Skip to content
యిర్మీయా 48:29-39

మోయాబు గర్వంపై దైవిక శిక్షావిధి

యిర్మీయా 48:29-39
29
“మోయాబు గర్వం గురించి దానికి అహంకారం గురించి దాని తలపొగరు, దాని గర్వం, దాని దురహంకారం, దాని హృదయ అతిశయం గురించి విన్నాము.
30
దాని తలపొగరు నాకు తెలుసు, దానికి ఏ విలువలేదు, దాని ప్రగల్భాలు ఏమీ సాధించవు, అని యెహోవా ప్రకటిస్తున్నారు.
31
కాబట్టి నేను మోయాబు గురించి రోదిస్తున్నాను, మోయాబు అంతటి కోసం నేను బిగ్గరగా ఏడుస్తున్నాను, కీర్ హరెశెతు ప్రజల కోసం నేను మూలుగుతున్నాను.
32
షిబ్మా ద్రాక్షలారా, యాజెరు ఏడ్చినట్లు, నేను మీ కోసం ఏడుస్తున్నాను. మీ కొమ్మలు సముద్రం వరకు వ్యాపించాయి; అవి యాజెరు వరకు వ్యాపించాయి. నాశనం చేసేవాడు, పండిన మీ పండ్ల మీద, ద్రాక్షపండ్ల మీద పడ్డాడు.
33
మోయాబు పండ్ల తోటల్లో నుండి, పొలాల్లో నుండి ఆనందం, సంతోషం పోయాయి. నేను వారి గానుగల నుండి ద్రాక్షరసం రాకుండ చేశాను; ఆనందంతో కేకలువేస్తూ వాటిని ఎవరూ త్రొక్కరు. కేకలు వినిపించినప్పటికీ, అవి ఆనందంతో వేసిన కేకలు కావు.
34
“నిమ్రీములోని నీళ్లు కూడా ఎండిపోయాయి కాబట్టి హెష్బోను నుండి ఎల్యాలెహు యాహాజుల వరకు, సోయరు నుండి హొరొనయీము, ఎగ్లత్-షెలీషియాల వరకు, వారి కేకలు వినిపిస్తున్నాయి.
35
క్షేత్రాల దగ్గర అర్పణలు అర్పించేవారిని మోయాబులో తమ దేవుళ్ళకు ధూపం వేసేవారిని నేను మోయాబులో లేకుండా చేస్తాను” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
36
“కాబట్టి నా హృదయం మోయాబు గురించి పిల్లనగ్రోవిలా విలపిస్తుంది; అది కీర్ హరెశెతు ప్రజలకు పిల్లనగ్రోవిలా విలపిస్తుంది. వారు సంపాదించిన సంపద పోయింది.
37
ప్రతి తల గుండు చేయబడింది ప్రతి గడ్డం కత్తిరించబడింది; ప్రతి చేయి నరకబడింది ప్రతి నడుము గోనెపట్టతో కప్పబడింది.
38
మోయాబులో ఇళ్ల పైకప్పులన్నిటి మీద బహిరంగ కూడళ్లలో దుఃఖం తప్ప మరేమీ లేదు, పనికిరాని కుండను పగలగొట్టినట్లు నేను మోయాబును పగులగొట్టాను” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
39
“అది ఎలా శిథిలమైపోయిందో! వారు ఎలా విలపిస్తున్నారో! మోయాబు సిగ్గుతో ఎలా వెన్నుచూపిస్తుందో! మోయాబు దాని చుట్టూ ఉన్నవారందరికి, హేళనగా భయం పుట్టించేదిగా మారింది.”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options