లూకా 3:1-18
1
తిబెరి కైసరు ఏలుచున్న పదిహేనవ సంవత్సరంలో, యూదయ ప్రాంతానికి అధిపతిగా పొంతి పిలాతు, గలిలయ ప్రాంతానికి చతుర్థాధిపతిగా హేరోదు, ఇతూరియా త్రకోనీతి అనే ప్రాంతాలకు చతుర్థాధిపతిగా అతని తమ్ముడైన ఫిలిప్పు అబిలేనె ప్రాంతానికి చతుర్థాధిపతిగా లుసానీయ ఉన్నారు.
2
అన్నా కయపాల ప్రధాన యాజకత్వం కొనసాగుతున్న సమయంలో, అరణ్యంలో నివసిస్తున్న జెకర్యా కుమారుడైన యోహాను దగ్గరకు దేవుని వాక్కు వచ్చింది.
3
అతడు యూదయలోని యొర్దాను నదీ తీరప్రాంతమంతా వెళ్తూ పాపక్షమాపణ కొరకై పశ్చాత్తాపపడి బాప్తిస్మం పొందుకోండని ప్రకటిస్తున్నాడు.
4
ప్రవక్తయైన యెషయా గ్రంథంలో వ్రాయబడి ఉన్నట్లు: “అరణ్యంలో ఒక స్వరం ఎలుగెత్తి ఇలా చెప్తుంది, ‘ప్రభువు కోసం మార్గాన్ని సిద్ధపరచండి, ఆయన కోసం త్రోవలను సరాళం చేయండి.
5
ప్రతి లోయ పూడ్చబడుతుంది, ప్రతి పర్వతం, కొండ సమం చేయబడుతుంది. వంకర త్రోవలు తిన్నగా, గరుకు మార్గాలు నున్నగా చేయబడతాయి.
6
దేవుని రక్షణను ప్రజలందరు చూస్తారు.’ ”
7
తనచే బాప్తిస్మం పొందడానికి వస్తున్న జనసమూహంతో యోహాను, “సర్పసంతానమా! రానున్న ఉగ్రత నుండి తప్పించుకోడానికి మిమ్మల్ని ఎవరు హెచ్చరించారు?
8
పశ్చాత్తాపానికి తగిన ఫలాలను ఫలించండి. ‘అబ్రాహాము మాకు తండ్రిగా ఉన్నాడు’ అని మీలో మీరు అనుకోవడం మొదలుపెట్టవద్దు. దేవుడు ఈ రాళ్ల నుండి కూడా అబ్రాహాముకు సంతానం కలుగజేయగలడు అని మీతో చెప్తున్నాను.
9
ఇప్పటికే గొడ్డలి చెట్ల వేరు దగ్గర పెట్టబడింది, మంచి పండ్లు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది.”
10
అందుకు జనసమూహం, “అయితే మేము ఏమి చేయాలి?” అని అడిగారు.
11
అందుకు యోహాను, “రెండు చొక్కాలు ఉన్నవాడు ఏమిలేని వానికి ఇవ్వాలి, ఆహారం కలవాడు కూడా అలాగే చేయాలి” అన్నాడు.
12
పన్ను వసూలు చేసేవారు కూడ బాప్తిస్మం పొందడానికి వచ్చారు. వారు, “బోధకుడా, మేము ఏమి చేయాలి?” అని అడిగారు.
13
అందుకు అతడు వారితో, “మీకు నిర్ణయించబడిన పన్ను కంటే ఎక్కువ తీసుకోవద్దు” అని చెప్పాడు.
14
తర్వాత కొందరు సైనికులు వచ్చి, “మేము ఏమి చేయాలి?” అని అడిగారు. అందుకతడు, “ఎవరి దగ్గరి నుండి అక్రమంగా డబ్బు తీసుకోవద్దు అన్యాయంగా ఎవరి మీదా నేరం మోపవద్దు, మీ జీతంతో తృప్తిగా ఉండండి” అని వారితో చెప్పాడు.
15
ప్రజలు క్రీస్తు వస్తాడని ఆశతో ఎదురుచూస్తూ ఉన్నారు కాబట్టి యోహానే క్రీస్తు అయి ఉంటాడా అని వారందరు తమ హృదయాల్లో అనుకుంటూ ఉన్నారు.
16
అప్పుడు యోహాను వారందరితో అన్నాడు, “నేను నీటితో మీకు బాప్తిస్మమిస్తున్నాను. కాని నాకన్నా శక్తిమంతుడు ఒకడు వస్తాడు, ఆయన చెప్పుల వారును విప్పడానికి కూడా నేను యోగ్యున్ని కాదు. ఆయన మీకు పరిశుద్ధాత్మతో, అగ్నితో బాప్తిస్మం ఇస్తారు.
17
గోధుమల నుండి పొట్టును వేరు చేయడానికి తన చేతిలో చేటతో ఆయన సిద్ధంగా ఉన్నారు. ఆయన గోధుమలను తన ధాన్యపు కొట్టులో పోసి, తన నూర్చెడి కల్లమును శుభ్రం చేసి, పొట్టును ఆరని అగ్నిలో కాల్చివేస్తారు.”
18
అతడు ఇంకా అనేకమైన ఇతర మాటలతో వారిని హెచ్చరిస్తూ వారికి సువార్త ప్రకటించాడు.
బైబిల్ పాఠం: Biblica® Open Telugu Contemporary Version™, © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. · CC BY-SA 4.0“Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc., used with permission.
Settings