Skip to content
యోహాను 17:6-19

యోహాను 17:6-19

6
“ఈ లోకంలో నుండి నీవు నాకు ఇచ్చిన వారికి నేను నిన్ను తెలియపరిచాను. వారు నీవారు; నీవు వారిని నాకు ఇచ్చావు వారు నీ వాక్యాన్ని పాటించారు.
7
ఇప్పుడు వారు నీవు నాకు ఇచ్చినవన్ని నీ దగ్గర నుండే వచ్చాయని తెలుసుకున్నారు.
8
ఎందుకంటే నీవు నాకు ఇచ్చిన మాటలను నేను వారికి ఇచ్చాను. వారు వాటిని అంగీకరించి నిజంగా నేను నీ దగ్గర నుండి వచ్చానని వారు తెలుసుకుని నీవు నన్ను పంపావని నమ్మారు.
9
నేను వారి కోసం ప్రార్థిస్తున్నాను. నేను లోకం కోసం ప్రార్థన చేయడం లేదు, కాని నీవు నాకు ఇచ్చినవారు నీవారు కాబట్టి వారి కోసం ప్రార్థిస్తున్నాను.
10
నాకు ఉన్నవన్నీ నీవి, నీకు ఉన్నవన్నీ నావి. వారి ద్వారా నాకు మహిమ కలిగింది.
11
నేను నీ దగ్గరకు వచ్చేస్తున్నాను, కాబట్టి లోకంలో ఇక ఉండను. కాని వారైతే ఇంకా లోకంలోనే ఉన్నారు. పరిశుద్ధ తండ్రీ, నీ పేరిట అనగా నీవు నాకిచ్చిన పేరిట వారిని కాపాడు. అప్పుడు మనం ఏకమై ఉన్నట్లు వారు ఏకమై ఉంటారు.
12
నేను వారితో ఉన్నప్పుడు నీవు నాకు ఇచ్చిన పేరిట వారిని రక్షించి భద్రంగా ఉంచాను. లేఖనాలు నెరవేరేలా నాశనానికి దిగజారిన ఒక్కడు తప్ప మరి ఎవరు తప్పిపోలేదు.
13
“ఇప్పుడు నేను నీ దగ్గరకు వస్తున్నాను. అయినా నా ఆనందం వారిలో పరిపూర్ణం కావాలని నేను ఇంకా ఈ లోకంలో ఉన్నప్పుడే ఈ విషయాలను చెప్తున్నాను.
14
నేను నీ వాక్యాన్ని వారికి ఇచ్చాను. వారు కూడా నాలాగే ఈ లోకానికి చెందినవారు కారు కాబట్టి లోకం వారిని ద్వేషించింది.
15
ఈ లోకం నుండి నీవు వారిని తీసుకో అని నేను ప్రార్థన చేయడం లేదు కాని, దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాను.
16
నేను ఈ లోకానికి చెందనట్లే, వారు కూడ ఈ లోకానికి చెందినవారు కారు.
17
సత్యంతో వారిని పవిత్రపరచు; నీ వాక్యమే సత్యము.
18
నీవు నన్ను ఈ లోకానికి పంపించినట్లే, నేను వారిని ఈ లోకానికి పంపించాను.
19
వారు కూడా సత్యంలో ప్రతిష్ఠ చేయబడాలని, వారి కోసం నన్ను నేను ప్రతిష్ఠ చేసుకుంటున్నాను.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options