యిర్మీయా 25:27-38
27
“అప్పుడు వారితో, ‘ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: నేను మీ మధ్యకు పంపే ఖడ్గాన్ని బట్టి ఇకపై లేవకుండా పడిపోండి, త్రాగండి, త్రాగి వాంతులు చేసుకోండి.’
28
అయితే వారు మీ చేతిలో నుండి పాత్ర తీసుకుని త్రాగడానికి నిరాకరిస్తే, నీవు వారితో ఇలా చెప్పు, ‘మీరు దీన్ని త్రాగాలి అని సైన్యాల యెహోవా చెప్తున్నారు.
29
ఇదిగో, నా పేరు ఉన్న పట్టణం మీదికి నేను విపత్తు రప్పించబోతున్నాను, మీరు నిజంగా శిక్షించబడరా? మీరు శిక్షించబడకుండా ఉండరు, ఎందుకంటే నేను భూమిపై నివసించే వారందరిపై ఖడ్గాన్ని రప్పిస్తున్నాను, అని సైన్యాల యెహోవా ప్రకటిస్తున్నారు.’
30
“ఇప్పుడు నీవు వారికి ఈ మాటలన్నీ ప్రవచించి వారితో ఇలా చెప్పు: “ ‘యెహోవా పైనుండి గర్జిస్తారు; ఆయన తన పవిత్ర నివాసం నుండి ఉరుముతారు; ఈ దేశానికి వ్యతిరేకంగా బలంగా గర్జిస్తారు. ద్రాక్షపండ్లను త్రొక్కేవారి మీద ఆయన గట్టిగా అరుస్తారు, భూమిపై నివసించే వారందరికి వ్యతిరేకంగా కేకలు వేస్తారు.
31
భూదిగంతముల వరకు ఆ సందడి ప్రతిధ్వనిస్తుంది, ఎందుకంటే యెహోవా దేశాల మీద ఆరోపణలు చేస్తాడు; అతడు సమస్త మానవాళికి తీర్పు తెచ్చి, దుర్మార్గులను ఖడ్గానికి గురి చేస్తాడు’ ” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
32
సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: “ఇదిగో! దేశం నుండి దేశానికి విపత్తు విస్తరిస్తుంది; పెను తుఫాను భూమి అంచుల నుండి ఎగసిపడుతుంది.”
33
ఆ సమయంలో యెహోవాచేత చంపబడినవారు భూమి ఈ చివర నుండి ఆ చివర వరకు ప్రతిచోటా ఉంటారు. వారి కోసం ఎవరూ దుఃఖించరు, వారి మృతదేహాలను సేకరించి పాతిపెట్టరు, అవి నేలమీద పెంటలా పడి ఉంటాయి.
34
కాపరులారా, ఏడవండి రోదించండి; మంద నాయకులారా, దుమ్ములో దొర్లండి. ఎందుకంటే మీరు వధించబడే సమయం ఆసన్నమైంది; మీరు శ్రేష్ఠమైన పొట్టేళ్లలా పడిపోతారు.
35
గొర్రెల కాపరులకు పారిపోవడానికి చోటు ఉండదు, మందలోని నాయకులు తప్పించుకోవడానికి స్థలం ఉండదు.
36
గొర్రెల కాపరుల మొర, మంద నాయకుల ఏడ్పులు వినబడుతున్నాయి, యెహోవా వారి పచ్చికను నాశనం చేస్తున్నారు.
37
నెమ్మదిగల పచ్చికభూములు యెహోవా కోపాగ్నికి పాడవుతాయి.
38
సింహం తన గుహలో నుంచి వచ్చినట్లు ఆయన వస్తారు, అణచివేసే వారి ఖడ్గం కారణంగా యెహోవా తీవ్రమైన కోపం కారణంగా వారి భూమి నిర్జనమైపోతుంది.
Settings