అపొస్తలుల కార్యములు 21:17-33
17
మేము యెరూషలేముకు చేరిన తర్వాత, సహోదరి సహోదరులు మమ్మల్ని సంతోషంగా చేర్చుకున్నారు.
18
మరుసటిరోజు పౌలు మేము కలిసి యాకోబును చూడటానికి వెళ్లాము, అక్కడ సంఘ పెద్దలందరు ఉన్నారు.
19
పౌలు వారిని పలకరించి, యూదేతరుల మధ్యలో తన పరిచర్య ద్వారా దేవుడు చేసిన కార్యాలన్నింటిని వివరంగా తెలియజేశాడు.
20
వారు వాటిని విని దేవుని స్తుతించారు. ఆ తర్వాత వారు పౌలుతో, “సహోదరుడా, చూడు, యూదులలో ఎన్ని వేలమంది విశ్వసించారో, వారందరు ధర్మశాస్త్రం కోసం ఆసక్తి కలిగి ఉన్నారు.
21
యూదేతరుల మధ్యలో నివసిస్తున్న యూదులకు వారి పిల్లలకు సున్నతి చేయించవద్దని, మన ఆచారాల ప్రకారం జీవించవద్దని, మోషే ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టాలని నీవు బోధిస్తున్నావని వారు తెలియజేశారు.
22
నీవు ఇక్కడ వచ్చావన్న సంగతి వారు ఖచ్చితంగా వింటారు.
23
కాబట్టి మేము చెప్పినట్లు నీవు చేయాలి. అది ఏంటంటే, మాతో నలుగురు మ్రొక్కుబడి చేసుకొన్నవారు ఉన్నారు.
24
వారిని తీసుకెళ్లి, వారి శుద్ధీకరణ సంస్కారంలో పాల్గొని, వారు తమ తల వెంట్రుకలను తీయించుకోవడానికి అయ్యే ఖర్చులను భరించు. అప్పుడు నీ గురించి తెలిసినదానిలో సత్యం లేదని, నీవు కూడా ధర్మశాస్త్రానికి లోబడే జీవిస్తున్నావని ప్రతి ఒక్కరు తెలుసుకుంటారు.
25
అయితే యూదేతరుల విశ్వాసులు, ‘విగ్రహాలకు అర్పించిన ఆహారాన్ని తినడం, రక్తం తినడం, గొంతును నులిమి చంపిన జంతువుల మాంసం తినడం, లైంగిక అనైతికత సంబంధాలను మానుకోవాలి’ అనే మా నిర్ణయాన్ని వారికి వ్రాసి తెలిపాం” అన్నారు.
26
మరుసటిరోజు పౌలు ఆ మనుష్యులను తీసుకెళ్లి వారితో తాను కూడా శుద్ధి చేసుకున్నాడు. శుద్ధీకరణ రోజులు పూర్తియైన తర్వాత అందరి కోసం కానుకలను చెల్లిస్తానని చెప్పడానికి అతడు దేవాలయంలోనికి వెళ్లాడు.
27
ఏడు రోజులు పూర్తి కావచ్చినప్పుడు, ఆసియా ప్రాంతం నుండి వచ్చిన కొందరు యూదులు దేవాలయంలో పౌలును చూసి, జనసమూహాన్ని రెచ్చగొట్టి అతన్ని పట్టుకున్నారు.
28
వారు బిగ్గరగా, “తోటి ఇశ్రాయేలీయులారా, మాకు సహాయం చేయండి! ఈ వ్యక్తి మన ప్రజలకు మన ధర్మశాస్త్రానికి ఈ స్థలానికి వ్యతిరేకంగా ప్రతిచోట అందరికి బోధిస్తున్నాడు. అంతేకాక గ్రీసుదేశస్థులను ఈ దేవాలయంలోనికి తీసుకువచ్చి, ఈ పరిశుద్ధ స్థలాన్ని అపవిత్రం చేశాడు” అని కేకలు వేశారు.
29
వారు అంతకుముందు ఎఫెసీయుడైన త్రోఫిముతో పౌలును పట్టణంలో చూశారు, కాబట్టి పౌలు అతన్ని దేవాలయంలోనికి తెచ్చాడని భావించారు.
30
పట్టణం అంతా ఆందోళన రేగింది, అన్ని వైపుల నుండి ప్రజలు పరుగెత్తికొని వచ్చారు. వారు పౌలును పట్టుకుని, అతన్ని దేవాలయం నుండి బయటకు లాగి, వెంటనే దేవాలయ తలుపులు మూసేసారు.
31
వారు అతన్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు, యెరూషలేము పట్టణమంతా ఆందోళనగా మారిందనే వార్త రోమా ప్రధాన సైన్యాధికారికి చేరింది.
32
అతడు వెంటనే కొందరు అధికారులను, సైనికులను వెంటపెట్టుకుని ఆ గుంపు దగ్గరకు పరుగెత్తుకొని వచ్చాడు. ఆ ఆందోళనకారులు అధిపతిని అతని సైనికులను చూసి, పౌలును కొట్టడం ఆపివేశారు.
33
అధిపతి వచ్చి అతన్ని పట్టుకుని, రెండు గొలుసులతో బంధించమని ఆజ్ఞాపించాడు. ఆ తర్వాత, “అతడు ఎవరు? ఏమి చేశాడు?” అని అడిగాడు.
Settings