Skip to content
యిర్మీయా 49:7-22

ఏదోముపై తీర్పు

యిర్మీయా 49:7-22
7
ఎదోము గురించి: సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: “తేమానులో ఇక జ్ఞానం లేదా? వివేకవంతులు సలహా ఇవ్వడం మానివేశారా? వారి జ్ఞానం తగ్గిపోయిందా?
8
దేదానులో నివసించేవారలారా, వెనక్కి తిరిగి పారిపోయి లోతైన గుహల్లో దాక్కోండి, నేను ఏశావు మీదికి విపత్తు రప్పించి వారిని శిక్షిస్తాను.
9
ద్రాక్షలు పోగుచేసుకునేవారు మీ దగ్గరకు వస్తే, వారు కొన్ని ద్రాక్షలు వదిలేయరా? రాత్రివేళ దొంగలు వస్తే, వారికి కావలసినంత వారు దొంగిలించరా?
10
అయితే నేను ఏశావును నగ్నంగా చేస్తాను; అతడు దాక్కునే స్థలాలను బయటపెడతాను, అప్పుడతడు ఎక్కడా దాక్కోలేడు. అతని సాయుధ పురుషులు నాశనానికి గురవుతారు, అతని సోదరులు పొరుగువారు కూడా నాశనమవుతారు. కాబట్టి,
11
‘తండ్రిలేని నీ పిల్లలను వదిలేయండి; నేను వారిని చూసుకుంటాను. నీ విధవరాండ్రు కూడా నన్ను నమ్ముకోవచ్చు’ అని చెప్పడానికి ఎవ్వరూ ఉండరు.”
12
యెహోవా ఇలా అంటున్నారు: “పాత్రలోనిది త్రాగడానికి అర్హత లేనివారు కూడా దానిని త్రాగినప్పుడు మీరు శిక్షించబడకుండ ఎందుకు ఉండాలి? మీరు శిక్షించబడేలా దానిని మీరు త్రాగాలి.”
13
యెహోవా, “నా జీవం తోడు, బొస్రా నాశనంగా, శాపంగా మారుతుందని, భయానకంగా, నిందలకు గురి అవుతుందని నా మీద నేను ప్రమాణం చేస్తున్నాను. దాని పట్టణాలన్ని శాశ్వతంగా శిథిలావస్థలో ఉంటాయి” అని ప్రకటిస్తున్నారు.
14
నేను యెహోవా నుండి ఒక సందేశం వచ్చింది; “దానిపై దాడి చేయడానికి మీరంతా కలిసి రండి! లెండి! యుద్ధానికి వెళ్దాం” అని చెప్పడానికి, దేశాలకు ఒక దూత పంపబడ్డాడు.
15
“ఇప్పుడు నేను నిన్ను దేశాల్లో అల్పమైన దానిగా, మనుష్యులు నిన్ను తృణీకరించేలా చేస్తాను.
16
నీవు రేపిన భయాందోళనలు, నీ హృదయ గర్వం నిన్ను మోసం చేశాయి, బండ సందుల్లో నివసించేదానా, కొండ శిఖరాల మీద నివాసం ఏర్పరచుకున్నదానా, నీవు గ్రద్దలా ఎత్తైన చోట నీ గూడు కట్టుకున్నా అక్కడినుండి నేను నిన్ను క్రిందికి పడవేస్తాను” అని యెహోవా చెప్తున్నారు.
17
“ఎదోము నాశనం అవుతుంది; దారిన వెళ్లేవారంతా నివ్వెరపోతారు, దాని గాయాలన్నిటిని చూసి ఎగతాళి చేస్తారు.
18
సొదొమ గొమొర్రాలను వాటి చుట్టూ ఉన్న పట్టణాలతో పాటు పడగొట్టినట్లు వీటిని కూడా పడగొట్టిన తర్వాత అక్కడ ఎవరూ నివసించనట్లే; ఇక్కడ కూడా ప్రజలు నివసించరు” అని యెహోవా అంటున్నారు.
19
“యొర్దాను పొదల్లో నుండి సింహం సమృద్ధిగా ఉన్న పచ్చిక బయళ్లకు వస్తున్నట్లుగా, నేను ఎదోమును దాని దేశం నుండి క్షణాల్లో తరిమివేస్తాను. దీని కోసం నేను నియమించిన వ్యక్తి ఎవరు? నాలాంటివారు ఎవరున్నారు, ఎవరు నన్ను సవాలు చేయగలరు? ఏ కాపరి నాకు వ్యతిరేకంగా నిలబడగలడు?”
20
కాబట్టి ఎదోమును వ్యతిరేకంగా యెహోవా ఏమి ప్రణాళిక వేశారో వినండి, తేమానులో నివసించేవారికి ఆయన ఏమి ఉద్దేశించారో వినండి: మందలోని చిన్న పిల్లలు బయటకు ఈడ్చివేయబడతాయి; వారు చేసిన దానికి వారి పచ్చికబయళ్లు పాడుచేయబడతాయి.
21
వారు పతనమైనప్పుడు భూమి కంపిస్తుంది; వారి మొర ఎర్ర సముద్రం వరకు వినిపిస్తుంది.
22
చూడండి! శత్రువు తన రెక్కలు బొస్రా మీదుగా విప్పి గ్రద్దలా దూసుకుపోతాడు. ఆ రోజున ఎదోము యోధులు ప్రసవ వేదనలో ఉన్న స్త్రీలా వేదనలో ఉంటారు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options