కంటెంట్‌కు వెళ్లండి
మత్తయి 27:27-44

మత్తయి 27:27-44

27
అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధిపతి భవనం లోనికి తీసుకెళ్లి, సైనికులందరిని యేసు చుట్టూ సమకూర్చారు.
28
వారు ఆయన బట్టలను తీసివేసి ఆయనకు ఎర్రని అంగీని తొడిగించారు.
29
ముళ్ళతో ఒక కిరీటాన్ని అల్లి ఆయన తలమీద పెట్టారు. ఒక కర్ర తన కుడిచేతిలో ఉంచారు. అప్పుడు ఆయన ఎదుట మోకరించి, “యూదుల రాజా, నీకు శుభం!” అని అంటూ ఆయనను ఎగతాళి చేశారు.
30
వారు ఆయన మీద ఉమ్మివేసి, కర్ర తీసుకుని దానితో ఆయనను తలమీద పదే పదే కొట్టారు.
31
వారు ఆయనను ఎగతాళి చేసిన తర్వాత, ఆయన మీదున్న అంగీని తీసివేసి ఆయన వస్త్రాలను ఆయనకే తొడిగించారు. ఆ తర్వాత ఆయనను సిలువ వేయడానికి తీసుకెళ్లారు.
32
వారు వెళ్తుండగా, కురేనీయ పట్టణానికి చెందిన, సీమోను అనే ఒకడు కనిపించగానే, వారు అతన్ని సిలువ మోయడానికి బలవంతం చేశారు.
33
వారు గొల్గొతా అనే స్థలానికి తీసుకుని వచ్చారు. గొల్గొతా అంటే “కపాల స్థలం” అని అర్థము.
34
అక్కడ వారు చేదు కలిపిన, ద్రాక్షరసాన్ని ఆయనకు ఇచ్చారు; గాని ఆయన దాని రుచి చూసి, త్రాగడానికి ఒప్పుకోలేదు.
35
వారు ఆయనను సిలువ వేసిన తర్వాత, చీట్లు వేసి ఆయన వస్త్రాలను పంచుకున్నారు.
36
వారు అక్కడే కూర్చుని, ఆయనకు కాపలాగా ఉన్నారు.
37
ఆయన మీద మోపబడిన నేరం వ్రాసి ఆయన తలపైన బిగించారు: ఇతడు యేసు, యూదుల రాజు.
38
ఆయనతో పాటు ఇద్దరు బందిపోటు దొంగలను, కుడి వైపున ఒకడిని, ఎడమవైపున ఒకడిని సిలువ వేశారు.
39
ఆ దారిలో వెళ్తున్నవారు తలలు ఊపుతూ,
40
“దేవాలయాన్ని పడగొట్టి మూడు దినాల్లో తిరిగి కడతానన్నావు, నిన్ను నీవే రక్షించుకో! నీవు దేవుని కుమారుడవైతే, సిలువ మీద నుండి దిగిరా” అని అంటూ దూషించారు.
41
అలాగే ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు నాయకులు కూడా ఆయనను ఎగతాళి చేశారు,
42
“వీడు ఇతరులను రక్షించాడు, కాని తనను తాను రక్షించుకోలేడు! ఇశ్రాయేలీయుల రాజు కదా! ఇప్పుడు సిలువ మీది నుండి దిగివస్తే, మేము ఇతన్ని నమ్ముతాము.
43
వీడు దేవుని నమ్మాడు. ‘నేను దేవుని కుమారుడనని’ చెప్పుకొన్నాడు కదా, దేవునికి ఇష్టమైతే దేవుడే ఇతన్ని తప్పిస్తాడు” అన్నారు.
44
ఆయనతో కూడా సిలువవేయబడిన బందిపోటు దొంగలు కూడా ఆయనపై అవమానాలు గుప్పించారు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options