Skip to content

High Places గురించి బైబిల్ వచనాలు

21 వచనాలు · 43 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

  1. “ ‘నీవు చేసిన చెడుతనాన్ని బట్టి శ్రమ! నీకు శ్రమ అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.

  2. నీవు నీకోసం ఒక మట్టిదిబ్బను నిర్మించుకున్నావు, ప్రతి బహిరంగ కూడలిలో ఒక ఎత్తైన క్షేత్రాన్ని నిర్మించావు.

  3. ప్రతి వీధి మూలలో నీవు నీ ఎత్తైన క్షేత్రాలను నిర్మించి, నీ అందాన్ని దిగజార్చుకున్నావు, కామం ఎక్కువై దారిన ఎవరు వెళ్తే వారికి నీ కాళ్లను తెరిచి వ్యభిచరించావు.

  4. నీవు కామవాంఛలతో నిండిన నీ పొరుగువారైన ఈజిప్టు వారితో మరి ఎక్కువగా వ్యభిచారం చేసి నాకు కోపాన్ని రేపావు.

  5. కాబట్టి నేను నీ మీదికి చేయి చాచి నీ సరిహద్దులను కుదించాను; నీ అశ్లీల ప్రవర్తనకు దిగ్భ్రాంతి చెందిన ఫిలిష్తీయుల కుమార్తెలైన నీ శత్రువుల దురాశకు నిన్ను అప్పగించాను.

  6. నీకు తృప్తి కలుగలేదు కాబట్టి నీవు అష్షూరీయులతో కూడా వ్యభిచరించావు; ఆ తర్వాత కూడా నీకు తృప్తి కలుగలేదు.

  7. బబులోను వర్తక దేశంతో కూడా వ్యభిచరించావు, అయినా నీకు తృప్తి కలుగలేదు.

  8. “ ‘నీవు ఇవన్నీ చేస్తూ సిగ్గులేని వేశ్యలా ప్రవర్తిస్తూ ఉంటే, నాకు నీ మీద కోపం వచ్చింది, అని ప్రభువైన యెహోవా అంటున్నారు.

  9. నీవు ప్రతి వీధి మూలలో నీ మట్టిదిబ్బలను నిర్మించినప్పుడు, ప్రతి బహిరంగ కూడలిలో నీ క్షేత్రాలను నిర్మించినప్పుడు నీవు ఒక వేశ్య చేసినట్లు చేయలేదు, ఎందుకంటే నీవు డబ్బును తిరస్కరించావు.

  10. “ ‘వ్యభిచారియైన భార్యా! నీవు నీ సొంత భర్త కంటే అపరిచితులే కావాలనుకుంటావు!

  11. వేశ్యలందరూ బహుమతులు తీసుకుంటారు, కానీ నీ ప్రేమికులందరికీ నీవు ఎదురు బహుమతులు ఇస్తావు, నీతో వ్యభిచారం చేయడం కోసం ఎక్కడి నుండైనా నీ దగ్గరకు రావాలని వారికి లంచం ఇస్తావు.

  12. కాబట్టి నీ వ్యభిచారంలో నీకు ఇతరులకు తేడా ఉంది; నీతో వ్యభిచరించడానికి ఎవరూ నీ వెంట పడరు. నీవు డబ్బులు తీసుకోవు కాని తిరిగి నీవే వారికి ఇస్తావు కాబట్టి నీవు చాలా భిన్నమైనదానివి.

  13. “ ‘కాబట్టి, వేశ్యా, నీవు యెహోవా మాట విను!

  14. ప్రభువైన యెహోవా ఇలా అంటున్నారు: నీవు నీ ప్రేమికులతో నీ వ్యభిచారంలో నీ కామాన్ని కుమ్మరించి, నీ నగ్న శరీరాన్ని చూపించినందుకు, నీ అసహ్యకరమైన విగ్రహాల కారణంగా, నీవు వాటికోసం నీ పిల్లల రక్తాన్ని చిందించినందున,

  15. నీకు ఇష్టమైన నీ ప్రేమికులందరిని నీవు ప్రేమించినవారిని అలాగే నీవు ద్వేషించిన వారందరిని పోగుచేస్తాను. నీ చుట్టూ వారిని పోగు చేసి వారు నీ నగ్న శరీరాన్ని చూసేలా వారి ఎదుట నిన్ను వివస్త్రను చేస్తాను.

  16. వ్యభిచారులై హత్యలు చేసే స్త్రీలకు విధించే శిక్షను నేను నీకు విధిస్తాను; నా కోపం, రోషంతో కూడిన రక్త ప్రతీకారాన్ని నేను నీ మీదికి తెస్తాను.

  17. తర్వాత నేను నిన్ను నీ ప్రేమికుల చేతికి అప్పగిస్తాను, వారు నీ మట్టిదిబ్బలను కూల్చివేసి, నీ ఎత్తైన క్షేత్రాలను నాశనం చేస్తారు. వారు నీ బట్టలు విప్పి, నీ సొగసైన నగలును తీసుకుని నిన్ను నగ్నంగా వదిలివేస్తారు.

  18. వారు నీ మీదికి గుంపును రెచ్చగొట్టి పంపుతారు, ఆ గుంపు నిన్ను రాళ్లతో కొట్టి, తమ ఖడ్గాలతో నిన్ను ముక్కలు చేస్తారు.

  19. వారు నీ ఇళ్ళను తగలబెట్టి, అనేకమంది స్త్రీల చూస్తుండగా నీకు శిక్ష విధిస్తారు. నేను నీ వ్యభిచారాన్ని మాన్పిస్తాను, నీవు ఇకపై నీ ప్రేమికులకు డబ్బు చెల్లించవు.

  20. అప్పుడు నీ మీద నా ఉగ్రత తగ్గిపోతుంది, రోషంతో కూడిన నా కోపం నీ మీద నుండి తొలగిపోతుంది; నేను ప్రశాంతంగా ఉంటాను, ఇకపై కోపంగా ఉండను.

  21. “ ‘నీవు నీ యవ్వన దినాలను జ్ఞాపకం చేసుకోక వీటన్నిటితో నాకు కోపం రేపావు కాబట్టి, నీవు చేసిన పనిని నేను నిశ్చయంగా నీ తల మీదికి రప్పిస్తాను అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు. మీరు మీ ఇతర అసహ్యకరమైన ఆచారాలకు అసభ్యతను జోడించలేదా?