Skip to content
యెహోషువ 11:1-11

యెహోషువ 11:1-11

1
హాసోరు రాజు యాబీను ఈ విషయం విని, మాదోను రాజైన యోబాబుకు, షిమ్రోను, అక్షఫు రాజులకు,
2
ఉత్తరాన కొండ సీమలో ఉన్న రాజులకు, కిన్నెరెతు సరస్సుకు దక్షిణంగా ఉన్న అరాబా లోయ ప్రాంతంలో ఉన్న రాజులకు, పడమటి దిగువ కొండ ప్రదేశాల రాజులకు, పడమర ఉన్న నఫోత్ దోరు రాజుకు,
3
తూర్పు పడమర లోని కనానీయుల రాజులకు, అమోరీయుల, హిత్తీయుల, పెరిజ్జీయుల, కొండ సీమలో ఉన్న యెబూసీయుల, మిస్పా ప్రదేశంలో హెర్మోను పర్వతం క్రింద ఉన్న హివ్వీయుల రాజులకు కబురు పంపాడు.
4
వారు సముద్రతీరంలో ఉండే ఇసుక రేణువులంత విస్తారమైన తమ భారీ సైన్యంతో, లెక్కలేనన్ని గుర్రాలతో రథాలతో బయలుదేరి వచ్చారు.
5
ఈ రాజులందరూ తమ బలగాలను కలుపుకొని ఇశ్రాయేలీయులతో పోరాడడానికి మేరోము జలాల దగ్గర కలిసి మకాం వేశారు.
6
యెహోవా యెహోషువతో, “వారికి భయపడకు, ఎందుకంటే రేపు ఈ సమయానికి నేను వారందరినీ చంపి ఇశ్రాయేలు ప్రజలకు అప్పగిస్తాను. మీరు వారి గుర్రాల తొడనరాలు తెగకోసి, వారి రథాలను కాల్చివేయాలి” అని చెప్పారు.
7
కాబట్టి యెహోషువ అతనితో పాటు సైనికులంతా బయలుదేరి మేరోము జలాల దగ్గర ఒక్కసారిగా వారి మీద పడ్డారు.
8
యెహోవా ఇశ్రాయేలీయుల చేతికి వారిని అప్పగించారు. వీరు వారిని ఓడించి, మహా పట్టణమైన సీదోను వరకు, మిస్రెఫోత్-మయీము వరకు, తూర్పున మిస్పే లోయవరకు ఏ ఒక్కరు మిగులకుండా వారిని వెంటాడి చంపారు.
9
యెహోవా చెప్పినట్లే యెహోషువ వారికి చేశాడు: అతడు వారి గుర్రాల తొడనరాలు తెగకోసి, వారి రథాలను కాల్చివేశాడు.
10
యెహోషువ ఆ సమయంలో వెనుకకు తిరిగి హాసోరును వశపరచుకున్నాడు. దాని రాజును కత్తితో చంపాడు. (అంతకుముందు హాసోరు ఆ రాజ్యాలన్నిటికీ ముఖ్యపట్టణంగా ఉండేది.)
11
దానిలో ఉన్నవారందరిని కత్తితో చంపారు. ఊపిరి ఉన్న ఎవరినీ విడిచిపెట్టకుండా వారిని పూర్తిగా నాశనం చేశారు. అతడు హాసోరును కాల్చివేశాడు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options