Skip to content
1 రాజులు 13:11-25

1 రాజులు 13:11-25

11
ఆ కాలంలో బేతేలులో ఒక వృద్ధుడైన ప్రవక్త ఉండేవాడు. అతని కుమారులు వచ్చి ఆ రోజు అక్కడ ఆ దైవజనుడు చేసిందంతా అతనికి చెప్పారు. అతడు రాజుతో ఏమి చెప్పాడో కూడా తమ తండ్రికి చెప్పారు.
12
వారి తండ్రి వారిని, “అతడు ఏ దారిన వెళ్లాడు?” అని అడిగాడు. అతని కుమారులు యూదా నుండి వచ్చిన దైవజనుడు వెళ్లిన దారి చూపించారు.
13
కాబట్టి అతడు తన కుమారులతో, “గాడిదకు జీను వేయండి” అని చెప్పాడు. వారు అతని కోసం గాడిద మీద జీను వేశారు, అతడు గాడిదను ఎక్కి,
14
ఆ దైవజనుని వెదుకుతూ వెళ్లాడు. అతడు సింధూర వృక్షం క్రింద కూర్చుని ఉండడం చూసి ఆ ప్రవక్త, “యూదా నుండి వచ్చిన దైవజనుడవు నీవేనా?” అని అడిగాడు. “నేనే” అని అతడు జవాబిచ్చాడు.
15
కాబట్టి ప్రవక్త అతనితో, “నాతో ఇంటికి వచ్చి భోజనం చేయి” అన్నాడు.
16
అందుకు ఆ దైవజనుడు, “నేను తిరిగి మీతో రాలేను, మీతో కలిసి ఈ స్థలంలో భోజనం గాని, నీళ్లు గాని పుచ్చుకోలేను.
17
యెహోవా వాక్కు ద్వారా నేను ఇలా ఆదేశించబడ్డాను: ‘నీవు అక్కడ భోజనం చేయవద్దు, నీళ్లు త్రాగవద్దు, నీవు వచ్చిన దారిన తిరిగి వెళ్లవద్దు’ అని యెహోవా వాక్కు ద్వారా నేను ఆదేశించబడ్డాను” అన్నాడు.
18
ఆ వృద్ధుడైన ప్రవక్త జవాబిస్తూ, “నీలాగే నేను కూడా ప్రవక్తనే. యెహోవా వాక్కు ద్వారా దేవదూత నాతో, ‘అతడు భోజనం చేసి నీళ్లు త్రాగేలా అతన్ని నీతో పాటు నీ ఇంటికి తీసుకురా’ అన్నాడు” అని చెప్పాడు. (కాని అతడు అబద్ధమాడాడు.)
19
కాబట్టి ఆ దైవజనుడు అతనితో పాటు తిరిగివెళ్లి అతని ఇంట్లో అన్నపానాలు పుచ్చుకున్నాడు.
20
వారు ఇంకా బల్ల దగ్గర కూర్చుని ఉండగానే అతన్ని తీసుకువచ్చిన వృద్ధుడైన ప్రవక్త దగ్గరకు యెహోవా వాక్కు వచ్చింది.
21
యూదా నుండి వచ్చిన దైవజనునితో అతడు, “యెహోవా చెప్పే మాట ఇదే: ‘నీవు యెహోవా మాటను ధిక్కరించావు, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను పాటించలేదు.
22
నీవు భోజనం గాని నీళ్లు గాని తీసుకోవద్దు అని ఆయన ఏ స్థలాన్ని గురించి ఆజ్ఞాపించారో, ఆ స్థలంలో నీవు భోజనం, నీళ్లు తీసుకున్నావు. కాబట్టి నీ శవం నీ పూర్వికుల సమాధిలో పాతిపెట్టబడదు’ ” అని చెప్పాడు.
23
దైవజనుడు భోజనం చేసి నీళ్లు త్రాగిన తర్వాత, అతన్ని తీసుకువచ్చిన ప్రవక్త అతని కోసం గాడిద మీద జీను వేశాడు.
24
అతడు తన దారిన వెళ్తున్నప్పుడు ఒక సింహం ఎదురై అతన్ని చంపేసింది. అతని శవం త్రోవలోనే పడి ఉంది. దాని ప్రక్కన గాడిద సింహం నిలబడి ఉన్నాయి.
25
బాటసారులు కొందరు శవం దారిలో పడి ఉండడం, శవం దగ్గర సింహం నిలబడి ఉండడం చూసి, వెళ్లి ఆ వృద్ధుడైన ప్రవక్త ఉన్న పట్టణంలో ఆ సంగతి చెప్పారు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options