Skip to content
ఆదికాండము 32:15-32

ఆదికాండము 32:15-32

15
ముప్పై పాడి ఒంటెలు వాటి పిల్లలు, నలభై ఆవులు, పది ఎద్దులు, ఇరవై ఆడగాడిదలు, పది మగ గాడిదలు.
16
వాటిని మందలు మందలుగా విభజించి, తన సేవకులకు అప్పగించి, తన సేవకులతో, “మంద మందకు నడుమ ఖాళీ ఉంచి, నాకంటే ముందుగా వెళ్లండి” అని అన్నాడు.
17
వారిలో మొదట నిలబడి ఉన్నవాన్ని ఇలా హెచ్చరించాడు: “నా సోదరుడు ఏశావు మీకు ఎదురై, ‘నీవు ఎవరి సంబంధివి, నీవు ఎక్కడికి వెళ్తున్నావు, నీ ముందు ఉన్న ఈ జంతువులన్నీ ఎవరివి?’ అని అడిగితే,
18
అప్పుడు నీవు ఇలా చెప్పాలి, ‘ఇవి నీ సేవకుడైన యాకోబువి, నా ప్రభువైన ఏశావుకు కానుకగా పంపబడ్డాయి, అతడు వెనుక వస్తున్నాడు.’ ”
19
అతడు మందల వెంట వెళ్తున్న రెండవ వానికి, మూడవ వానికి, మిగతా అందరికి అలాగే సూచించాడు: “మీరు ఏశావును కలిసినప్పుడు అతనితో ఇలాగే చెప్పాలి.
20
నీవు తప్పకుండ ఈ మాట చెప్పాలి, ‘నీ సేవకుడైన యాకోబు మా వెనుక వస్తున్నాడు.’ ” ఎందుకంటే అతడు, “నేను ముందుగా పంపుతున్న ఈ బహుమతులతో నేను అతన్ని శాంతింపజేస్తాను; తర్వాత, నేను అతన్ని చూసినప్పుడు, బహుశ అతడు నన్ను చేర్చుకుంటాడు” అని అనుకున్నాడు.
21
కాబట్టి యాకోబు బహుమతులు తనకు ముందుగా వెళ్లాయి, అయితే తాను మాత్రం ఆ రాత్రి శిబిరంలోనే ఉన్నాడు.
22
ఆ రాత్రి యాకోబు లేచి తన ఇద్దరు భార్యలను ఇద్దరు దాసీలను పదకొండుగురు పిల్లలను తీసుకుని యబ్బోకు రేవు దాటి వెళ్లాడు.
23
వారిని ఏరు దాటించి, తనకున్న ఆస్తినంతా వారితో పంపించాడు.
24
యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. తెల్లవారే వరకు ఒక మనుష్యుడు అతనితో పెనుగులాడాడు.
25
అతన్ని గెలవలేనని ఆ మనుష్యుడు గ్రహించి, యాకోబు తొడగూటి మీద కొట్టాడు. ఆ మనుష్యునితో పోరాడినందున యాకోబు తొడగూడు సడలింది.
26
అప్పుడు అతడు, “నన్ను వెళ్లనివ్వు, తెల్లవారింది” అన్నాడు. కానీ యాకోబు, “నన్ను దీవిస్తేనే గాని, నిన్ను వెళ్లనివ్వను” అన్నాడు.
27
అప్పుడు ఆ మనుష్యుడు, “నీ పేరేంటి?” అని అడిగాడు. అందుకతడు, “యాకోబు” అని జవాబిచ్చాడు.
28
అప్పుడు ఆ మనుష్యుడు, “ఇకమీదట నీ పేరు యాకోబు కాదు ఇశ్రాయేలు, ఎందుకంటే నీవు దేవునితో, మనుష్యులతో పోరాడి గెలిచావు” అని అన్నాడు.
29
యాకోబు అన్నాడు, “దయచేసి నీ పేరు నాకు చెప్పు.” కానీ అతడు అన్నాడు, “నా పేరు ఎందుకు అడుగుతున్నావు?” తర్వాత అతడు అక్కడ యాకోబును ఆశీర్వదించాడు.
30
యాకోబు ఆ స్థలానికి పెనీయేలు అని పేరు పెట్టి, “నేను దేవున్ని ముఖాముఖిగా చూశాను, అయినా నా ప్రాణం దక్కింది” అని అన్నాడు.
31
యాకోబు పెనీయేలు నుండి వెళ్లే సమయంలో సూర్యోదయం అయ్యింది, అతడు తొడకుంటుతూ నడిచాడు.
32
కాబట్టి యాకోబు తొడగూటి మీది తుంటినరం మీద దెబ్బ తిన్నాడు కాబట్టి, ఇశ్రాయేలీయులు నేటి వరకు తొడగూటి మీద ఉన్న తుంటినరం తినరు.

బైబిల్ పాఠం: Biblica® Open Telugu Contemporary Version™, © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. · CC BY-SA 4.0“Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc., used with permission.

Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options