2 దినవృత్తాంతములు 28:13-27
13
వారితో, “మీరు ఈ బందీలను ఇక్కడకు తీసుకురాకూడదు, యెహోవా ఎదుట మేము దోషులమవుతాము. మీరు మా పాపాలను దోషాలను ఇంకా ఎక్కువ వేయాలనుకుంటున్నారా? ఇప్పటికే మా దోషం ఎంతో ఎక్కువగా ఉంది, యెహోవా రగులుతున్న కోపం ఇశ్రాయేలు మీద ఉంది” అని చెప్పారు.
14
కాబట్టి సైనికులు ఆ బందీలను, దోపుడుసొమ్మును అధికారులు, సమాజమంతటి సమక్షంలో విడిచిపెట్టారు.
15
పేరు బట్టి నియమితులైన వారు దోపిడిలో నుండి వస్త్రాలు, చెప్పులు తీసి నగ్నంగా ఉన్న బందీలకు ఇచ్చారు. తినడానికి ఆహారం, త్రాగడానికి నీరు, ఔషధ తైలాన్ని ఇచ్చారు. నీరసించిన వారిని గాడిదల మీద ఎక్కించారు. అప్పుడు బందీలను ఖర్జూరపు చెట్ల పట్టణం అనే పేరున్న యెరికోకు తీసుకెళ్లి వారి స్వదేశస్థుల దగ్గర వదిలి, తిరిగి సమరయకు వచ్చారు.
16
ఆ కాలంలో అష్షూరుదేశపు రాజులను సాయం చేయమని ఆహాజు రాజు కబురు పంపాడు.
17
ఎందుకంటే, మరోసారి ఎదోమీయులు యూదా మీదికి దండెత్తివచ్చి, కొందరిని బందీలుగా పట్టుకుపోయారు.
18
ఫిలిష్తీయులు యూదాలోని దక్షిణ పర్వత ప్రాంతాలలోని పట్టణాలపై దాడి చేశారు. వారు బేత్-షెమెషు, అయ్యాలోను గెదెరోతు, అలాగే శోకో, తిమ్నా గిమ్జో వాటి చుట్టుప్రక్కల గ్రామాలను స్వాధీనం చేసుకుని ఆక్రమించారు.
19
ఆహాజు యూదా ప్రజల్లో దుష్టత్వం పెరిగేలా చేసి యెహోవాకు నమ్మకద్రోహం చేశాడు, కాబట్టి ఇశ్రాయేలు రాజైన ఆహాజు కారణంగా యెహోవా యూదా రాజ్యాన్ని అణచివేశారు.
20
అష్షూరు రాజు తిగ్లత్-పిలేసెరు ఆహాజుకు సహాయం చేయడానికి వచ్చాడు గాని, అతని ద్వారా ఆహాజుకు కష్టమే కలిగింది కాని లాభం కాదు.
21
ఆహాజు యెహోవా మందిరంలో నుండి రాజభవనంలో నుండి, అధిపతుల దగ్గరనుండి కొంత సొమ్ము తీసి అష్షూరు రాజుకు ఇచ్చాడు. కాని, దానివలన కూడా సాయం దొరకలేదు.
22
ఆ ఆపదకాలంలో ఆహాజు రాజు యెహోవా పట్ల ఇంకా నమ్మకద్రోహం చేశాడు.
23
తనను ఓడించిన దమస్కు నగరవాసులకున్న దేవుళ్ళకు బలులు అర్పించాడు. “సిరియా రాజులకు వారి దేవుళ్ళు సహాయం చేసినట్లు నాకూ సాయం చేసేలా నేను వాటికి బలులు అర్పిస్తాను” అని అనుకున్నాడు. అయితే ఆ దేవుళ్ళ వలన అతనికి ఇశ్రాయేలు ప్రజలందరికి పతనం కలిగింది.
24
ఆహాజు యెహోవా మందిరంలో ఉన్న సామాగ్రిని పోగుచేయించి వాటిని ముక్కలు చేశాడు. యెహోవా ఆలయ ద్వారాలు మూసివేసి, యెరూషలేము అంతా బలిపీఠాలను కట్టించాడు.
25
యూదా దేశంలోని పట్టణాలన్నిటిలో అతడు ఇతర దేవుళ్ళకు ధూపం వేయడానికి బలిపీఠాలను కట్టించి తన పితరుల దేవుడైన యెహోవాకు కోపం తెప్పించారు.
26
ఆహాజు పరిపాలనకు సంబంధించిన ఇతర విషయాలు, అతని విధానాలన్నీ, మొదటి నుండి చివరి వరకు, యూదా, ఇశ్రాయేలు రాజు గ్రంథంలో వ్రాసి ఉన్నాయి.
27
ఆహాజు చనిపోయి తన పూర్వికుల దగ్గరకు చేరాడు. అతన్ని యెరూషలేము పట్టణంలో పాతిపెట్టారు గాని, ఇశ్రాయేలు రాజు సమాధుల్లో కాదు. అతని తర్వాత అతని కుమారుడైన హిజ్కియా రాజయ్యాడు.
బైబిల్ పాఠం: Biblica® Open Telugu Contemporary Version™, © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. · CC BY-SA 4.0“Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc., used with permission.
Settings