యిర్మీయా 48:1-20
1
మోయాబు గురించి: ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా చెప్తున్నారు: “నెబోకు శ్రమ, అది శిథిలమైపోతుంది. కిర్యతాయిము ఆక్రమించబడి అవమానించబడుతుంది; దాని కోట పడగొట్టబడి అవమానించబడుతుంది.
2
మోయాబును ఇకపై పొగడరు; హెష్బోను ప్రజలు ఆమె పతనానికి కుట్ర చేస్తారు: ‘రండి, ఆ దేశాన్ని అంతం చేద్దాము.’ మద్మేను ప్రజలారా, మీరు కూడా మౌనంగా ఉంటారు; ఖడ్గం నిన్ను వెంటాడుతుంది.
3
హొరొనయీము నుండి ఆర్తనాదాలు వినబడుతున్నాయి, అక్కడ మహా వినాశనం, నాశనం జరుగుతున్నాయి.
4
మోయాబు ధ్వంసమవుతుంది; దాని చిన్న బిడ్డలు బిగ్గరగా ఏడుస్తారు.
5
వారు కొండపై నుండి లూహీతుకు, ఏడుస్తూ వెళ్తున్నారు; హొరొనయీముకు వెళ్లే దారిలో జరిగిన విధ్వంసం వల్ల ప్రజల ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి.
6
పారిపోండి! మీ ప్రాణాలు కాపాడుకోండి; ఎడారిలో పొదలా ఉండండి.
7
మీరు మీ క్రియలను, ఐశ్వర్యాన్ని నమ్ముతారు కాబట్టి, మీరు కూడా బందీలుగా కొనిపోబడతారు, అలాగే కెమోషు దేవుడు తన యాజకులతో, అధికారులతో పాటు బందీగా వెళ్తాడు.
8
యెహోవా చెప్పారు కాబట్టి నాశనం చేసేవాడు ప్రతి పట్టణం మీదికి వస్తాడు, ఒక్క పట్టణం తప్పించుకోదు. లోయ పాడైపోతుంది, పీఠభూమి నాశనమవుతుంది.
9
మోయాబుకు రెక్కలు ఇవ్వబడితే, అది ఎగిరిపోయి, దేశం వ్యర్థంగా పడి ఉండేది; నివసించేవారు లేక, దాని పట్టణాలు నిర్జనమైపోయేవి.
10
“యెహోవా పనిని అశ్రద్ధగా చేసేవారు శాపగ్రస్తులు! రక్తం చిందించకుండ తమ ఖడ్గాన్ని ఒరలో పెట్టేవారు శాపగ్రస్తులు!
11
“మోయాబు యవ్వన నుండి ప్రశాంతంగా ఉండింది, ఒక బాన నుండి మరొక బానలో పోయబడని, అడుగున మడ్డితో ఉన్న ద్రాక్షరసంలా ఉండింది, అది చెరలోకి వెళ్లలేదు. కాబట్టి దాని రుచి ఎప్పటిలాగే ఉంది, దాని సువాసన మారలేదు.”
12
యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, “రాబోయే రోజుల్లో నేను, కుండను కుమ్మరించే వారిని పంపినప్పుడు, వారు దాన్ని బయటకు కుమ్మరించి, కుండలను ఖాళీచేసి వాటిని పగలగొడతారు.
13
ఇశ్రాయేలీయులు బేతేలును నమ్మినప్పుడు ఎలా సిగ్గుపడ్డారో మోయాబీయులు కెమోషును బట్టి సిగ్గుపడతారు.
14
“ ‘మేము యోధులం, యుద్ధంలో పరాక్రమవంతులం’ అని మీరు ఎలా చెప్పగలరు?
15
మోయాబు నాశనమై దాని పట్టణాలు ఆక్రమించబడతాయి; దాని శ్రేష్ఠమైన యువకులు వధకు గురవుతారు,” అని రాజు ప్రకటిస్తున్నారు, ఆయన పేరు సైన్యాల యెహోవా.
16
“మోయాబు పతనం సమీపించింది; దాని విపత్తు త్వరగా వస్తుంది.
17
దాని చుట్టూ నివసించేవారలారా, దాని కీర్తి తెలిసినవారలారా, దాని గురించి దుఃఖించండి; ‘బలమైన రాజదండం ఎలా విరిగిపోయింది, కీర్తి కలిగిన దండం ఎలా విరిగిపోయింది!’ అని అనండి.
18
“దీబోను కుమార్తెలారా, మీ కీర్తి నుండి క్రిందికి దిగి, ఎండిపోయిన నేల మీద కూర్చుండి, ఎందుకంటే మోయాబును నాశనం చేసేవాడు మీ మీదికి వస్తాడు మీ కోట పట్టణాలను పతనం చేస్తాడు.
19
అరోయేరులో నివసించేవారలారా, రోడ్డు ప్రక్కన నిలబడి చూడండి. పారిపోతున్న పురుషుడిని, తప్పించుకుంటున్న స్త్రీని, ‘ఏమైంది?’ అని అడగండి.
20
మోయాబు కుప్పకూలిపోయి, అపకీర్తి పాలయింది. రోదించండి, బిగ్గరగా ఏడవండి! మోయాబు నాశనమైపోయిందని అర్నోనులో ప్రకటించండి.
Settings