Discipline గురించి బైబిల్ వచనాలు
ముఖ్య బైబిల్ వచనాలు
అయితే యెహోవా యెహోషువతో ఇలా అన్నారు, “నీవు లే! నీ ముఖం నేలకేసి నీవేమి చేస్తున్నావు?
ఇశ్రాయేలు ప్రజలు పాపం చేశారు; నేను వారికి ఆజ్ఞాపించిన నా ఒడంబడికను వారు ఉల్లంఘించారు. శపించబడిన వాటిలో కొన్నిటిని తీసి దొంగిలించి అబద్ధమాడారు, వారు వాటిని తమ సొంత ఆస్తులతో పాటు పెట్టుకున్నారు.
అందుకే ఇశ్రాయేలు ప్రజలు వారి శత్రువుల ఎదుట నిలువలేక పోతున్నారు; వారు శాపానికి గురికావడం వల్లనే శత్రువులకు వెన్ను చూపి పారిపోయారు. మీ మధ్య వేరుగా ఉంచబడిన వాటన్నిటిని మీరు నాశనం చేస్తేనే తప్ప నేను ఇప్పటినుండి మీతో ఉండను.
“నీవు వెళ్లి, ప్రజలను పవిత్రపరచు. వారితో ఇలా చెప్పు, ‘రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి; ఇశ్రాయేలు ప్రజల దేవుడైన యెహోవా ఇలా చెప్తున్నారు: ఇశ్రాయేలూ, మీ మధ్య శాపగ్రస్తమైనవి ఉన్నాయి. వాటిని తీసివేసే వరకు మీరు మీ శత్రువుల ఎదుట నిలబడలేరు.
“ ‘ఉదయాన్నే గోత్రం వెంబడి గోత్రం మీరు హాజరు కావాలి. అప్పుడు యెహోవా ఎంచుకున్న గోత్రం వంశాలవారిగా ముందుకు వస్తుంది; యెహోవా ఎంచుకున్న వంశం కుటుంబాల ప్రకారం ముందుకు వస్తుంది; యెహోవా ఎంచుకున్న కుటుంబం యొక్క పురుషులు ఒకరి తర్వాత ఒకరు ముందుకు వస్తారు.
శపించబడినవి ఎవరి దగ్గర దొరుకుతుందో వారిని, వారికి చెందిన వారందరిని అగ్నితో నాశనం చేయాలి. వారు యెహోవా ఒడంబడికను మీరి ఇశ్రాయేలులో అవమానకరమైన పని చేశారు!’ ”
మరుసటిరోజు తెల్లవారుజామున యెహోషువ ఇశ్రాయేలు ప్రజలను గోత్రాల ప్రకారం ముందుకు రప్పించినప్పుడు యూదా గోత్రం పట్టుబడింది.
యూదా వంశాలు ముందుకు వచ్చినప్పుడు జెరహీయులు పట్టుబడ్డారు. అతడు జెరహీయుల వంశాన్ని కుటుంబాల ప్రకారం ముందుకు వచ్చినప్పుడు జబ్ది ఎంపిక చేయబడ్డాడు.
యెహోషువ అతని కుటుంబాన్ని ఒక్కొక్కరిగా ముందుకు రప్పించగా, యూదా గోత్రానికి చెందిన జెరహు కుమారుడైన జిమ్రీ, జిమ్రీ కుమారుడైన కర్మీ, కర్మీ కుమారుడైన ఆకాను పట్టుబడ్డాడు.
అప్పుడు యెహోషువ ఆకానుతో, “నా కుమారుడా, నిజం చెప్పి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు మహిమ కలిగేలా ఆయనను ఘనపరచు. నువ్వేం చేశావో నాతో చెప్పు; దాన్ని నా దగ్గర దాచవద్దు అన్నాడు” అన్నాడు.
అందుకు ఆకాను యెహోషువతో, “అది నిజమే! ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు విరుద్ధంగా నేను పాపం చేశాను. నేను ఏం చేశానంటే,
దోపుడు సొమ్ములో ఒక అందమైన బబులోను వస్త్రం, రెండువందల షెకెళ్ళ వెండి, యాభై షెకెళ్ళ బరువుగల బంగారుకడ్డీని నేను చూసి, నాకు చాలా ఇష్టమై నేను వాటిని తెచ్చుకున్నాను. అవి నా డేరాలో నేలలో వెండిని క్రింద ఉంచి వాటిని దాచిపెట్టాను” అని చెప్పాడు.
