మత్తయి 24:38-51
38
జలప్రళయానికి ముందు దినాల్లో, నోవహు ఓడలోనికి వెళ్లిన రోజు వరకు, ప్రజలు తింటూ, త్రాగుతూ, పెండ్లి చేసుకొంటూ, పెండ్లికిస్తూ ఉన్నారు.
39
ఆ జలప్రళయం వచ్చి అందరిని కొట్టుకొని పోయే వరకు వారికి తెలియలేదు. మనుష్యకుమారుని రాకడ కూడా అలాగే ఉంటుంది.
40
ఆ సమయంలో ఇద్దరు పొలంలో ఉంటారు, ఒకరు కొనిపోబడతారు ఇంకొకరు విడవబడతారు.
41
ఇద్దరు స్త్రీలు తిరుగలి విసురుతుంటారు, ఒక స్త్రీ కొనిపోబడుతుంది ఇంకొక స్త్రీ విడవబడుతుంది.
42
“కాబట్టి ఏ దినం మీ ప్రభువు వస్తాడో మీకు తెలియదు, కాబట్టి మెలకువగా ఉండండి.
43
ఈ విషయం అర్థం చేసుకోండి: దొంగ రాత్రి ఏ జామున వస్తాడో ఒకవేళ ఇంటి యజమానికి తెలిస్తే, అతడు తన ఇంటికి కన్నం వేయకుండా మెలకువగా ఉంటాడు.
44
కాబట్టి మనుష్యకుమారుడు మీరు ఎదురు చూడని సమయంలో వస్తారు, కాబట్టి మీరు సిద్ధపడి ఉండండి.
45
“యజమాని తన ఇంట్లోని పనివారికి తగిన సమయాల్లో భోజనం పెట్టి, వారిని పర్యవేక్షించడానికి వారిపై పర్యవేక్షకునిగా నియమించడానికి, నమ్మకమైన, జ్ఞానం కలిగిన సేవకుడు ఎవడు?
46
యజమాని తిరిగి వచ్చినప్పుడు ఆ సేవకుడు అలా చేస్తూ కనిపించడం మంచిది.
47
ఆ యజమాని తన యావదాస్తి మీద అతన్ని అధికారిగా ఉంచుతాడని, నేను మీతో నిశ్చయంగా చెప్తున్నాను.
48
కాని ఒకవేళ ఆ సేవకుడు చెడ్డవాడైతే, ‘నా యజమాని తిరిగి రావడం ఆలస్యం చేస్తున్నాడు’ అని తన మనస్సులో అనుకుని,
49
తన తోటి సేవకులను కొట్టడం మొదలుపెట్టి త్రాగుబోతులతో కలిసి తిని త్రాగుతూ ఉంటాడు.
50
అతడు ఊహించని రోజున ఊహించని సమయంలో ఆ సేవకుని యజమాని వస్తాడు.
51
అతడు వాన్ని ముక్కలుగా నరికి వేషధారులతో అతనికి చోటు ఇస్తాడు, అక్కడ ఏడ్వడం పండ్లు కొరకడం ఉంటాయి.
Settings