Skip to content
2 కొరింథీయులకు 5:11-21

2 కొరింథీయులకు 5:11-21

11
అయితే, ప్రభువుకు భయపడడం అంటే ఏమిటో మాకు తెలుసు కాబట్టి ఇతరులకు నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తున్నాము. మేమేంటో దేవునికి స్పష్టంగా తెలుసు, మీ మనస్సాక్షికి కూడ స్పష్టంగా తెలుసని నేను నమ్ముతున్నాను.
12
మరల మీ ముందు మమ్మల్ని మేము పొగడుకోవాలని ప్రయత్నించడం లేదు కాని, హృదయంలో ఉన్నదానిని బట్టి కాక, కనిపించే దానిని బట్టి గర్వించే వారికి మీరు జవాబు చెప్పగలిగేలా మమ్మల్ని బట్టి మీరు గర్వించడానికి ఒక కారణాన్ని ఇస్తున్నాము.
13
కొందరు చెప్పినట్లు, మేము పిచ్చివారమైతే అది దేవుని కోసం మాత్రమే; మేము వివేకవంతులమైనా అది మీ కోసమే.
14
క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది, ఎందుకంటే అందరి కోసం ఒక్కడే మరణించాడు కాబట్టి అందరు మరణించినట్టే అని మనం ఒప్పించబడ్డాము.
15
ఆయన అందరి కోసం చనిపోయారు, కాబట్టి జీవిస్తున్నవారు ఇకపై తమ కోసం కాక, వారి కోసం మరణించి తిరిగి లేచిన ఆయన కొరకే జీవించాలి.
16
అందువల్ల, మేము ఇప్పటినుండి లోక దృష్టితో ఎవరిని లక్ష్యపెట్టము. ఒకప్పుడు మేము క్రీస్తును ఇలాగే లక్ష్యపెట్టినా, ఇక మేము అలా చేయము.
17
కాబట్టి ఎవరైనా క్రీస్తులో ఉంటే, వారు నూతన సృష్టి; పాతవి గతించాయి, క్రొత్తవి మొదలయ్యాయి!
18
ఇదంతా దేవుని వల్లనే జరిగింది, ఆయన క్రీస్తు ద్వారా మనల్ని తనతో సమాధానపరచుకుని ఆ సమాధానపరిచే పరిచర్యను మాకు అప్పగించారు.
19
ఆ పరిచర్య ఏంటంటే: దేవుడు ప్రజల పాపాలను వారి మీద మోపకుండా క్రీస్తు ద్వారా లోకాన్ని తనతో సమాధానపరచుకున్నారు. ఆ సమాధాన సందేశాన్ని బోధించే పని మాకు అప్పగించారు.
20
అందువల్ల మేము దేవుడు మా ద్వారా వేడుకోడానికి ఏర్పరచబడిన క్రీస్తు రాయబారులము. దేవునితో సమాధానపడమని క్రీస్తు పక్షంగా మిమ్మల్ని బ్రతిమాలుతున్నాము.
21
మనం ఆయనలో దేవుని నీతి అయ్యేలా, పాపమెరుగని ఆయనను మన కోసం పాపంగా చేశారు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options