నిర్గమకాండము 22:1-15
1
“ఎవరైనా ఎద్దునైన గొర్రెనైన దొంగతనం చేసి దానిని చంపినా లేదా అమ్మినా ఆ ఎద్దుకు బదులు అయిదు ఎద్దులను, ఆ గొర్రెకు బదులు నాలుగు గొర్రెలను నష్టపరిహారంగా ఇవ్వాలి.
2
“రాత్రివేళ దొంగ ఇంట్లోకి చొచ్చుకొని వచ్చి ఒకవేళ దొరికిపోయి చావుదెబ్బలు తింటే కొట్టినవాడు రక్తం కారిన దాన్ని బట్టి అపరాధి కాడు.
3
కాని ఒకవేళ సూర్యోదయం తర్వాత ఇది జరిగితే, కొట్టినవాడు రక్తం కారిన దాన్ని బట్టి అపరాధి అవుతాడు. “ఎవరైనా దొంగతనం చేస్తే తప్పక నష్టపరిహారం చెల్లించాలి, కాని వాని దగ్గర ఏమిలేకపోతే, వారి దొంగతనానికి చెల్లించడానికి వారు అమ్మివేయబడాలి.
4
ఒకవేళ దొంగతనానికి గురియైన జంతువు ప్రాణంతో వారి స్వాధీనంలో కనబడితే, అది ఎద్దు గాని గాడిద గాని గొర్రెగాని దానికి రెండింతలు చెల్లించాలి.
5
“ఒకడు తన పశువులను మేపడానికి ఒక పొలంలోగాని ద్రాక్షతోటలో గాని వదిలిపెట్టినప్పుడు ఆ పశువులు వేరొకని పొలంలో మేస్తే అతడు తన పొలంలో నుండి గాని ద్రాక్షతోటలో నుండి గాని మంచివాటిని నష్టపరిహారంగా చెల్లించాలి.
6
“అగ్ని రాజుకొని ముళ్ళకంపలకు అంటుకున్నందు వల్ల పంట కుప్పలు గాని పొలంలో పైరుగాని లేదా పొలమంతా కాలిపోతే ఆ అగ్నిని అంటించినవాడు నష్టపరిహారం చెల్లించాలి.
7
“ఒకరు తమ డబ్బును గాని వస్తువులను గాని దాచమని తన పొరుగువారికి ఇచ్చినప్పుడు, ఆ వ్యక్తి ఇంట్లోనుండి అవి దొంగతనం చేయబడి ఆ దొంగ దొరికితే వాటికి రెండింతలు వాడు చెల్లించాలి.
8
ఒకవేళ దొంగ దొరక్కపోతే ఆ ఇంటి యజమాని దేవుని ఎదుటకు హాజరు కావాలి, అప్పుడు వారు అతడు తన పొరుగువాని వస్తువులను తీశాడో లేదో తెలుసుకుంటారు.
9
అన్యాయంగా సంపాదించిన ఎద్దు, గాడిద, గొర్రె, బట్ట వంటి వాటన్నిటి విషయంలో పోగొట్టుకున్నవాడు వాటిని చూసి, ‘ఇది నాది’ అని చెప్తే వారిద్దరు దేవుని సమక్షానికి తమ సమస్యను తీసుకురావాలి. న్యాయాధికారులు నేరస్థునిగా నిర్ధారించినవాడు ఎదుటివానికి రెట్టింపు పరిహారం చెల్లించాలి.
10
“ఒకరు తన గాడిదనైన ఎద్దునైన గొర్రెనైన కాపాడమని తన పొరుగువానికి ఇచ్చినప్పుడు అది చనిపోయినా లేదా గాయపడినా లేదా ఎవరూ చూడనప్పుడు దాన్ని ఎవరైనా తీసుకెళ్లినా,
11
పొరుగువాడు ఆ వ్యక్తి ఆస్తి మీద చేతులు వేయలేదని యెహోవా ఎదుట ప్రమాణం చేయడం ద్వారా వారిద్దరి మధ్య సమస్య పరిష్కరించబడుతుంది. యజమాని దానికి అంగీకరించాలి; నష్టపరిహారం అవసరం లేదు.
12
అతని దగ్గర నుండి ఆ జంతువు దొంగతనం చేయబడితే అతడు దాని యజమానికి నష్టపరిహారం చెల్లించాలి.
13
దానిని ఏ మృగమేదైనా చీల్చివేస్తే, సాక్ష్యంగా దాని మిగిలిన భాగాలను తీసుకురావాలి, చీల్చబడినదానికి నష్టపరిహారం అవసరం లేదు.
14
“ఎవరైనా తమ పొరుగువాని దగ్గర నుండి ఒక జంతువును బదులు తీసుకున్నప్పుడు దాని యజమాని దాని దగ్గర లేనప్పుడు, అది గాయపడినా లేదా చచ్చినా, బదులు తీసుకున్నవాడు నష్టపరిహారం చెల్లించాలి.
15
దాని యజమాని దాని దగ్గరే ఉంటే, బదులు తీసుకున్నవాడు నష్టపరిహారం చెల్లించనవసరం లేదు. ఒకవేళ ఆ జంతువు అద్దెకు తెచ్చినదైతే, దాని అద్దె లోనే నష్టం సరిపెట్టబడుతుంది.
Settings