Skip to content
దానియేలు 5:12-31

దానియేలు 5:12-31

12
ఎందుకంటే బెల్తెషాజరు అని రాజుచేత పిలువబడే దానియేలుకు చురుకైన మనస్సు, వివేకం, జ్ఞానం కలిగి, కలల భావాలు చెప్పడానికి, మర్మాలు వివరించడానికి, కఠినమైన ప్రశ్నలను పరిష్కరించడానికి సామర్థ్యం గలవాడు. ఆ దానియేలును పిలిపించండి, అతడు ఈ వ్రాతకు అర్థం మీకు చెప్తాడు.”
13
కాబట్టి దానియేలును రాజు సముఖానికి తీసుకువచ్చారు. రాజు దానియేలుతో ఇలా అన్నాడు, “నా తండ్రి యూదా నుండి తెచ్చిన బందీలలో ఒకడివైన దానియేలు నీవేనా?
14
నీలో దేవుళ్ళ ఆత్మ ఉందని, దైవ జ్ఞానం, వివేకం, విశేష జ్ఞానం ఉన్నాయని నేను విన్నాను.
15
గోడ మీద ఈ వ్రాత చదివి, దాని అర్థం నాకు చెప్పడానికి జ్ఞానులను, మాంత్రికులను పిలిపించాను, కాని వారెవరు అర్థం చెప్పలేకపోయారు.
16
ఇప్పుడు నీవు భావాలు చెప్పగలవని, కఠిన ప్రశ్నలను పరిష్కరించగలవని నేను విన్నాను. ఈ వ్రాత చదివి దాని అర్థం నాకు చెప్తే, నీకు ఊదా రంగు వస్ర్తం తొడిగించి, నీ మెడకు బంగారు గొలుసు వేసి, నిన్ను రాజ్యంలో మూడవ అధికారిగా చేస్తాను.”
17
అప్పుడు దానియేలు రాజుకు జవాబిస్తూ, “మీ కానుకలు మీరే ఉంచుకోండి, మీ బహుమానాలు ఎవరికైనా ఇవ్వండి. అయితే రాజు కోసం నేను ఈ రాత చదివి, దాని భావం ఏంటో చెప్తాను” అన్నాడు.
18
“రాజా! సర్వోన్నతుడైన దేవుడు నీ తండ్రి నెబుకద్నెజరుకు ఆధిపత్యం, మహాత్యం, ఘనత, వైభవం ప్రసాదించారు.
19
అతనికి ఇచ్చిన ఉన్నత స్థానాన్ని బట్టి అన్ని దేశాలు, వివిధ భాషల ప్రజలందరు అతనికి వణుకుతూ, భయపడేవారు. రాజు చంపాలనుకున్న వారిని చంపేవాడు; వదిలేయాలనుకున్నవారిని వదిలేశాడు; ఉన్నత పదవి ఇవ్వాలనుకున్నవారికి ఉన్నత పదవి ఇచ్చాడు; అవమానించాలని అనుకున్నవారిని అవమానించాడు.
20
అయితే, అతని హృదయం అహంకారంతో నిండింది, గర్వంతో బండబారి పోయింది, అప్పుడు అతడు తన సింహాసనం నుండి త్రోసివేయబడి, తన మహిమను కోల్పోయాడు.
21
అతడు ప్రజల్లో నుండి తరమబడి అతనికి జంతువుల మనస్సు ఇవ్వబడింది; అతడు అడవి గాడిదలతో నివసిస్తూ, ఎద్దులా గడ్డి మేశాడు; సర్వోన్నతుడు భూరాజ్యాల మీద అధికారి అని, ఆయన ఎవరికి ఇవ్వాలనుకుంటే వారికి వాటిని ఇస్తారని అతడు గుర్తించేవరకు అతని శరీరం ఆకాశం నుండి కురిసే మంచుకు తడిసింది.
22
“అయితే అతని కుమారుడవైన బెల్షస్సరు, ఇదంతా తెలిసినా కూడా నిన్ను నీవు తగ్గించుకోలేదు.
23
పరలోక ప్రభువుకు వ్యతిరేకంగా నిన్ను నీవు గొప్ప చేసుకున్నావు. దేవాలయ పాత్రలను తెప్పించి వాటిలో ద్రాక్షరసం పోసుకొని నీవు, నీ అధికారులు, నీ భార్యలు, నీ ఉంపుడుగత్తెలు త్రాగారు. చూడలేని, వినలేని, గ్రహించలేని వెండి, బంగారం, ఇత్తడి, ఇనుము, కర్ర, రాతి దేవుళ్ళను నీవు స్తుతించావు. కాని నీ జీవితాన్ని, నీ మార్గాలన్నిటిని తన చేతిలో పట్టుకున్న దేవున్ని నీవు గౌరవించలేదు.
24
కాబట్టి ఆయన వ్రాత వ్రాయడానికి ఆ చేతిని పంపారు.
25
“వ్రాయబడిన రాత ఇది: మెనే, మెనే, టెకేల్, ఉఫార్సీన్.
26
“ఈ పదాల అర్థం ఇది: “మెనే: దేవుడు నీ పరిపాలన రోజులను లెక్కించి, నీ పాలనను ముగింపుకు తీసుకువచ్చారు.
27
“టెకేల్: నీవు త్రాసులో తూచబడ్డావు, తక్కువగా ఉన్నట్లు తేలింది.
28
“ఫెరేస్: నీ రాజ్యం విభజింపబడి మాదీయులకు పర్షియా వారికి ఇవ్వబడుతుంది.”
29
అప్పుడు బెల్షస్సరు ఆజ్ఞమేరకు, దానియేలుకు ఊదా రంగు వస్ర్తం తొడిగించారు, అతని మెడలో బంగారు గొలుసు వేశారు, అతన్ని రాజ్యంలో మూడవ అధికారిగా ప్రకటించారు.
30
అదే రాత్రి కల్దీయుల రాజైన బెల్షస్సరు చంపబడ్డాడు,
31
మాదీయుడైన దర్యావేషు అరవై రెండేళ్ళ వయస్సులో రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు.

బైబిల్ పాఠం: Biblica® Open Telugu Contemporary Version™, © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. · CC BY-SA 4.0“Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc., used with permission.

Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options