విలాపవాక్యములు 4:1-15
1
బంగారం తన మెరుపును ఎలా కోల్పోయింది, మంచి బంగారం ఎలా మొద్దుబారిపోయింది! ప్రతి వీధి మూలలో ప్రశస్తమైన రాళ్ల వంటి రత్నాలు చెల్లాచెదురుగా ఉన్నాయి.
2
ప్రశస్తమైన సీయోను పిల్లలు ఎలా అయిపోయారు, ఒకప్పుడు వారి విలువ బంగారంతో తూగేది, ఇప్పుడు మట్టి కుండలుగా, కుమ్మరి చేతి పనిగా పరిగణించబడుతున్నారు!
3
నక్కలు కూడా తమ పిల్లలకు పాలివ్వడానికి తమ రొమ్ములిస్తాయి, కానీ నా ప్రజలు ఎడారిలో నిప్పుకోడిలా హృదయం లేనివారయ్యారు.
4
దాహం వల్ల పసివారి నాలుక నోటి అంగిటికి అంటుకుపోతుంది; పిల్లలు ఆహారం కోసం వేడుకుంటారు, కానీ ఎవరూ వారికి ఇవ్వరు.
5
ఒకప్పుడు రుచికరమైన పదార్ధాలు తిన్నవారు వీధుల్లో నిరుపేదలు. రాజ ఊదా రంగులో పెరిగిన ఇప్పుడు బూడిద కుప్పల మీద పడుకున్నారు.
6
సొదొమ శిక్ష కంటే నా ప్రజల శిక్ష గొప్పది, ఆమెకు సహాయం చేయడానికి చేయి లేకుండానే క్షణాల్లో పడగొట్టబడింది.
7
అందలి అధిపతులు మంచుకంటే స్వచ్ఛమైన వారు, పాలకంటే తెల్లని వారు. శరీరాలు పగడాలకంటే ఎర్రగా ఉన్నాయి, వారి దేహకాంతి నీలమణి లాంటిది.
8
అలాంటివారి ఆకారం బొగ్గు కంటే నలుపుగా అయింది, వీధుల్లో వారిని చూసి వారిని గుర్తు పట్టలేదు. వారి చర్మం వారి ఎముకలకు అంటుకుపోయి ఎండిన కర్రలా అయింది.
9
కరువు వారిని దెబ్బతీసింది, పంటలు పండవు. ఈ బాధకు క్షీణించిపోయారు, ఇంతకంటే ఖడ్గం చేత చావడం మహా భాగ్యం అనిపిస్తుంది.
10
కనికరంగల స్త్రీలు తమ సొంత చేతులతో తమ పిల్లలను వండుకున్నారు, నా ప్రజలు నాశనమైనప్పుడు, వారికి ఆహారం అయ్యారు.
11
యెహోవా తన కోపాన్ని పూర్తిగా చల్లార్చారు. ఆయన తన తీవ్రమైన కోపాన్ని కుమ్మరించాడు. ఆయన సీయోనులో అగ్నిని రప్పించారు, అది దాని పునాదులను దహించివేసింది.
12
శత్రువులు, శత్రువులు యెరూషలేము గుమ్మాల్లోకి ప్రవేశించవచ్చని భూరాజులు నమ్మలేదు, ప్రపంచంలోని జనాంగలెవరూ నమ్మలేదు.
13
అయితే అది ఎందువల్ల జరిగిందంటే, నీతిమంతుల రక్తాన్ని చిందించిన దాని ప్రవక్తల పాపాల వల్ల, దాని యాజకుల దోషాల వల్ల జరిగింది.
14
ఇప్పుడు వారు గ్రుడ్డివారిలా వీధుల్లో తడుముతూ తిరుగుతున్నారు. వారు రక్తంతో ఎంతగా అపవిత్రం అయ్యారంటే, వారి వస్త్రాలను తాకడానికి ఎవరూ సాహసించరు.
15
“వెళ్లిపొండి! మీరు అపవిత్రులు!” అని ప్రజలు గట్టిగా వారిమీద అరుస్తారు. “దూరం! దూరం! మమ్మల్ని తాకవద్దు!” అని వారు పారిపోయి, తిరుగులాడుతున్నప్పుడు, దేశాల్లో ఉన్న ప్రజలు, “వారు ఇకపై ఇక్కడ ఉండడానికి వీల్లేదు” అని అంటారు.
బైబిల్ పాఠం: Biblica® Open Telugu Contemporary Version™, © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. · CC BY-SA 4.0“Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc., used with permission.
Settings