Rechabites గురించి బైబిల్ వచనాలు
ముఖ్య బైబిల్ వచనాలు
అతడు అక్కడినుండి బయలుదేరిన తర్వాత, తనను కలుసుకోడానికి వస్తున్న రేకాబు కుమారుడైన యెహోనాదాబును చూశాడు. యెహు అతనికి శుభమని చెప్పి, “నేను నీతో యథార్థంగా ఉన్నట్లు నీవు నాతో ఉన్నావా?” అని అడిగాడు. అందుకు యెహోనాదాబు, “ఉన్నాను” అని జవాబిచ్చాడు. “అలాగైతే, నీ చేయి ఇవ్వు” అని యెహు అనగానే అతడు తన చేయి అందించగా యెహు అతన్ని రథంలోకి ఎక్కించుకున్నాడు.
యెహు, “నాతో వచ్చి యెహోవా కోసం నేను ఎంత రోషం కలిగి ఉన్నానో చూడు” అని చెప్పి తన రథంలో అతన్ని తీసుకెళ్లాడు.
యెహు సమరయకు వచ్చినప్పుడు, అక్కడ మిగిలి ఉన్న అహాబు వంశం వారినందరిని చంపాడు; ఏలీయాతో యెహోవా చెప్పిన మాట ప్రకారం అతడు వారిని నిర్మూలం చేశాడు.
యబ్బేజులో నివసించే లేఖికుల వంశాలు: తిరాతీయులు, షిమ్యాతీయులు, శూకోతీయులు. వీరు రేకాబీయులకు తండ్రియైన హమాతుకు నుండి వచ్చిన కెనీయులు.
అయితే వారు, “మేము ద్రాక్షరసం త్రాగము, ఎందుకంటే మా పూర్వికుడైన రేకాబు కుమారుడైన యెహోనాదాబు, ‘మీరు గాని మీ సంతానం గాని ఎప్పుడూ ద్రాక్షరసం త్రాగకూడదు.
అలాగే మీరు ఎప్పటికీ ఇల్లు కట్టుకోవద్దు, విత్తనాలు విత్తవద్దు, ద్రాక్షతోటలు నాటవద్దు; వీటిలో మీకు ఏదీ ఉండకూడదు; ఎల్లప్పుడూ గుడారాల్లో నివసించాలి. అప్పుడు మీరు పరవాసులుగా ఉన్న దేశంలో దీర్ఘకాలం జీవిస్తారు’ అని మాకు ఆజ్ఞాపించాడు.
మా పూర్వికుడైన రేకాబు కుమారుడైన యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన ప్రతిదానికీ మేము లోబడి ఉన్నాము. మేము గాని మా భార్యలు గాని మా కుమారులు, కుమార్తెలు గాని ఎప్పుడూ ద్రాక్షరసం త్రాగలేదు.
అప్పుడు యెహోవా వాక్కు యిర్మీయాకు ఇలా ప్రకటించింది:
“ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: మీరు వెళ్లి యూదా ప్రజలకు, యెరూషలేములో నివసిస్తున్న వారికి ఇలా చెప్పండి, ‘మీరు గుణపాఠం నేర్చుకుని నా మాటలకు లోబడరా?’ అని యెహోవా అడుగుతున్నారు.
‘రేకాబు కుమారుడైన యెహోనాదాబు ద్రాక్షరసం త్రాగకూడదని తన వారసులకు ఆదేశించగా అది స్థిరంగా ఉంది. వారు తమ పూర్వికుల ఆజ్ఞను పాటిస్తున్నారు కాబట్టి నేటికీ వారు ద్రాక్షరసం త్రాగరు. అయితే నేను మీతో పదే పదే మాట్లాడుతున్నా, మీరు నా మాట వినట్లేదు.
నా సేవకులైన ప్రవక్తలందరినీ మళ్ళీ మళ్ళీ మీ దగ్గరికి పంపాను. వారు మీతో, “మీలో ప్రతి ఒక్కరూ మీ చెడు మార్గాలను విడిచిపెట్టి, మీ ప్రవర్తన సరిచేసుకోవాలి; ఇతర దేవతలను సేవించవద్దు వాటిని అనుసరించవద్దు. అప్పుడు నేను మీకు, మీ పూర్వికులకు ఇచ్చిన దేశంలో మీరు నివసిస్తారు” అని ప్రకటించారు. కానీ మీరు నా మాట వినలేదు పట్టించుకోలేదు.
రేకాబు కుమారుడైన యెహోనాదాబు సంతతివారు తమ తండ్రి ఇచ్చిన ఆజ్ఞను నెరవేర్చారు, కానీ ఈ ప్రజలు నా మాటకు లోబడలేదు.’
“కాబట్టి సైన్యాల యెహోవా దేవుడు, ఇశ్రాయేలు దేవుడు, ఇలా అంటున్నారు: ‘వినండి! నేను వారితో మాట్లాడాను కాని వారు వినలేదు; నేను వారిని పిలిచాను కాని వారు జవాబివ్వలేదు. కాబట్టి నేను యూదా వారిమీదికి యెరూషలేము నివాసులందరి మీదికి రప్పిస్తానని చెప్పిన కీడంతా వాళ్ళ మీదకి తీసుకురాబోతున్నాను.’ ”
అప్పుడు యిర్మీయా రేకాబీయులతో ఇలా అన్నాడు, “ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: ‘మీరు మీ పూర్వికుడైన యెహోనాదాబు ఇచ్చిన ఆజ్ఞకు లోబడ్డారు, అలాగే అతని ఆదేశాలన్నిటిని అనుసరించి అతడు ఆదేశించిన ప్రతిదీ మీరు చేశారు.’
కాబట్టి ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: ‘నన్ను సేవించడానికి రేకాబు కుమారుడైన యెహోనాదాబు సంతానంలో ఒకడు ఎప్పటికీ ఉంటాడు.’ ”