యెహోషువ 10:1-27
1
యెహోషువ హాయిని పట్టుకుని పూర్తిగా నాశనం చేసి, యెరికోకు దాని రాజుకు చేసినట్లు హాయికి దాని రాజుకు చేశాడని, గిబియోను ప్రజలు ఇశ్రాయేలుతో సమాధాన ఒప్పందం చేసుకుని వారితో కలిసిపోయారని యెరూషలేము రాజైన అదోనీ-సెదెకు విన్నాడు.
2
అతడు, అతని ప్రజలు దీని గురించి చాలా భయపడ్డారు, ఎందుకంటే గిబియోను పట్టణం రాజధానుల్లో ఒక ముఖ్యమైన పట్టణం; అది హాయి కంటే పెద్దది, దాని మనుష్యులందరు మంచి పోరాట యోధులు.
3
కాబట్టి యెరూషలేము రాజైన అదోనీ-సెదెకు హెబ్రోను రాజైన హోహాము, యర్మూతు రాజైన పిరాము, లాకీషు రాజైన యాఫీయా, ఎగ్లోను రాజైన దెబీరులకు,
4
“రండి గిబియోనుపై దాడి చేయడానికి నాకు సహాయం చేయండి, ఎందుకంటే గిబియోను యెహోషువతో ఇశ్రాయేలీయులతో సమాధాన ఒప్పందం చేసుకుంది” అని విన్నవించుకున్నారు.
5
అమోరీయుల అయిదుగురు రాజులు అనగా యెరూషలేము, హెబ్రోను, యర్మూతు, లాకీషు, ఎగ్లోను రాజులు ఒకటిగా చేరి, తమ సైనికులందరితో కలిసి వెళ్లి గిబియోనీయులతో యుద్ధం చేశారు.
6
గిబియోనీయులు గిల్గాలులోని శిబిరంలో ఉన్న యెహోషువకు: “నీ దాసులను విడిచిపెట్టక త్వరగా మా దగ్గరకు వచ్చి సహాయం చేసి మమ్మల్ని రక్షించండి! కొండ సీమలోని అమోరీయుల రాజులందరూ ఒక్కటిగా మా మీదికి దండెత్తి వచ్చారు” అని అంటూ సమాచారం పంపారు.
7
కాబట్టి యెహోషువ తన సైన్యమంతటితో, అత్యుత్తమ పోరాట యోధులందరితో సహా గిల్గాలు నుండి బయలుదేరాడు.
8
యెహోవా యెహోషువతో, “వారికి భయపడకు; నేను వారిని నీ చేతికి అప్పగించాను. వారిలో ఒక్కరు మీ ముందు నిలబడలేరు” అని చెప్పారు.
9
గిల్గాలు నుండి రాత్రంతా నడిచి వచ్చిన తర్వాత, యెహోషువ హఠాత్తుగా వారి మీద దాడి చేశాడు.
10
యెహోవా వారిని ఇశ్రాయేలీయుల ముందు గందరగోళంలో పడేశారు, కాబట్టి ఇశ్రాయేలీయులు గిబియోనులో వారిని పూర్తిగా ఓడించారు. ఇశ్రాయేలీయులు బేత్-హోరోనుకు పైకి వెళ్లే దారిలో అజేకా, మక్కేదా వరకు వారిని వెంటాడి నరికివేశారు.
11
వారు బేత్-హోరోను నుండి అజేకాకు వెళ్లే దారిలో ఇశ్రాయేలీయుల నుండి పారిపోతుండగా, యెహోవా వారిపై పెద్ద వడగళ్ళు కురిపించారు, ఇశ్రాయేలీయుల ఖడ్గాల చేత చంపబడినవారి కంటే వడగళ్ళతో చచ్చినవారే ఎక్కువ.
12
యెహోవా అమోరీయులను ఇశ్రాయేలీయులకు అప్పగించిన రోజున, యెహోషువ ఇశ్రాయేలీయుల సమక్షంలో యెహోవాతో ఇలా అన్నాడు: “సూర్యుడా, గిబియోనుపై నిలిచిపో, చంద్రుడా, అయ్యాలోను లోయ పైగా ఆగిపో.”
