Skip to content
లూకా 10:1-24

లూకా 10:1-24

1
ఆ తర్వాత ప్రభువు ఇంకా డెబ్బైరెండు మంది శిష్యులను ఏర్పరచుకొని వారిని ఇద్దరిద్దరిగా తాను వెళ్లబోయే ప్రతి పట్టణానికి స్థలానికి తనకు ముందుగా వారిని పంపారు.
2
ఆయన వారితో, “కోత సమృద్ధిగా ఉంది, కాని పనివారు కొద్దిమందే ఉన్నారు. పనివారిని పంపుమని కోత యజమానిని అడగండి” అన్నారు.
3
వెళ్లండి! నేను మిమ్మల్ని తోడేళ్ళ మధ్యకు గొర్రెపిల్లల్లా పంపుతున్నాను.
4
మీ చేతుల్లో డబ్బు సంచి గాని సంచి గాని చెప్పులు గాని తీసుకోవద్దు; దారిలో ఎవరిని పలకరించకూడదు.
5
“మీరు ఒక ఇంట్లో ప్రవేశించినప్పుడు, మొదట, ‘ఈ ఇంటికి సమాధానం కలుగును గాక’ అని చెప్పండి.
6
ఒకవేళ అక్కడ సమాధానం కోరేవారుంటే, మీ సమాధానం వారి మీద నిలుస్తుంది; ఒకవేళ లేకపోతే, అది మీకే తిరిగి వస్తుంది.
7
వారు ఏది ఇచ్చినా తింటూ త్రాగుతూ, అక్కడే ఉండండి, ఎందుకంటే పనివాడు జీతానికి పాత్రుడు. ఇంటింటికి తిరుగవద్దు.
8
“మీరు ఒక గ్రామంలోనికి ప్రవేశించినప్పుడు, వారు మిమ్మల్ని చేర్చుకొంటే, వారు మీకు ఇచ్చే వాటిని తినండి.
9
అక్కడ ఉన్న రోగులను స్వస్థపరచండి, ‘దేవుని రాజ్యం సమీపించింది’ అని వారితో చెప్పండి.
10
అయితే మీరు ఒక గ్రామంలోనికి ప్రవేశించినప్పుడు, అక్కడి వారు మిమ్మల్ని చేర్చుకోకపోతే, మీరు ఆ గ్రామ వీధులలోనికి వెళ్లి,
11
‘మీకు హెచ్చరికగా మా పాదాల దుమ్మును కూడా దులిపి వేస్తున్నాము. అయినా దేవుని రాజ్యం సమీపించింది’ అని తెలుసుకోండి.
12
నేను చెప్పేదేంటంటే, తీర్పు దినాన ఆ గ్రామానికి పట్టిన గతికంటే సొదొమ గతి భరించ గలదిగా ఉంటుంది.
13
“కొరజీనూ, నీకు శ్రమ! బేత్సయిదా నీకు శ్రమ! ఎందుకంటే మీలో జరిగిన అద్భుతాలు తూరు సీదోను పట్టణాల్లో జరిగి ఉంటే, ఆ ప్రజలు చాలా కాలం క్రిందటే గోనెపట్ట కట్టుకుని బూడిదలో కూర్చుని, పశ్చాత్తాపపడి ఉండేవారు.
14
అయితే తీర్పు దినాన మీ గతికంటే తూరు సీదోను పట్టణాల గతి భరించ గలదిగా ఉంటుంది.
15
ఓ కపెర్నహూమా, నీవు ఆకాశానికి ఎత్తబడతావా? లేదు, నీవు పాతాళంలోనికి దిగిపోతావు.
16
“మీ మాటలను వినేవారు నా మాటలను వింటారు; మిమ్మల్ని నిరాకరించే వారు నన్ను నిరాకరిస్తారు; అయితే నన్ను నిరాకరించే వారు నన్ను పంపినవానిని నిరాకరిస్తారు” అన్నారు.
17
ఆ డెబ్బైరెండు మంది సంతోషంగా తిరిగివచ్చి ఆయనతో, “ప్రభువా, దయ్యాలు కూడ నీ పేరిట మాకు లోబడుతున్నాయి” అని చెప్పారు.
18
దానికి ఆయన, “సాతాను ఆకాశం నుండి మెరుపులా పడడం చూశాను.
19
ఇదిగో, పాములను, తేళ్ళను త్రొక్కడానికి, శత్రు బలమంతటిని జయించడానికి నేను మీకు అధికారం ఇచ్చాను; ఏవి మీకు ఏమాత్రం హాని చేయవు.
20
అయినా కానీ, దయ్యాలు మీకు లోబడుతున్నాయని సంతోషించకండి, కాని మీ పేర్లు పరలోకంలో వ్రాయబడి ఉన్నాయని సంతోషించండి” అని వారికి చెప్పారు.
21
ఆ సమయంలో, యేసు పరిశుద్ధాత్మలో బహుగా ఆనందిస్తూ, ఇలా అన్నారు: “తండ్రీ! భూమి ఆకాశాలకు ప్రభువా, నీవు ఈ సంగతులను జ్ఞానులకు తెలివైనవారికి మరుగుచేసి, చిన్న పిల్లలకు బయలుపరిచావు కాబట్టి నేను నిన్ను స్తుతిస్తున్నాను. అవును, తండ్రీ, ఈ విధంగా చేయడం నీకు సంతోషము.
22
“నా తండ్రి నాకు సమస్తం అప్పగించారు. కుమారుడు ఎవరో తండ్రికి తప్ప ఎవరికి తెలియదు, అలాగే తండ్రి ఎవరో కుమారునికి, కుమారుడు ఎవరికి తెలియచేయాలని అనుకున్నారో వారికి తప్ప మరి ఎవరికి తెలియదు.”
23
అప్పుడు ఆయన తన శిష్యులవైపు తిరిగి వారితో ఏకాంతంగా, “మీరు చూస్తున్నవాటిని చూసే కళ్లు ధన్యమైనవి.
24
ఎందుకంటే అనేకమంది ప్రవక్తలు, రాజులు మీరు చూస్తున్నవాటిని చూడాలనుకున్నారు కాని వారు చూడలేదు, మీరు వినేవాటిని వినాలని అనుకున్నారు కాని వినలేదు అని మీతో చెప్తున్నాను” అని అన్నాడు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options