The Tribe Of Manasseh గురించి బైబిల్ వచనాలు
ముఖ్య బైబిల్ వచనాలు
“యోసేపు ఫలించే కొమ్మ, నీటిబుగ్గ దగ్గర ఫలించే కొమ్మ దాని తీగెలు గోడ మీదికి ఎక్కి ప్రాకుతాయి.
అసూయతో విలుకాండ్రు అతనిపై దాడి చేశారు; అతనిపై బాణాలు విసిరారు.
కానీ అతని విల్లు స్థిరంగా నిలిచింది, అతని చేతులు బలంగా ఉన్నాయి, ఎందుకంటే యాకోబు యొక్క బలవంతుని హస్తాన్ని బట్టి, కాపరి, ఇశ్రాయేలు యొక్క బండను బట్టి,
నీకు సహాయం చేసే నీ తండ్రి యొక్క దేవున్ని బట్టి, పైనున్న ఆకాశాల దీవెనలతో, క్రింది అగాధజలాల దీవెనలతో, స్తనాల దీవెనలతో గర్భం యొక్క దీవెనలతో, నిన్ను ఆశీర్వదించే సర్వశక్తిమంతున్ని బట్టి బలపరచబడ్డాయి.
నీ తండ్రి ఆశీర్వాదాలు పురాతన పర్వత ఆశీర్వాదాల కంటే, ప్రాచీన కొండల యొక్క కోరదగిన వాటికంటే గొప్పవి. ఇవన్నీ యోసేపు తలమీద, తన సోదరులలో అధికారిగా ఉన్న వాడిపై ఉండాలి.
ఎనిమిదవ రోజు అర్పణను తెచ్చిన వారు మనష్షే గోత్ర నాయకుడు, పెదాసూరు కుమారుడైన గమలీయేలు.
అతని అర్పణ: పరిశుద్ధాలయ షెకెల్ ప్రకారం నూట ముప్పై షెకెళ్ళ బరువు ఉన్న వెండి పళ్ళెం, డెబ్బై షెకెళ్ళ బరువు ఉన్న వెండి చిలకరింపు పాత్ర, భోజనార్పణ కోసం ఈ రెండింటి నిండా ఒలీవనూనె కలిపిన నాణ్యమైన పిండి;
ధూపద్రవ్యంతో నిండిన పది షెకెళ్ళ బరువు ఉన్న బంగారు పళ్ళెం;
దహనబలి కోసం ఒక కోడె, ఒక పొట్టేలు, ఏడాది మగ గొర్రెపిల్ల;
పాపపరిహారబలి కోసం మేకపోతు;
సమాధానబలి కోసం రెండు ఎద్దులు, అయిదు పొట్టేళ్లు, అయిదు మేకపోతులు, అయిదు ఏడాది మగ గొర్రెపిల్లలు.
మనష్షే వారసులు: మాకీరు ద్వార, మాకీరీయుల వంశం (మాకీరు గిలాదు యొక్క తండ్రి); గిలాదు ద్వార, గిలాదీయుల వంశము.
గిలాదు వారుసులు: ఈజరు ద్వార, ఈజరీయుల వంశం; హెలెకు ద్వార, హెలెకీయుల వంశం;
అశ్రీయేలు ద్వార, అశ్రీయేలీయుల వంశం; షెకెము ద్వార, షెకెమీయుల వంశం;
షెమీదా ద్వార, షెమీదయీయుల వంశం; హెఫెరు ద్వార, హెఫెరీయుల వంశము.
(హెఫెరు కుమారుడైన సెలోఫెహాదుకు కుమారులు లేరు; అతనికి కుమార్తెలు మాత్రమే ఉన్నారు, వారి పేర్లు, మహ్లా, నోవా, హొగ్లా, మిల్కా, తిర్సా.)
యోసేపు కుమారుడైన మనష్షే వంశానికి చెందిన మనష్షే కుమారుడైన మాకీరు, అతని కుమారుడు గిలాదు, అతని కుమారుడు హెఫెరు, అతని కుమారుడైన సెలోఫెహాదు కుమార్తెలు. ఆ కుమార్తెల పేర్లు మహ్లా, నోవా, హొగ్లా, మిల్కా, తిర్సా. వీరు ముందుకు వచ్చి
సమావేశ గుడార ద్వారం దగ్గర మోషే, యాజకుడైన ఎలియాజరు, నాయకులు సమాజమంతటి ఎదుట నిలబడి,
“మా తండ్రి అరణ్యంలో చనిపోయాడు. అతడు యెహోవాకు విరుద్ధంగా తిరుగుబాటు చేసిన కోరహు సమూహంలో లేడు, కానీ తన సొంత పాపాన్ని బట్టి చనిపోయాడు, అతనికి కుమారులు లేరు.
కుమారులు లేనందుకు మా తండ్రి పేరు అతని వంశం నుండి తీసివేయబడాలి? మా తండ్రి బంధువుల్లో మాకు స్వాస్థ్యం ఇవ్వండి” అని అన్నారు.
మోషే ఈ విషయాన్ని యెహోవా దగ్గరకు తెచ్చాడు,
యెహోవా మోషేతో అన్నారు,
సెలోఫెహాదు కుమార్తెలు చెప్పేది న్యాయమైనదే. నీవు వారికి తమ తండ్రి బంధువుల్లో వారసత్వంగా స్వాస్థ్యం ఖచ్చితంగా ఇచ్చి వారి తండ్రి వారసత్వాన్ని వారికి ఇవ్వాలి.
మనష్షే కుమారుడైన మాకీరు వంశస్థులు గిలాదుకు వెళ్లి, దాన్ని జయించి, అక్కడ ఉన్న అమోరీయులను తరిమేశారు.
కాబట్టి మోషే మనష్షే కుమారుడైన మాకీరు వంశస్థులకు గిలాదును ఇచ్చాడు. వారు అక్కడే కాపురమున్నారు.