13
ప్రజలు తమ శత్రువులపై పూర్తి విజయం సాధించే వరకు, సూర్యుడు నిలిచిపోయాడు, చంద్రుడు ఆగిపోయాడు, అని యాషారు వ్రాసిన వీరుల గ్రంథంలో వ్రాయబడినట్లుగా జరిగింది. సూర్యుడు ఆకాశం మధ్యలో ఆగి, దాదాపు ఒక రోజు ఆలస్యమయ్యాడు.
14
యెహోవా ఒక మానవుడి మాట విన్న ఆ రోజులాంటిది ఇంకొకటి అంతకుముందుగానీ ఆ తర్వాత గాని లేదు. నిజంగా యెహోవా ఇశ్రాయేలీయుల కోసం యుద్ధం చేశారు!
15
ఆ తర్వాత యెహోషువ ఇశ్రాయేలీయులందరితో పాటు గిల్గాలులో ఉన్న శిబిరానికి తిరిగి వచ్చాడు.
16
అప్పుడు అయిదుగురు రాజులు పారిపోయి మక్కేదాలోని గుహలో దాక్కున్నారు.
17
అయిదుగురు రాజులు మక్కేదాలోని గుహలో దాక్కున్నట్టు యెహోషువకు తెలిసినప్పుడు,
18
యెహోషువ ఇలా అన్నాడు, “గుహ ద్వారానికి పెద్ద పెద్ద రాళ్లు దొర్లింది మూసివేసి దానికి మనుష్యులను కాపలా పెట్టండి.
19
ఆగవద్దు; మీ శత్రువులను వెంటాడండి! వెనుక నుండి వారిపై దాడి చేయండి, వారిని వారి పట్టణాలకు చేరనివ్వవద్దు, ఎందుకంటే మీ దేవుడైన యెహోవా వారిని మీ చేతికి అప్పగించారు.”
20
కాబట్టి యెహోషువ, ఇశ్రాయేలీయులు వారిని పూర్తిగా ఓడించారు, అయితే ప్రాణాలతో బయటపడిన కొంతమంది కోటగోడలు గల తమ పట్టణాలకు చేరుకున్నారు.
21
అప్పుడు సైన్యమంతా మక్కేదాలోని శిబిరంలో ఉన్న యెహోషువ దగ్గరకు క్షేమంగా తిరిగి వచ్చింది. ఇశ్రాయేలీయులకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడడానికి ఎవరికీ ధైర్యం సరిపోలేదు.
22
యెహోషువ, “గుహ ద్వారం తెరిచి ఆ అయిదుగురు రాజులను నా దగ్గరకు తీసుకురండి” అని అన్నాడు.
23
కాబట్టి వారు ఆ అయిదుగురు రాజులను అనగా యెరూషలేము, హెబ్రోను, యర్మూతు, లాకీషు, ఎగ్లోను యొక్క రాజులను గుహ నుండి బయటకు తెచ్చారు.
24
ఆ రాజులను వారు యెహోషువ దగ్గరకు తీసుకువచ్చాక, యెహోషువ ఇశ్రాయేలు ప్రజలందరినీ పిలిపించి తనతో వెళ్లి వచ్చిన సేనాధిపతులతో, “నా దగ్గరకు రండి, మీ పాదాలు ఈ రాజుల మెడల మీద పెట్టండి” అని చెప్పాడు. కాబట్టి వారు ముందుకు వచ్చి తమ పాదాలను వారి మెడల మీద పెట్టారు.
25
అప్పుడు యెహోషువ వారితో, “భయపడకండి; నిరుత్సాహపడకండి. నిబ్బరంగా, ధైర్యంగా ఉండండి. మీరు పోరాడబోయే శత్రువులందరికీ యెహోవా ఇలాగే చేస్తారు” అన్నాడు.
26
అప్పుడు యెహోషువ రాజులను చంపి వారి శవాలను అయిదు స్తంభాలకు వ్రేలాడదీశాడు, సాయంత్రం వరకు వారి శవాలు స్తంభాలకు వ్రేలాడి ఉన్నాయి.
27
సూర్యాస్తమయ సమయంలో యెహోషువ ఆజ్ఞ ఇవ్వగా వారు వాటిని స్తంభాల నుండి దించి, వారు దాక్కున్న గుహలోకి విసిరి ఆ గుహ ముఖద్వారం దగ్గర వారు పెద్ద రాళ్లను ఉంచారు, అవి నేటికీ ఉన్నాయి.
Settings