Skip to content
లూకా 6:1-23

లూకా 6:1-23

1
ఒక సబ్బాతు దినాన యేసు పంటచేనుల గుండా వెళ్తున్నప్పుడు, ఆయన శిష్యులు కొన్ని కంకులు తెంపుకొని, తమ చేతుల్లో వాటిని నలిపి తినడం మొదలుపెట్టారు.
2
అది చూసిన పరిసయ్యులు కొందరు, “మీరెందుకు సబ్బాతు దినాన చేయకూడని పని చేస్తున్నారు?” అని వారిని అడిగారు.
3
యేసు వారితో, “దావీదుకు అతనితో ఉన్నవారికి ఆకలి వేసినప్పుడు అతడు ఏమి చేశాడో మీరు చదవలేదా?
4
అతడు దేవుని మందిరంలో ప్రవేశించి, యాజకులు తప్ప మరి ఎవరు తినకూడని ప్రతిష్ఠిత రొట్టెను తీసుకుని, తాను తిని తనతో ఉన్నవారికి కూడా ఇచ్చాడు” అని జవాబిచ్చారు.
5
ఆ తర్వాత యేసు వారితో, “మనుష్యకుమారుడు సబ్బాతు దినానికి ప్రభువు” అని చెప్పారు.
6
మరొక సబ్బాతు దినాన ఆయన సమాజమందిరానికి వెళ్లి బోధిస్తుండగా, అక్కడ కుడి చేతికి పక్షవాతం కలవాడు ఒకడున్నాడు.
7
యేసు మీద నేరం మోపడానికి కారణం వెదుకుతున్న పరిసయ్యులు ధర్మశాస్త్ర ఉపదేశకులు ఆయన సబ్బాతు దినాన వానిని స్వస్థపరుస్తారేమో అని కనిపెట్టుకొని ఉన్నారు.
8
అయితే యేసు వారి ఆలోచనలను తెలిసినవాడై చేతికి పక్షవాతం గలవానితో, “లేచి అందరి ముందు నిలబడు” అన్నారు. అందుకతడు లేచి నిలబడ్డాడు.
9
అప్పుడు యేసు, “నేను మిమ్మల్ని ఒకటి అడుగుతున్నా, సబ్బాతు దినాన ఏది న్యాయం: మంచి చేయడమా లేదా చెడు చేయడమా, ప్రాణం రక్షించడమా లేదా ప్రాణం తీయడమా?” అని వారిని అడిగారు.
10
ఆయన చుట్టూ ఉన్నవారిని చూసి, చేతికి పక్షవాతం గలవానితో, “నీ చేయి చాపు” అన్నారు. వాడు అలాగే చేశాడు, వాని చేయి పూర్తిగా బాగయింది.
11
అయితే పరిసయ్యులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు మండిపడి యేసును ఏమి చేయాలా అని ఒకరితో ఒకరు చర్చించుకోవడం మొదలుపెట్టారు.
12
ఆ రోజుల్లో ఒక రోజు ప్రార్థించడానికి యేసు కొండెక్కి రాత్రంతా దేవుని ప్రార్థిస్తూ గడిపారు.
13
ఉదయమైనప్పుడు, ఆయన తన శిష్యులను పిలిచి వారిలో పన్నెండుమందిని ఎన్నుకుని, వారిని అపొస్తలులుగా నియమించారు. అపొస్తలులు అనగా “పిలువబడిన వారు” అని అర్థము:
14
వారు ఎవరనగా, ఆయన పేతురు అని పేరుపెట్టిన సీమోను, అతని సహోదరుడు అంద్రెయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి,
15
మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడైన యాకోబు, జెలోతే అని పిలువబడే సీమోను,
16
యాకోబు కుమారుడైన యూదా, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా.
17
ఆయన కొండ దిగి వారితో పాటు మైదానంలో నిలబడ్డారు. అక్కడ ఆయన శిష్యుల యొక్క గొప్ప జనసమూహం ఉంది, యూదయ అంతటి నుండి, యెరూషలేము నుండి, తూరు, సీదోను చుట్టూ ఉన్న తీరప్రాంతం నుండి వచ్చిన ప్రజలు పెద్ద సంఖ్యలో ఉన్నారు.
18
వారు ఆయన చెప్పే బోధను వినడానికి తమ వ్యాధుల నుండి స్వస్థత పొందడానికి వచ్చారు. అపవిత్రాత్మలు పీడిస్తున్న వారు కూడా బాగుపడ్డారు,
19
ప్రజలందరూ ఆయనను ముట్టుకోవాలని ప్రయత్నించారు ఎందుకంటే, ఆయనలో నుండి ప్రభావం బయలుదేరి వారందరిని స్వస్థపరుస్తున్నది.
20
తన శిష్యులవైపు చూస్తూ, ఆయన ఇలా బోధించారు: “దీనులైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీదే.
21
ఇప్పుడు ఆకలిగొనిన మీరు ధన్యులు, మీరు తృప్తిపొందుతారు. ఇప్పుడు ఏడుస్తున్న మీరు ధన్యులు, మీరు నవ్వుతారు.
22
మనుష్యకుమారుని నిమిత్తం ప్రజలు మిమ్మల్ని ద్వేషించి, వెలివేసి, మిమ్మల్ని అవమానించి, మీరు చెడ్డవారని మీ పేరును తృణీకరించినప్పుడు మీరు ధన్యులు.
23
“ఆ రోజు మీరు సంతోషించి గంతులు వేయండి, ఎందుకంటే పరలోకంలో మీ బహుమానం గొప్పది. ఎందుకంటే వారి పితరులు కూడా ప్రవక్తలను ఇలాగే హింసించారు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options