యెహోషువ 22:21-29
21
అప్పుడు రూబేను, గాదు, మనష్షే అర్థగోత్రం వారు ఇశ్రాయేలు వంశ పెద్దలకు ఇలా జవాబిచ్చారు:
22
“శక్తిమంతుడైన యెహోవా దేవుడు! శక్తిమంతుడైన దేవుడు యెహోవా! అది ఆయనకు తెలుసు! ఇశ్రాయేలుకు తెలియనివ్వండి! ఇది యెహోవా పట్ల ద్రోహంతో గాని తిరుగుబాటుతో గాని చేసివుంటే ఈ రోజు మమ్మల్ని రక్షించవద్దు.
23
యెహోవాను విడిచిపెట్టి దహనబలులు భోజనార్పణలు సమాధానబలులు అర్పించడానికి మేము సొంత బలిపీఠాన్ని కట్టుకున్నట్లయితే, యెహోవాయే స్వయంగా మమ్మల్ని లెక్క అడుగుతారు.
24
“నిజమేమిటంటే, భవిష్యత్తులో మీ సంతతివారు మా సంతతివారితో, ‘ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను ఆరాధించడానికి మీకు ఏం హక్కు ఉంది?
25
రూబేనీయులారా, గాదీయులారా, యెహోవా మాకు మీకు మధ్య యొర్దానును సరిహద్దుగా చేశారు! యెహోవాలో మీకు వాటా లేదు’ అని అంటారేమో! మీ సంతతివారు మా సంతతివారిని యెహోవాకు భయపడకుండా చేస్తారేమో!
26
“అందుకే మేము, ‘మనం బలిపీఠం కట్టడానికి సిద్ధపడదాం రండి, అయితే అది దహనబలులు బలులు అర్పించడం కోసం కాదు’ అని అనుకున్నాము.
27
మనం దహనబలులు బలులు సమాధాన బలులతో యెహోవాను ఆయన పరిశుద్ధాలయంలో ఆరాధించాలని చెప్పడానికి అది మాకు మీకు తర్వాతి తరాల వారికి మధ్య సాక్షిగా ఉండాలి. అప్పుడు భవిష్యత్తులో మీ సంతతివారు మా సంతతివారితో, ‘మీకు యెహోవాలో వాటా లేదు’ అని అనలేరు.
28
“మేము, ‘వారు ఎప్పుడైనా మాతో గాని మా వారసులతో గాని ఒకవేళ అంటే, మా పూర్వికులు కట్టిన యెహోవా బలిపీఠం ప్రతిరూపాన్ని చూడండి; దహనబలులు బలులు అర్పించడం కోసం కాదు; అది మీకు మాకు మధ్య సాక్షిగా ఉండాలని కట్టారు’ అని చెప్పాలని అనుకున్నాము.
29
“మన దేవుడైన యెహోవా సమావేశ గుడారం ఎదుట దహనబలులు, భోజనార్పణలు, అర్పణల కొరకైన బలిపీఠం కాక మరొక బలిపీఠం కట్టి, నేడు యెహోవాను విడిచిపెట్టి ఆయన మీద తిరుగుబాటు చేయడం మాకు దూరమవును గాక.”
Settings