Skip to content
1 సమూయేలు 17:32-51

1 సమూయేలు 17:32-51

32
దావీదు సౌలుతో, “ఈ ఫిలిష్తీయుని చూసి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. మీ సేవకుడనైన నేను వెళ్లి వానితో పోరాడతాను” అన్నాడు.
33
అందుకు సౌలు దావీదుతో, “ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోరాడటానికి నీ బలం సరిపోదు. నీవు ఇంకా చిన్నపిల్లవాడివి! అతడు చిన్నప్పటి నుండే యుద్ధవీరుడు” అని చెప్పాడు.
34
అందుకు దావీదు సౌలుతో, “మీ సేవకుడనైన నేను నా తండ్రి గొర్రెలను కాస్తుండగా ఒక సింహం ఎలుగుబంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రెపిల్లను ఎత్తుకుపోతుంటే,
35
నేను దానిని తరిమి చంపి దాని నోటిలో నుండి ఆ గొర్రెను విడిపించాను. అది నా మీద దాడి చేసినప్పుడు దాని గడ్డం పట్టుకుని కొట్టి చంపాను.
36
మీ సేవకుడనైన నేను సింహాన్ని ఎలుగుబంటిని చంపాను. సజీవుడైన దేవుని సైన్యాలను అవమానిస్తున్న ఈ సున్నతిలేని ఫిలిష్తీయుడు వాటిలో ఒక దానిలా అవుతాడు.
37
దావీదు ఇంకా మాట్లాడుతూ, సింహపు పంజానుండి ఎలుగుబంటి చేతిలో నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడా నన్ను విడిపిస్తారు” అన్నాడు. అప్పుడు సౌలు, “వెళ్లు, యెహోవా నీకు తోడుగా ఉంటారు” అని దావీదుతో అన్నాడు.
38
సౌలు తన యుద్ధ వస్త్రాలను, యుద్ధకవచాన్ని దావీదుకు తొడిగించి ఇత్తడి శిరస్త్రాణం అతని తలపై పెట్టాడు.
39
దావీదు ఆ యుద్ధకవచం వేసుకుని కత్తి పట్టుకుని నడవడానికి ప్రయత్నించాడు కాని అవి అతనికి అలవాటు లేకపోవడం వలన అతడు నడవలేకపోయాడు. అందుకతడు, “ఇవి నాకు అలవాటు లేదు కాబట్టి వీటితో నేను వెళ్లలేను” అని సౌలుతో చెప్పి వాటిని తీసివేశాడు.
40
అతడు తన చేతికర్రను పట్టుకుని ఏటిలో నుండి అయిదు సన్నని రాళ్లు ఏరుకుని తన దగ్గర ఉన్న చిన్న సంచిలో వేసుకుని తన వడిసెల పట్టుకుని ఆ ఫిలిష్తీయుని దగ్గరకు వెళ్లాడు.
41
తన డాలు మోసేవాడు తనకు ముందు నడుస్తుండగా ఆ ఫిలిష్తీయుడు బయలుదేరి దావీదుకు దగ్గరగా వచ్చి,
42
ఎర్రగా, అందంగా ఉన్న దావీదును చూసి చిన్నపిల్లవాడని అతన్ని పట్టించుకోలేదు.
43
అతడు దావీదుతో, “కర్ర తీసుకుని నా మీదికి వస్తున్నావు నేనేమైనా కుక్కనా?” అని చెప్పి తన దేవుళ్ళ పేరట దావీదును శపించాడు.
44
ఆ ఫిలిష్తీయుడు దావీదుతో, “నా దగ్గరకు రా, నీ మాంసాన్ని పక్షులకు మృగాలకు వేస్తాను!” అన్నాడు.
45
అందుకు దావీదు ఆ ఫిలిష్తీయునితో, “నీవు కత్తి ఈటె బల్లెం తీసుకుని నా మీదికి వస్తున్నావు కాని నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యాల దేవుడును సైన్యాల అధిపతియైన యెహోవా పేరట నేను నీ మీదికి వస్తున్నాను.
46
ఈ రోజు యెహోవా నిన్ను నా చేతికి అప్పగిస్తారు; నేను నిన్ను చంపి నీ తల నరికివేస్తాను. నేను ఈ రోజే ఫిలిష్తీయుల కళేబరాలను పక్షులకు అడవి జంతువులకు వేస్తాను. ఇశ్రాయేలీయులలో దేవుడున్నాడని లోకమంతా తెలుసుకుంటుంది.
47
అప్పుడు యెహోవా కత్తితో గాని ఈటెతో గాని రక్షించేవాడు కాడని ఇక్కడ ఉన్నవారందరు తెలుసుకుంటారు. యుద్ధం యెహోవాదే, ఆయనే మిమ్మల్ని మా చేతికి అప్పగిస్తారు” అన్నాడు.
48
ఆ ఫిలిష్తీయుడు దావీదుపై దాడి చేయడానికి ముందుకు రాగానే దావీదు అతన్ని ఎదుర్కోడానికి సైన్యం వైపు పరుగెత్తి వెళ్లాడు.
49
దావీదు తన సంచిలో నుండి ఒక రాయి తీసి వడిసెలలో పెట్టి విసిరి ఆ ఫిలిష్తీయుని నుదిటి మీద కొట్టాడు. ఆ రాయి అతని నుదిటి లోపలికి చొచ్చుకొని పోగా గొల్యాతు నేలపై బోర్లాపడ్డాడు.
50
అలా దావీదు ఆ ఫిలిష్తీయుని కేవలం ఒక వడిసెల ఒక రాయితో జయించాడు; తన చేతిలో కత్తి లేకుండానే ఆ ఫిలిష్తీయుని పడగొట్టాడు.
51
అప్పుడు దావీదు పరుగెత్తుకొని వెళ్లి ఆ ఫిలిష్తీయుని మీద నిలబడి వాని ఒరలో ఉన్న కత్తిని తీసి ఆ కత్తితోనే వాని చంపి, వాని తల నరికివేశాడు. ఫిలిష్తీయులు తమ వీరుడు చనిపోవడం చూసి పారిపోయారు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options