లూకా 20:1-26
1
ఒకనాడు యేసు దేవాలయ ఆవరణంలో ప్రజలకు బోధిస్తూ సువార్తను ప్రకటిస్తూ ఉండగా, ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, నాయకులతో కలసి ఆయన దగ్గరకు వచ్చారు.
2
వారు, “నీవు ఏ అధికారంతో ఈ కార్యాలను చేస్తున్నావో మాకు చెప్పు, నీకు ఈ అధికారం ఎవరిచ్చారు?” అని అడిగారు.
3
అందుకు యేసు, “నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను:
4
యోహానుకు ఇచ్చిన బాప్తిస్మం పరలోకం నుండి కలిగిందా? లేదా మానవుల నుండి కలిగిందా?”
5
వారు తమలో తాము చర్చించుకొంటూ, “ఒకవేళ మనం ‘పరలోకం నుండి కలిగింది’ అని చెప్పితే ‘మరి మీరు ఎందుకు అతన్ని నమ్మలేదు?’
6
ఒకవేళ మనం, ‘మనుష్యుల వలన’ అని చెప్తే ప్రజలు రాళ్లతో కొడతారు, ఎందుకంటే వారికి యోహాను ఒక ప్రవక్త అని గట్టి నమ్మకం” అని అనుకున్నారు.
7
అందుకు వారు, “అది ఎక్కడ నుండి వచ్చిందో మాకు తెలియదు” అని జవాబిచ్చారు.
8
అందుకు యేసు, “నేను కూడా ఏ అధికారంతో వీటిని చేస్తున్నానో చెప్పను” అన్నారు.
9
ఆయన ప్రజల వైపు తిరిగి ఈ ఉపమానం చెప్పడం మొదలుపెట్టారు: “ఒక మనుష్యుడు ద్రాక్షతోటను నాటించి, దానిని కొందరు కౌలురైతులకు అద్దెకు ఇచ్చి, దూర దేశానికి వెళ్లి చాలా కాలం అక్కడే ఉన్నాడు.
10
కోతకాలం వచ్చినప్పుడు అతడు ఒక పనివానిని ఆ ద్రాక్షతోటకు వెళ్లి దానిలోని తన భాగం తెమ్మని ఆ రైతుల దగ్గరకు పంపాడు, కాని ఆ రైతులు వానిని కొట్టి వట్టి చేతులతో పంపివేశారు.
11
మళ్ళీ అతడు మరొక పనివానిని పంపించాడు. వారు వానిని కూడా కొట్టి అవమానపరచి, వట్టి చేతులతో పంపారు.
12
మళ్ళీ అతడు మూడవ వానిని పంపించాడు. వారు వానిని గాయపరచి బయటకు తోసివేసారు.
13
“అప్పుడా ద్రాక్షతోట యజమాని ‘నేనేమి చేయాలి? నేను ప్రేమించే నా కుమారున్ని పంపిస్తాను, వారు ఒకవేళ అతన్ని గౌరవిస్తారేమో’ అని అనుకున్నాడు.
14
“కాని ఆ కౌలు రైతులు అతన్ని చూసి, ‘ఇతడే వారసుడు, ఇతన్ని చంపుదాం, అప్పుడు ఈ వారసత్వం మనదైపోతుంది’ అని ఒకనితో ఒకరు చెప్పుకొని,
15
కాబట్టి వారు అతన్ని బయటకు తీసుకెళ్లి, చంపి, అతని శరీరాన్ని ద్రాక్షతోట బయట పడవేశారు. “అప్పుడు ఆ ద్రాక్షతోట యజమాని ఏమి చేస్తాడు?
16
అతడు వచ్చి ఆ కౌలురైతులను చంపి తన ద్రాక్షతోటను ఇతరులకు అప్పగిస్తాడు” అని చెప్పారు. అది విన్న వారు, “అలా ఎన్నటికి కాకూడదు” అన్నారు.
17
యేసు సూటిగా వారిని చూసి, “అలాగైతే లేఖనాల్లో, “ ‘ఇల్లు కట్టేవారు నిషేధించిన రాయి మూలరాయి అయ్యింది’ అని వ్రాయబడిన మాటకు అర్థం ఏమిటి?
18
ఈ రాయి మీద పడిన ప్రతివారు ముక్కలైపోతారు, కాని ఎవరి మీద రాయి పడుతుందో వారు దాని క్రింద నలిగిపోతారు” అని చెప్పారు.
19
ఇది విన్న ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు ఆయన తమ గురించే ఆయన ఈ ఉపమానం చెప్పారని గ్రహించి, ఎలాగైనా ఆయనను త్వరగా బంధించడానికి అవకాశం కోసం చూస్తూ ఉన్నారు. కాని ప్రజలకు భయపడ్డారు.
20
ఆయనపై నిఘా వేసి ఉంచడానికి, వారు యథార్థంగా ఉన్నట్లు నటించగల వేగులవారిని పంపారు. యేసు మాట్లాడే దాంట్లో ఏదో తప్పు పట్టి ఆయనను పట్టుకుని, ఆయనను అధిపతి యొక్క అధికారానికి, ప్రభావానికి అప్పగించవచ్చని వారు ఆశించారు.
21
అయితే ఆ వేగులవారు వచ్చి, “బోధకుడా, నీవు న్యాయంగా మాట్లాడుతూ బోధిస్తావని మాకు తెలుసు. నీవు ఏ పక్షపాతం చూపకుండ, దేవుని మార్గాన్ని సత్యం ఆధారంగా బోధిస్తావు.
22
అయితే మనం కైసరుకు పన్ను చెల్లించడం న్యాయమా కాదా?” అని యేసును అడిగారు.
23
ఆయన వారి కుయుక్తిని ఎరిగి, వారితో,
24
“నాకు ఒక దేనారాన్ని చూపించండి, దీనిపై ఉన్న బొమ్మ ఎవరిది? ఈ వ్రాయబడిన ముద్ర ఎవరిది?” అని అడిగారు. అందుకు వారు, “కైసరువి” అన్నారు.
25
అప్పుడు ఆయన, “అలాగైతే కైసరువి కైసరుకు, దేవునివి దేవునికి చెల్లించండి” అని వారితో చెప్పారు.
26
మాటల్లో చిక్కులు పెట్టాలని చూసినవారు ప్రజల ముందు ఆయన మాటలను తప్పు పట్టలేక ఆయన జవాబుకు ఆశ్చర్యపడి నిశ్శబ్దమై పోయారు.
Settings