Criminals గురించి బైబిల్ వచనాలు
ముఖ్య బైబిల్ వచనాలు
యోసేపు యజమాని అతన్ని రాజద్రోహులనుంచే చెరసాలలో పడవేశాడు. అయితే యోసేపు అక్కడే చెరసాలలో ఉన్నప్పుడు,
యెహోవా అతనితో ఉన్నారు; ఆయన అతనిపై దయ చూపించారు, చెరసాల అధికారి దృష్టిలో అతనిపై దయ కలిగించారు.
కాబట్టి చెరసాల అధికారి చెరసాలలో ఉన్నవారందరిపై యోసేపుకు అధికారం ఇచ్చాడు, అక్కడ జరిగే అంతటి మీద అతనికి బాధ్యత అప్పగించాడు.
చెరసాల అధికారి యోసేపు ఆధీనంలో ఉన్నవాటి గురించి చింతించలేదు, ఎందుకంటే యెహోవా యోసేపుతో ఉన్నారు, అతడు చేసే అన్నిటిలో విజయాన్ని ఇచ్చారు.
హేరోదు పేతురును పట్టుకుని చెరసాలలో వేయించి, నలుగురేసి సైనికులుండే నాలుగు సైనిక దళాలను అతనికి కాపలాగా నియమించాడు. పస్కా పండుగ తర్వాత ప్రజల ముందు అతన్ని విచారణకు తీసుకురావాలని హేరోదు భావించాడు.
కాబట్టి పేతురును చెరసాలలో పెట్టారు. కానీ సంఘం అతని కోసం దేవునికి ఎంతో ఆసక్తితో ప్రార్థన చేస్తున్నారు.
ఆమె యజమానులు ఇక వారికి ఆదాయం వచ్చే మార్గమే లేకుండా పోయిందని గుర్తించి, వారు పౌలు సీలలను పట్టుకుని ఆ పట్టణ సంతవీధులలో ఉండే అధికారుల దగ్గరకు వారిని ఈడ్చుకొని పోయారు.
వారు వారిని న్యాయాధికారుల దగ్గరకు తెచ్చి, “ఈ మనుష్యులు యూదులు, రోమీయులమైన మనం అంగీకరించని ఆచారాలను ప్రకటిస్తూ,
మన పట్టణంలో కలహాలను రేపుతున్నారు” అని చెప్పారు.
జనసమూహం కూడా వారి మీద దాడి చేశారు, కాబట్టి న్యాయాధికారులు వారి వస్త్రాలను లాగివేసి వారిని బెత్తాలతో కొట్టాలని ఆజ్ఞాపించారు.
వారిని తీవ్రంగా దెబ్బలు కొట్టి, చెరసాలలో పడవేసి, భద్రంగా కాపలా కాయమని చెరసాల అధికారికి ఆజ్ఞాపించారు.
అతడు ఈ ఆదేశాలను పొందుకొని, వారిని చెరసాలలోని లోపలి గదిలో కాళ్లను చెక్క మొద్దులలో ఇరికించి బంధించాడు.
సుమారు అర్థరాత్రి సమయంలో పౌలు సీలలు ప్రార్థన చేస్తూ దేవునికి కీర్తనలను పాడుతున్నప్పుడు, ఇతర ఖైదీలు వింటూ ఉన్నారు.
అప్పుడు అకస్మాత్తుగా భయంకరమైన భూకంపం వచ్చి ఆ చెరసాల పునాదులను కదిలించింది. ఒక్కసారిగా చెరసాల గదుల తలుపులన్ని తెరవబడి, వారందరి సంకెళ్ళు ఊడిపోయాయి.
ఆ చెరసాల అధికారి నిద్రలేచి, చెరసాల గదుల తలుపులన్ని తెరిచి ఉండడం చూసి, ఖైదీలందరు పారిపోయారని భావించి తన ఖడ్గాన్ని బయటకు దూసి తనను తాను చంపుకోబోయాడు.
వెంటనే పౌలు, “నీకు నీవు హాని చేసుకోవద్దు! మేమందరం ఇక్కడే ఉన్నాం!” అని అరిచాడు.
చెరసాల అధికారి దీపాలను తెమ్మని చెప్పి, వేగంగా లోనికి వచ్చి, వణుకుతూ పౌలు సీలల ముందు సాగిలపడ్డాడు.
ఆ తర్వాత అతడు వారిని బయటకు తెచ్చి, “అయ్యా, రక్షణ పొందాలంటే నేను ఏమి చేయాలి?” అని అడిగాడు.
అందుకు వారు, “ప్రభువైన యేసును నమ్ము అప్పుడు నీవు నీ ఇంటివారందరు రక్షింపబడతారు” అని చెప్పారు.
అప్పుడు వారు అతనికి అతని ఇంటి వారందరికి ప్రభువు వాక్యాన్ని బోధించారు.
ఆ రాత్రి సమయంలోనే అతడు వారిని తీసుకువచ్చి, వారి గాయాలను కడిగాడు. వెంటనే అతడు అతని ఇంటివారందరు బాప్తిస్మం పొందుకున్నారు.
ఆ చెరసాల అధికారి వారిని తన ఇంటికి తెచ్చి వారికి భోజనం వడ్డించాడు. తాను తన ఇంటివారందరు దేవుని నమ్ముకున్నందుకు అతడు ఆనందించాడు.
మరుసటిరోజు తెల్లవారగానే న్యాయాధికారులు చెరసాల అధికారి దగ్గరకు భటులను పంపి, “ఆ మనుష్యులను విడచిపెట్టండి” అనే ఆదేశాన్ని ఇచ్చి పంపించారు.
ఆ చెరసాల అధికారి పౌలుతో, “న్యాయాధికారులు మిమ్మల్ని విడిచిపెట్టమని ఆదేశించారు కాబట్టి మీరు సమాధానంగా బయలుదేరండి” అని చెప్పాడు.
అయితే పౌలు ఆ భటులతో, “రోమీయులమైన మమ్మల్ని వారు న్యాయ విచారణ చేయకుండానే బహిరంగంగా కొట్టించి చెరసాలలో వేయించారు. ఇప్పుడు మమ్మల్ని ఎవరికీ తెలియకుండా రహస్యంగా పంపించాలని అనుకుంటున్నారా? మేము ఒప్పుకోము. వారే వచ్చి మమ్మల్ని బయటకు తీసుకెళ్లాలి” అని చెప్పాడు.