దానియేలు 2:28-49
28
అయితే మర్మాలు బయలుపరిచే ఒక దేవుడు పరలోకంలో ఉన్నాడు. ఆయనే నెబుకద్నెజరు రాజుకు రాబోయే రోజుల్లో జరిగేది తెలియజేశారు. మీ మంచం మీద మీరు పడుకున్నప్పుడు మీ మనస్సులోనికి వచ్చిన మీ కల, మీ దర్శనాలు ఇవి:
29
“రాజా! మీరు పడుకున్నప్పుడు, రాబోయే సంగతుల గురించి మీరు ఆలోచిస్తుండగా, మర్మాలను తెలిపేవాడు జరగబోయే దానిని చూపించారు.
30
నా మట్టుకైతే, ఈ మర్మం నాకు బయలుపరచబడింది, నేను ఇతరులకంటే గొప్ప జ్ఞానం కలిగినవాడినని కాదు గాని, రాజుకు భావం తెలియజేయడానికి, మీ మనస్సులోని ఆలోచనలు మీరు గ్రహించాలని అది బయలుపరచబడింది.
31
“రాజా! మీరు మీ కలలో చూసినప్పుడు మీ ఎదుట ఒక బ్రహ్మాండమైన విగ్రహం ఉంది. అది గొప్పది, ప్రకాశమానమైన, భయంకరమైన ప్రతిమ.
32
ఆ ప్రతిమ తల మేలిమి బంగారంతో, దాని రొమ్ము, చేతులు వెండితో, దాని కడుపు, తొడలు ఇత్తడితో,
33
దాని కాళ్లు ఇనుముతో, దాని పాదాలు కొంత ఇనుము కొంత బంకమట్టితో చేయబడింది.
34
మీరు చూస్తుండగా, మనిషి చేతి సహాయం లేకుండా ఒక రాయి వచ్చి ఇనుము బంకమట్టితో ఉన్న ఆ విగ్రహం పాదాల మీద పడి వాటిని విరగ్గొట్టింది.
35
అప్పుడు ఇనుము, బంకమట్టి, ఇత్తడి, వెండి, బంగారం ముక్కలుగా విరిగిపోయి, వేసవికాలంలో నూర్పిడి కళ్ళం మీద పడే పొట్టులా అయ్యింది. జాడ తెలియలేనంతగా గాలి వాటిని ఈడ్చుకెళ్తుంది. అయితే ఆ విగ్రహాన్ని కొట్టిన ఆ రాయి మహా పర్వతంగా మారి భూమంతా నిండింది.
36
“ఇదే కల, ఇప్పుడు దాని భావం రాజుకు మేము వివరిస్తాము.
37
రాజా! మీరు రాజులకు రాజు. పరలోక దేవుడు మీకు అధికారాన్ని, శక్తిని, బలాన్ని, వైభవాన్ని అనుగ్రహించారు;
38
ఆయన మానవులందరిని, భూజంతువులను, ఆకాశ పక్షులను మీ చేతుల్లో ఉంచారు. వారున్న ప్రతిచోట ఆయన మిమ్మల్ని పాలకునిగా చేశారు. ఆ విగ్రహానికి ఉన్న బంగారు తల మీరు.
39
“మీ తర్వాత, మీకంటే తక్కువగా ఉన్న మరో సామ్రాజ్యం లేస్తుంది. దాని తర్వాత ఇత్తడి సూచనగా ఉన్న మూడవ సామ్రాజ్యం, లోకమంతటిని పరిపాలిస్తుంది.
40
చివరికి, ఇనుము వంటి బలమైన నాలుగవ సామ్రాజ్యం వస్తుంది. ఇనుము అన్నిటిని విరగ్గొట్టి ముక్కలుగా చేసినట్లు, ఆ రాజ్యం ఇతరులందరిని చితుకగొట్టి, విరగ్గొడుతుంది.
41
ఆ విగ్రహ పాదాలు, కాళ్ల వేర్లు కొంత ఇనుము, కొంత బంకమట్టితో ఉన్నట్టు మీరు చూసిన విధంగా అది విభజించబడిన రాజ్యంగా ఉంటుంది; అయినా ఇనుము బంకమట్టితో కలిసి ఉన్నట్లు, దానిలో కొంత ఇనుములా బలంగా ఉంటుంది.
42
కాళ్ల వ్రేళ్లు కొంత ఇనుము, కొంత బంకమట్టితో ఉన్నట్లు, ఆ రాజ్యం కొంత బలంగా, కొంత బలహీనంగా ఉంటుంది.
43
ఇనుము, బంకమట్టితో కలిసినట్లు మీరు చూసినట్లే, ఆ రాజ్య ప్రజలు మిశ్రితమై ఉంటారు. అయినా ఇనుము బంకమట్టితో కలవనట్లు, వారు కూడా ఐక్యంగా ఉండలేరు.
44
“ఆ రాజుల కాలంలో పరలోక దేవుడు ఒక రాజ్యం నెలకొల్పుతారు, అది ఎన్నటికి నశించదు, అది ఇతర ప్రజల చేతిలో పడదు. అది ఆ రాజ్యాలన్నిటినీ చితగ్గొట్టి, వాటిని తుదముట్టిస్తుంది, కాని అది మాత్రం ఎప్పటికీ నిలుస్తుంది.
45
మనుష్యుల చేతితో ముట్టని రాయి, పర్వతం నుండి చీలిపోయి ఇనుమును, ఇత్తడిని, వెండిని, బంగారాన్ని ముక్కలు చేసినట్లు వచ్చిన ఆ దర్శనానికి అర్థం ఇది. “గొప్ప దేవుడు భవిష్యత్తులో జరిగేది రాజుకు వెల్లడి చేశారు. ఈ కల నిజం, దాని వివరణ నమ్మదగినది.”
46
అప్పుడు నెబుకద్నెజరు రాజు దానియేలు ఎదుట సాష్టాంగపడి, అతన్ని పూజించి, అతనికి నైవేద్యం ధూపం అర్పించమని ఆదేశించాడు.
47
రాజు దానియేలుతో, “నిజంగా నీ దేవుడే దేవుళ్ళకు దేవుడు, రాజులకు ప్రభువు, మర్మాలను బయలుపరిచేవాడు, ఎందుకంటే ఈ మర్మాన్ని నీవు బయలుపరిచావు” అన్నాడు.
48
అప్పుడు రాజు దానియేలుకు ఉన్నత పదవిని ఇచ్చి, ఎన్నో గొప్ప బహుమానాలు ఇచ్చాడు. అతన్ని బబులోను సామ్రాజ్యమంతటి మీద అధికారిగా చేశాడు, ఆ దేశ జ్ఞానులందరి మీద ప్రధానిగా నియమించాడు.
49
అంతేకాక, రాజు దానియేలు చేసిన మనవి ప్రకారం షద్రకు, మేషాకు, అబేద్నెగోలను బబులోను సామ్రాజ్యంలో నిర్వాహకులుగా నియమించాడు, అయితే దానియేలు రాజభవనంలోనే ఉండిపోయాడు.
బైబిల్ పాఠం: Biblica® Open Telugu Contemporary Version™, © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. · CC BY-SA 4.0“Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc., used with permission.
Settings