లూకా 5:13-37
13
యేసు చేయి చాపి వాన్ని ముట్టారు. ఆయన వానితో, “నాకు ఇష్టమే, బాగవు” అన్నారు. వెంటనే కుష్ఠురోగం వాన్ని విడిచి వెళ్లింది.
14
అప్పుడు యేసు, “నీవు ఎవరికి చెప్పకు, కాని వెళ్లి, నిన్ను నీవు యాజకునికి చూపించుకొని వారికి సాక్ష్యంగా ఉండేలా, నీ శుద్ధీకరణ కోసం మోషే నియమించిన అర్పణలను అర్పించు” అని వానిని ఆదేశించారు.
15
అయినాసరే ఆయనను గురించిన వార్త మరి ఎక్కువగా వ్యాపించి, ఆయన చెప్పే మాటలను వినడానికి వారి వ్యాధుల నుండి స్వస్థపడడానికి ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చారు.
16
అయితే యేసు తరచుగా ఏకాంత ప్రాంతాలకు వెళ్లి ప్రార్థించారు.
17
ఒక రోజు యేసు బోధిస్తూ ఉండగా, పరిసయ్యులు ధర్మశాస్త్ర ఉపదేశకులు అక్కడ కూర్చుని ఉన్నారు. వారు గలిలయ, యూదయ, యెరూషలేము ప్రాంతాలలోని ప్రతి గ్రామం నుండి వచ్చారు. ఆ సమయంలో రోగులను బాగుచేసే ప్రభువు శక్తి యేసులో ఉంది.
18
కొందరు మనుష్యులు పక్షవాతంగల ఒక వ్యక్తిని చాపమీద మోసుకొని తెచ్చి, యేసు ముందు ఉంచాలని ఇంట్లోకి తీసుకెళ్లడానికి ప్రయత్నించారు.
19
కానీ ప్రజలు గుంపుగా ఉన్నందుకు వానిని లోపలికి తేవడానికి వీలుకాలేదు, కాబట్టి వారు ఆ ఇంటి కప్పుమీదికి ఎక్కి పెంకులు తీసి ప్రజలమధ్య, ఆ చాపతోనే వానిని యేసు ముందు దింపారు.
20
యేసు వారి విశ్వాసం చూసి, అతనితో, “స్నేహితుడా, నీ పాపాలు క్షమించబడ్డాయి” అన్నారు.
21
పరిసయ్యులు ధర్మశాస్త్ర ఉపదేశకులు, తమలో తాము, “దైవదూషణ చేస్తున్న వీడు ఎవడు? దేవుడు తప్ప పాపాలను క్షమించగలవారెవరు?” అని ఆలోచించడం మొదలుపెట్టారు.
22
యేసు వారి ఆలోచనలను గ్రహించి, “మీ హృదయాల్లో మీరు ఇలా ఎందుకు ఆలోచిస్తున్నారు?
23
వీటిలో ఏది చెప్పడం సులభం: ‘నీ పాపాలు క్షమించబడ్డాయి’ అని చెప్పడమా లేదా ‘లేచి నడువు’ అని చెప్పడమా?”
24
అయితే మనుష్యకుమారునికి భూలోకంలో పాపాలను క్షమించే అధికారం ఉందని మీరు తెలుసుకోవాలని, “నేను కోరుతున్నాను” అని అన్నారు. ఆయన పక్షవాతం గలవానితో, “నేను చెప్తున్న, నీవు లేచి, నీ పరుపెత్తుకొని ఇంటికి వెళ్లు” అన్నారు.
25
వెంటనే వాడు వారి ముందే లేచి, తాను పడుకుని ఉన్న పరుపెత్తుకొని దేవుని స్తుతిస్తూ తన ఇంటికి వెళ్లాడు.
26
అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఆశ్చర్యంతో దేవుని స్తుతించారు. వారు భయంతో నిండుకొని, “ఈ రోజు మేము అద్భుతాలను చూశాం” అని చెప్పుకొన్నారు.
27
దీని తర్వాత, యేసు బయటకు వెళ్తూ లేవీ అనే పేరుగల పన్ను వసూలు చేసేవాడు పన్ను వసూలు చేసే స్థానంలో కూర్చుని ఉండడం చూసి, “నన్ను వెంబడించు” అని యేసు అతనితో అన్నారు.
28
వెంటనే లేవీ లేచి, అన్నిటిని వదిలి ఆయనను వెంబడించాడు.
29
తర్వాత, లేవీ యేసు కోసం తన ఇంట్లో ఒక గొప్ప విందు ఏర్పాటు చేశాడు, పెద్ద సంఖ్యలో పన్ను వసూలు చేసేవారు ఇతరులు వారితో పాటు తింటున్నారు.
30
అయితే వారి తెగకు చెందిన పరిసయ్యులు ధర్మశాస్త్ర ఉపదేశకులు, “ఎందుకు మీరు పన్నులు వసూలు చేసేవారితో పాపులతో కలిసి తిని త్రాగుతారు?” అని ఆయన శిష్యులతో అన్నారు.
31
అందుకు యేసు వారితో, “రోగులకే గాని ఆరోగ్యవంతులకు వైద్యులు అవసరం లేదు.
32
నేను నీతిమంతులను పిలువడానికి రాలేదు, పాపులు పశ్చాత్తాపపడాలని వారిని పిలువడానికి వచ్చాను” అన్నారు.
33
వారు ఆయనతో, “యోహాను శిష్యులు తరచుగా ఉపవాసం ఉండి ప్రార్థనలు చేస్తారు, అలాగే పరిసయ్యుల శిష్యులు కూడా చేస్తారు, కాని నీ శిష్యులు తింటూ త్రాగుతూ ఉంటారు” అన్నారు.
34
అందుకు యేసు, “పెండ్లికుమారుడు తన స్నేహితులతో ఉన్నప్పుడు వారిని ఉపవాసం ఉండేలా మీరు చేయగలరా?
35
పెండ్లికుమారుడు వారి దగ్గర నుండి తీసుకొనిపోబడే సమయం వస్తుంది; ఆ రోజుల్లో వారు ఉపవాసం ఉంటారు” అని జవాబిచ్చారు.
36
ఆయన వారికి ఈ ఉపమానం చెప్పారు: “ఎవ్వరూ క్రొత్త బట్ట నుండి ముక్క చింపి పాత దానికి అతుకువేయరు. అలా చేస్తే, వారికి చినిగిపోయిన క్రొత్త బట్ట మిగులుతుంది, క్రొత్త బట్ట అతుకు పాత దానితో కలవదు.
37
ఎవ్వరూ పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షరసం పోయరు. అలా చేస్తే, క్రొత్త ద్రాక్షరసం వలన ఆ తిత్తులు పిగిలిపోతాయి; ద్రాక్షరసం కారిపోతుంది, తిత్తులు పాడైపోతాయి.
Settings