నిర్గమకాండము 12:17-41
17
“పులియని రొట్టెల పండుగ మీరు జరుపుకోవాలి, ఎందుకంటే ఈ రోజునే నేను మీ విభాగాలను ఈజిప్టులో నుండి బయటకు తీసుకువచ్చాను. ఈ రోజును మీరు రాబోయే తరాలకు ఒక నిత్య కట్టుబాటుగా జరుపుకోవాలి.
18
మొదటి నెల పద్నాలుగవ రోజు సాయంత్రం నుండి ఇరవై ఒకటవ రోజు సాయంత్రం వరకు మీరు పులియని రొట్టెలు తినాలి.
19
ఎందుకంటే ఏడు రోజులు మీ ఇళ్ళలో పులిసినదేది ఉండకూడదు. విదేశీయులు గాని స్వదేశీయులు గాని పులిసినదేదైనా తింటే వారిని ఇశ్రాయేలు సమాజం నుండి కొట్టివేయబడాలి.
20
పులిసినదేది మీరు తినకూడదు. మీరుండే అన్ని చోట్లలో పులియని రొట్టెలు మాత్రమే మీరు తినాలి.”
21
అప్పుడు మోషే ఇశ్రాయేలు పెద్దలందరినీ పిలిపించి వారితో ఇలా చెప్పాడు, “మీరు వెంటనే వెళ్లి మీ కుటుంబాల కోసం మందలో నుండి గొర్రెపిల్లను ఎంచుకుని పస్కా గొర్రెపిల్లను వధించండి.
22
హిస్సోపు కొమ్మను తీసుకుని, పళ్ళెంలో ఉన్న రక్తంలో దానిని ముంచి ద్వారబంధపు పైకమ్మికి, రెండు నిలువు కమ్మీలకు పూయాలి. ఉదయం వరకు మీలో ఎవరూ మీ ఇంటి ద్వారం నుండి బయటకు రాకూడదు.
23
యెహోవా ఈజిప్టువారిని హతం చేయడానికి దేశమంతా సంచరిస్తూ, ద్వారబంధపు పైకమ్మికి రెండు నిలువు కమ్మీలకు పూయబడిన రక్తాన్ని చూసి ఆయన ఆ ద్వారాన్ని దాటి వెళ్తారు. సంహారకుడు మీ ఇంట్లోకి వచ్చి మిమ్మల్ని చంపడానికి ఆయన అనుమతించడు.
24
“మీకు మీ వారసులకు ఒక నిత్య కట్టుబాటుగా నా ఈ ఆదేశాలను పాటించాలి.
25
యెహోవా వాగ్దానం చేసినట్లుగా ఆయన మీకు ఇస్తానన్న దేశంలోనికి మీరు ప్రవేశించిన తర్వాత మీరు దీనిని ఆచరించాలి.
26
‘ఈ వేడుకకు అర్థమేంటి?’ అని మీ పిల్లలు మిమ్మల్ని అడిగినప్పుడు
27
మీరు వారితో, ‘ఇది యెహోవాకు పస్కాబలి; ఆయన ఈజిప్టువారిని చంపుతున్నప్పుడు ఈజిప్టులో ఉన్న ఇశ్రాయేలీయుల ఇళ్ళను ఆయన ఏమీ చేయకుండా దాటి వెళ్లారు’ అని చెప్పాలి.” అప్పుడు ప్రజలు తలలు వంచి ఆరాధించారు.
28
యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించిన విధంగానే ఇశ్రాయేలీయులు చేశారు.
29
అర్థరాత్రి సమయంలో సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదటి సంతానం మొదలుకొని చెరసాలలోని ఖైదీ యొక్క మొదటి సంతానం వరకు ఈజిప్టులోని మొదటి సంతానమంతటిని పశువుల మొదటి సంతానాన్ని యెహోవా హతం చేశారు.
30
ఆ రాత్రి సమయంలో ఫరో అతని అధికారులందరు, ఈజిప్టువారందరు లేచారు, ఈజిప్టులో గొప్ప రోదన వినబడింది, ఎందుకంటే మరణం సంభవించని ఇల్లు ఒకటి కూడా లేదు.
31
ఆ రాత్రివేళ ఫరో మోషే అహరోనులను పిలిపించి వారితో, “లేవండి! మీరు ఇశ్రాయేలు ప్రజలు వెంటనే బయలుదేరి నా ప్రజలను వదిలి వెళ్లిపొండి! మీరు కోరినట్లే వెళ్లి యెహోవాను ఆరాధించండి.
32
మీరు చెప్పినట్లే మీ పశువులను గొర్రెలను తీసుకుని వెళ్లండి. అలాగే నన్ను దీవించండి” అని చెప్పాడు.
33
ఈజిప్టువారు ప్రజలను తొందరపెట్టి దేశం విడిచి వెళ్లాలని కోరారు. వారు, “లేకపోతే, మనమందరం చనిపోతాము!” అని అనుకున్నారు.
34
కాబట్టి ఇశ్రాయేలీయులు తమ పిండిముద్దను తీసుకుని అది పులియకముందే దానిని పిండి పిసికే తొట్లలో వేసి బట్టలో మూట కట్టుకుని తమ భుజాలమీద మోసుకొనిపోయారు.
35
ఇశ్రాయేలీయులు మోషే సూచించిన ప్రకారమే చేసి ఈజిప్టువారి దగ్గర నుండి వెండి బంగారు వస్తువులను వస్త్రాలను అడిగి తీసుకున్నారు.
36
యెహోవా ఈజిప్టువారికి ఇశ్రాయేలీయుల పట్ల దయ పుట్టించారు కాబట్టి వారు తమను అడిగి వాటన్నిటిని వారికి ఇచ్చారు. ఆ విధంగా వారు ఈజిప్టువారిని దోచుకున్నారు.
37
అప్పుడు ఇశ్రాయేలీయులు రామసేసునుండి సుక్కోతుకు ప్రయాణమై వెళ్లారు. వారిలో స్త్రీలు పిల్లలు కాకుండా కాలినడకన ఉన్నవారు ఆరు లక్షలమంది పురుషులు.
38
వారితో పాటు అనేకమంది ఇతర ప్రజలు ఉన్నారు అంతేకాక గొర్రెలు పశువుల పెద్ద మందలు కూడా ఉన్నాయి.
39
ఇశ్రాయేలీయులు ఈజిప్టు నుండి తెచ్చిన పిండితో పులియని రొట్టెలు చేసి కాల్చారు. వారు ఈజిప్టు నుండి వెళ్లగొట్టబడినప్పుడు తమ కోసం ఆహారం సిద్ధపరచుకోవడానికి సమయం లేదు కాబట్టి ఆ పిండి పులియలేదు.
40
ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టులో నివసించిన కాలం 430 సంవత్సరాలు.
41
సరిగ్గా 430 సంవత్సరాలు గడిచిన రోజునే యెహోవా సేనలన్ని ఈజిప్టు దేశం నుండి బయలుదేరి వెళ్లిపోయాయి.
బైబిల్ పాఠం: Biblica® Open Telugu Contemporary Version™, © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. · CC BY-SA 4.0“Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc., used with permission.
Settings