యిర్మీయా 32:16-25
16
“నేరియా కుమారుడైన బారూకుకు కొనుగోలు పత్రాన్ని ఇచ్చిన తర్వాత, నేను యెహోవాను ఇలా ప్రార్థించాను:
17
“అయ్యో, ప్రభువా యెహోవా, మీ గొప్ప శక్తితో, మీ చాచిన బాహువుతో ఆకాశాలను భూమిని సృష్టించారు. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు.
18
మీరు వేలమందిపై ప్రేమ చూపిస్తారు కానీ తల్లిదండ్రుల పాపాల శిక్షను వారి తర్వాత వారి పిల్లల ఒడిలోకి తీసుకువస్తారు. ఆయన గొప్ప బలవంతుడైన దేవుడు, ఆయన పేరు సైన్యాల యెహోవా.
19
మీ ఉద్దేశాలు గొప్పవి, మీ క్రియలు బలమైనవి. మీ కనుదృష్టి సర్వ మానవాళిపై ఉన్నది; మీరు ప్రతిఒక్కరికి వారి ప్రవర్తనకు, వారి క్రియలకు తగిన ప్రతిఫలమిస్తారు.
20
మీరు ఈజిప్టులో సూచకక్రియలు, అద్భుతాలు చేశారు, నేటికీ ఇశ్రాయేలు మధ్య, ఇతర మనుష్యలందరి మధ్య వాటిని కొనసాగిస్తూ మీరు ఇంకా పేరు కీర్తి కలిగించుకుంటున్నారు.
21
మీ ప్రజలైన ఇశ్రాయేలీయులను సూచకక్రియలతో, అద్భుతాలతో, బలమైన చేతితో, చాచిన బాహువుతో, గొప్ప భయాన్ని కలిగించి ఈజిప్టు నుండి బయటకు తీసుకువచ్చారు.
22
మీరు వారి పూర్వికులకు ఇస్తానని ప్రమాణం చేసిన ఈ దేశాన్ని, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని వారికి ఇచ్చారు.
23
వారు దాని లోపలికి వచ్చి దానిని స్వాధీనం చేసుకున్నారు, కానీ వారు మీకు లోబడలేదు, మీ ధర్మశాస్త్రాన్ని అనుసరించలేదు; మీరు వారికి ఆజ్ఞాపించినట్లు వారు చేయలేదు. కాబట్టి మీరు వారిపై ఈ విపత్తు అంతా తెచ్చారు.
24
“పట్టణాన్ని స్వాధీనం చేసుకోవడానికి ముట్టడి దిబ్బలు ఎలా నిర్మించబడ్డాయో చూడండి. ఖడ్గం, కరువు తెగులు కారణంగా పట్టణం దాని మీద దాడి చేస్తున్న బబులోనీయుల చేతులకు అప్పగించబడుతుంది. నీవు చెప్పింది జరగడం ఇప్పుడు నీవే చూస్తున్నావు.
25
పట్టణం బబులోనీయుల చేతికి అప్పగించబడినప్పటికీ, యెహోవా, మీరు నాతో, ‘వెండి ఇచ్చి పొలాన్ని కొని, లావాదేవీకి సాక్షులను ఏర్పాటు చేసుకో’ అని చెప్పారు.”
Settings