహోవాను సేవించండి.
అయితే మీరు ఖచ్చితంగా యెహోవా పట్ల భయభక్తులు కలిగి నమ్మకంగా మీ పూర్ణహృదయంతో ఆయనను సేవించాలి. ఆయన మీ కోసం చేసిన గొప్ప పనులను జ్ఞాపకం చేసుకోండి.
అప్పుడు ‘నీ సంతతివారు తాము జీవించే విధానం పట్ల జాగ్రత్తగా ఉండి, నా ఎదుట తమ పూర్ణహృదయంతో, పూర్ణ ఆత్మతో నమ్మకంగా నడుచుకుంటే ఇశ్రాయేలు సింహాసనం మీద కూర్చునే వారసుడు నీకు ఉండక మానడు’ అని యెహోవా నాకు చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తారు.
“యెహోవా, నేను నమ్మకంగా, యథార్థ హృదయంతో మీ సన్నిధిలో ఎలా నడుచుకున్నానో, మీ దృష్టిలో సరియైనది ఎలా చేశానో జ్ఞాపకం చేసుకోండి.” హిజ్కియా భారంగా ఏడ్చాడు.
మీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. యెహోవా నా నమ్మకమైన దేవా, నన్ను విడిపించండి.
నా బ్రతుకంతా మీ చేతిలోనే ఉంది; నన్ను వెంటాడే వారి నుండి, నా శత్రువుల చేతుల్లో నుండి నన్ను విడిపించండి.
యెహోవా వాక్కు న్యాయమైనది; ఆయన చేసే ప్రతిదీ నమ్మకమైనది.
మీ నీతిని నా హృదయంలో నేనేమి దాచుకోను; మీ విశ్వసనీయతను మీ రక్షణ సహాయాన్ని గురించి నేను మాట్లాడతాను. మీ మారని ప్రేమను, మీ నమ్మకత్వాన్ని గురించి మహా సమాజానికి చెప్పకుండ దాచిపెట్టను.
మీరు అంతరంగంలో నిజాయితీ కోరతారు; ఆ రహస్య ప్రదేశంలో మీరు నాకు జ్ఞానం బోధించారు.
పరలోకం నుండి సాయం పంపి నన్ను విడిపిస్తారు, నన్ను దిగమ్రింగాలని చూస్తూ నా మీద చాడీలు పలికే వారి బారి నుండి నన్ను తప్పిస్తారు. సెలా దేవుడు తన మారని ప్రేమను, నమ్మకత్వాన్ని పంపుతారు.
ఎందుకంటే మీ మారని ప్రేమ, ఆకాశాలను అంటుతుంది; మీ నమ్మకత్వం మేఘాలంటుతుంది.
మారని ప్రేమ నమ్మకత్వం కలుసుకుంటాయి; నీతి సమాధానం పరస్పరం ముద్దు పెట్టుకుంటాయి.
నమ్మకత్వం భూమిలో నుండి మొలుస్తుంది, నీతి ఆకాశం నుండి తొంగి చూస్తుంది.
కాని ప్రభువా, మీరు కనికరం, కరుణ గల దేవుడు, త్వరగా కోప్పడరు, మారని ప్రేమ, నమ్మకత్వం కలిగి ఉన్నారు.
నీతి న్యాయం మీ సింహాసనానికి పునాదులు; మారని ప్రేమ, నమ్మకత్వం మీ ఎదుట నడుస్తాయి.
యెహోవా రాబోతున్నారు. భూలోకానికి తీర్పు తీరుస్తారు. నీతిని బట్టి లోకానికి, తన నమ్మకత్వాన్ని బట్టి ప్రజలకు తీర్పు తీరుస్తారు.
ఇశ్రాయేలుకు తన ప్రేమను నమ్మకత్వాన్ని చూపాలని ఆయన జ్ఞాపకం చేసుకున్నారు; మన దేవుని రక్షణ భూమ్యంతాల వరకు కనపడింది.
యెహోవా మంచివారు ఆయన మారని ప్రేమ శాశ్వతమైనది; ఆయన నమ్మకత్వం తరతరాలకు ఉంటుంది.
ఎందుకంటే మీ మారని ప్రేమ గొప్పది, అది ఆకాశాల కంటే ఎత్తైనది; మీ నమ్మకత్వం మేఘాలంటుతుంది.
ఆయనకు మొరపెట్టు వారందరికి, నిజాయితీగా మొరపెట్టు వారందరికి యెహోవా సమీపంగా ఉంటారు.
ప్రేమ, నమ్మకత్వం ఎన్నడు నిన్ను విడచిపోనివ్వకు; నీ మెడలో వాటిని ధరించుకో, నీ హృదయమనే పలక మీద వాటిని వ్రాసుకో.
నమ్మకమైన సాక్షులు న్యాయం మాట్లాడతారు, కాని అబద్ధ సాక్షులు అబద్ధాలు మాట్లాడతారు.