కాబట్టి యెహోషువ దూతలను పంపినప్పుడు వారు గుడారానికి పరుగెత్తి, అతని గుడారంలో నేలలో క్రింద వెండి, దానిపై మిగతావి దాచిపెట్టబడి ఉండడం చూశారు.
ఆ డేరా మధ్య నుండి వారు వాటిని తీసి యెహోషువ, ఇశ్రాయేలీయుల దగ్గరకు తెచ్చి యెహోవా ఎదుట వాటిని ఉంచారు.
అప్పుడు యెహోషువ ఇశ్రాయేలీయులతో పాటు జెరహు వంశస్థుడైన ఆకానును వెండిని వస్త్రాన్ని బంగారుకడ్డీని ఆకాను కుమారులను కుమార్తెలను అతని ఎద్దులను గాడిదలను గొర్రెలను అతని డేరాను అతనికి ఉన్నదంతటిని పట్టుకుని ఆకోరు లోయకు తెచ్చారు.
యెహోషువ, “నీవు మాకు ఈ ఇబ్బంది ఎందుకు తెచ్చావు? ఈ రోజు యెహోవా నిన్ను బాధిస్తారు” అని అన్నాడు. అప్పుడు ఇశ్రాయేలీయులంతా ఆకానును, అతని కుటుంబీకులను రాళ్లతో కొట్టి కాల్చివేశారు.
ఆకాను మీద వారు ఒక పెద్ద రాళ్లకుప్పను వేశారు, అది ఇప్పటికీ ఉంది. అప్పుడు యెహోవా తీవ్రమైన కోపం చల్లారింది. కాబట్టి అప్పటినుండి ఆ స్థలాన్ని ఆకోరు లోయ అని పిలుస్తారు.
అప్పుడు ఇశ్రాయేలీయులు, “ఇశ్రాయేలు గోత్రాలన్నిటిలో ఎవరైనా మిస్పాలో యెహోవా ఎదుట సమావేశం కాని వారున్నారా?” అని అడిగారు. ఎందుకంటే ఎవరైనా మిస్పాలో యెహోవా ఎదుట సమావేశం కాకపోతే వారికి మరణశిక్ష విధించాలని శపథం చేశారు.
అప్పుడు వారు తమ తోటి ఇశ్రాయేలీయులైన బెన్యామీను గోత్రం గురించి బాధపడుతూ, “ఇశ్రాయేలులో ఈ రోజు ఒక గోత్రం అంతరించి పోయింది.
వారికి మన కుమార్తెలను ఇవ్వవద్దని మనం యెహోవా పేరట శపథం చేశాం, మరి మిగిలిన వారికి భార్యలను ఎక్కడ చూడగలం?” అనుకున్నారు.
తర్వాత వారు, “ఇశ్రాయేలు గోత్రాలన్నిటిలో నుండి మిస్పాలో యెహోవా ఎదుట సమావేశం కాని గోత్రమేది?” అని అడిగారు. చివరకు యాబేషు గిలాదు నుండి ఎవ్వరూ సమావేశానికి రాలేదని తెలుసుకున్నారు.
ప్రజలందరినీ లెక్కపెట్టినప్పుడు, యాబేషు గిలాదు నుండి ఏ ఒక్కరూ అక్కడ కనిపించలేదు.
అప్పుడు సమాజం పన్నెండువేలమంది యుద్ధవీరులను యాబేషు గిలాదుకు పంపతూ, అక్కడికి వెళ్లి అక్కడి వారినందరిని, స్త్రీలు పిల్లలతో సహితం ఖడ్గంతో చంపాలని ఆదేశించారు.
వారు, “మీరు ఏం చేయాలంటే, ప్రతి పురుషుని, కన్య కాని ప్రతి స్త్రీని నాశనం చేయండి” అని వారు అన్నారు.
వారు అక్కడ యాబేషు గిలాదు ప్రజల్లో పురుషులతో పడుకోని నాలుగువందలమంది యువతులను కనుగొన్నారు, వారిని కనానులోని షిలోహు దగ్గర ఉన్న శిబిరానికి తీసుకెళ్లారు.