లూకా 2:41-52
41
ప్రతి సంవత్సరం పస్కా పండుగకు యేసు తల్లిదండ్రులు యెరూషలేముకు వెళ్లేవారు.
42
ఆయన పన్నెండేళ్ళ వాడై ఉన్నప్పుడు, ఆచారం ప్రకారం వారు పండుగకు వెళ్లారు.
43
ఆ పండుగ ముగిసిన తర్వాత, వారు తిరిగి ఇంటికి వెళ్తుండగా, బాలుడైన యేసు యెరూషలేములోనే ఉండిపోయారు కాని ఆయన తల్లిదండ్రులకు ఆ సంగతి తెలియలేదు.
44
ఆయన తమ గుంపు వారితోనే ఉన్నాడని అనుకుని, వారు ఒక రోజు ప్రయాణం చేశారు. తర్వాత తమ బంధువులలోను పరిచితులలోను ఆయన కోసం వెదకడం మొదలుపెట్టారు.
45
వారికి ఆయన కనబడకపోయేసరికి, వారు ఆయనను వెదకడానికి తిరిగి యెరూషలేముకు వెళ్లారు.
46
మూడు దినాలైన తర్వాత దేవాలయ ఆవరణంలో, బోధకుల మధ్య ఆయన కూర్చుని, వారి మాటలను వింటూ వారిని ప్రశ్నలు అడగడం వారు చూశారు
47
ఆయన మాటలను విన్న ప్రతి ఒక్కరు ఆయనకున్న గ్రహింపుకు, ఆయన ఇచ్చే జవాబులకు ఆశ్చర్యపడ్డారు.
48
ఆయన తల్లిదండ్రులు ఆయనను చూసి, విస్తుపోయారు. ఆయన తల్లి ఆయనతో, “కుమారుడా, ఎందుకు ఇలా చేశావు? నేను మీ తండ్రి ఆందోళన చెంది నీకోసం వెదకుతున్నాము” అన్నది.
49
అందుకు ఆయన, “మీరెందుకు నా కోసం వెదుకుతున్నారు? నేను నా తండ్రి ఇంట్లో ఉండాలని మీకు తెలియదా?” అని వారితో అన్నారు.
50
అయితే ఆయన వారితో చెప్తున్న దానిని వారు గ్రహించలేకపోయారు.
51
ఆ తర్వాత యేసు వారితో కలిసి నజరేతుకు వెళ్లి వారికి లోబడి ఉన్నారు. అయితే ఆయన తల్లి ఈ సంగతులన్నిటిని తన హృదయంలో భద్రం చేసుకున్నది.
52
యేసు జ్ఞానంలోను వయస్సులోను దేవుని దయలోను మనుష్యుల దయలోను వర్ధిల్లారు.
Settings