ఆదికాండము 24:29-53
29
రిబ్కాకు లాబాను అనే సోదరుడు ఉన్నాడు, అతడు వెంటనే నీటిబుగ్గ దగ్గర ఉన్న ఆ వ్యక్తిని కలవడానికి వెళ్లాడు.
30
లాబాను రిబ్కా ధరించిన ముక్కుపుడక, చేతి కడియాలు చూసి, ఆ వ్యక్తి రిబ్కాతో మాట్లాడినదంతా ఆమె తన వారితో చెప్పినప్పుడు, వెంటనే ఆ వ్యక్తిని కలవడానికి వెళ్లి, ఆ బావి దగ్గర తన ఒంటెలతో నిలబడి ఉండడం చూశాడు.
31
“యెహోవా వలన ఆశీర్వదించబడినవాడా, లోపలికి రా, నీవు బయటే ఎందుకు నిలబడ్డావు? నీవు బసచేయడానికి ఇల్లును, ఒంటెలకు స్థలాన్ని సిద్ధం చేశాను” అని అతడు అన్నాడు.
32
కాబట్టి ఆ వ్యక్తి ఆ ఇంటికి వెళ్లి, ఒంటెల మీది నుండి బరువును దించారు. వాటికి మేత వేశారు, అతనికి, అతనితో ఉన్న మనుష్యులందరికి కాళ్లు కడుక్కోడానికి నీళ్లు ఇచ్చారు.
33
అతనికి భోజనం వడ్డించారు కాని అతడు, “నేను వచ్చిన పని ఏంటో మీకు చెప్పకుండా నేను తినను” అని అన్నాడు. అందుకు లాబాను, “అయితే చెప్పు” అన్నాడు.
34
అప్పుడు అతడు, “నేను అబ్రాహాము సేవకుడను.
35
యెహోవా నా యజమానిని ఎంతో దీవించారు కాబట్టి అతడు చాలా ధనికుడయ్యాడు. అతనికి గొర్రెలను, మందలను, వెండి బంగారాలను, దాసదాసీలను, ఒంటెలను, గాడిదలను ఆయన ఇచ్చారు.
36
నా యజమాని భార్య శారా తన వృద్ధాప్యంలో కుమారున్ని కన్నది, తన ఆస్తినంతటిని అతనికి ఇచ్చాడు.
37
నా యజమాని నాతో ప్రమాణం చేయించి, ‘నీవు నా కుమారునికి నేను నివసించే కనానీయుల కుమార్తెలలో నుండి భార్యను తీసుకురాకూడదు,
38
అయితే నా తండ్రి ఇంటికి, నా బంధువుల దగ్గరకు వెళ్లి, నా కుమారునికి భార్యను తీసుకురా’ అని చెప్పాడు.
39
“అందుకు నేను, ‘ఒకవేళ ఆమె నాతో రాకపోతే ఎలా?’ అని నా యజమానిని అడిగాను.
40
“అందుకతడు జవాబిస్తూ, ‘నేను ఇంతవరకు ఎవరి ఎదుట నమ్మకంగా జీవించానో, ఆ యెహోవా తన దూతను నీకు ముందుగా పంపి నీ ప్రయాణం విజయవంతం చేస్తారు, కాబట్టి నీవు నా సొంత వంశస్థులలో నుండి నా తండ్రి ఇంటి నుండి నా కుమారుని కోసం భార్యను తీసుకువస్తావు.
41
నీవు మా వంశస్థుల దగ్గరకు వెళ్లినప్పుడు ఒకవేళ వారు ఆమెను ఇవ్వడానికి ఒప్పుకోకపోతే, నీకు ఈ ప్రమాణం నుండి విముక్తి’ అని అన్నాడు.
42
“ఈ రోజు నేను నీటిబుగ్గ దగ్గరకు వచ్చినప్పుడు, ‘యెహోవా, నా యజమానియైన అబ్రాహాము దేవా! మీకు ఇష్టమైతే, నా ప్రయాణం సఫలం చేయండి.
43
ఇదిగో, నేను ఈ నీటిబుగ్గ దగ్గర నిలబడి ఉన్నప్పుడు ఒకవేళ ఒక యువతి నీళ్ల చేదుకోడానికి వస్తే, నేను, “దయచేసి త్రాగడానికి నీ కుండ నుండి కొన్ని నీళ్లు ఇవ్వు” అని నేను అడిగితే,
44
ఏ యువతైతే, “త్రాగండి, మీ ఒంటెలకు కూడా నీళ్లు తోడి పోస్తాను” అని అంటుందో, ఆ యువతే యెహోవా నా యజమాని కుమారునికి భార్య కావాలి’ అని నేను ప్రార్థన చేశాను.
45
“నేను నా హృదయంలో ఇంకా ప్రార్థన ముగించకముందే, రిబ్కా తన కుండను భుజంపై పెట్టుకుని రావడం నేను చూశాను. ఆమె బావిలోనికి దిగివెళ్లి నీళ్లు తోడుకున్న తర్వాత, ఆమెతో, ‘దయచేసి త్రాగడానికి నాకు నీళ్లు ఇవ్వు’ అని అడిగాను.
46
“త్వరగా ఆమె కడవ భుజం మీది నుండి దింపుకుని, ‘త్రాగండి, మీ ఒంటెలకు కూడా నీళ్లు ఇస్తాను’ అని అన్నది. కాబట్టి నేను త్రాగాను ఒంటెలకు కూడా ఆమె నీళ్లు పోసింది.
47
“అప్పుడు నేను, ‘నీవు ఎవరి కుమార్తెవు?’ అని అడిగాను. “అందుకు ఆమె, ‘మిల్కా నాహోరులకు పుట్టిన బెతూయేలు కుమార్తెను’ అని చెప్పింది. “అప్పుడు నేను ఆమెకు ముక్కు పుడకను, చేతులకు కడియాలు ఇచ్చి,
48
తలవంచి నేను యెహోవాను ఆరాధించాను; నా యజమాని సోదరుని మనవరాలిని తన కుమారునికి భార్యగా తీసుకురావడానికి నన్ను సరియైన మార్గంలో నడిపించిన నా యజమాని అబ్రాహాముకు దేవుడైన యెహోవాను స్తుతించాను.
49
ఇప్పుడు మీరు నా యజమాని పట్ల దయను, నమ్మకత్వాన్ని చూపాలనుకున్నా, ఒకవేళ లేదు అనుకున్నా చెప్పండి. అప్పుడు నేను ఏ మార్గంలో వెళ్లాలో తెలుసుకుంటాను” అని అన్నాడు.
50
అప్పుడు లాబాను, బెతూయేలు ఇలా జవాబిచ్చారు, “ఇది యెహోవా చేసిన కార్యం; ఈ విషయంలో మేము చెప్పేది ఏమి లేదు.
51
ఇదిగో రిబ్కా, ఆమెను తీసుకెళ్లండి. యెహోవా సూచించినట్లే ఆమె నీ యజమాని కుమారునికి భార్య అవును గాక.”
52
అబ్రాహాము సేవకుడు ఈ మాటలు విని, యెహోవా ఎదుట నేల మీద సాష్టాంగపడ్డాడు.
53
తర్వాత ఆ వ్యక్తి వెండి, బంగారు నగలు, వస్త్రాలు రిబ్కాకు ఇచ్చాడు; అతడు ఆమె సోదరునికి, ఆమె తల్లికి కూడా విలువైన కానుకలిచ్చాడు.
Settings