2 దినవృత్తాంతములు 30:1-10
1
ఇశ్రాయేలు ప్రజల దేవుడైన యెహోవాకు పస్కాపండుగ ఆచరించడానికి యెరూషలేములో యెహోవా ఆలయానికి రమ్మని హిజ్కియా ఇశ్రాయేలు ప్రజలకు యూదా ప్రజలకు అందరికి కబురు పంపాడు. ఎఫ్రాయిం, మనష్షే గోత్రాలకు కూడా లేఖలు వ్రాసి పంపాడు.
2
రాజు, అతని అధికారులు, యెరూషలేములో ఉన్న సమాజమంతా రెండవ నెలలో పస్కాను జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు.
3
ఎందుకంటే, తగినంత మంది యాజకులు తమను తాము ప్రతిష్ఠించుకోకపోవడం, ప్రజలు యెరూషలేములో సమావేశం కాకపోవడం వలన ఎప్పుడు జరిపే సమయంలో వారు పండుగ జరుపుకోలేకపోయారు.
4
ఆ విషయం రాజుకు సమాజం వారందరికి అంగీకారంగా ఉంది.
5
ప్రజలంతా యెరూషలేముకు వచ్చి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు పస్కా పండుగ జరుపుకోవాలని బెయేర్షేబ నుండి దాను వరకు ఇశ్రాయేలు అంతటా ప్రకటించాలని వారు నిర్ణయించుకున్నారు. చాలాకాలంగా వ్రాయబడిన ప్రకారం పెద్ద సంఖ్యలో ప్రజలు పండుగ జరుపుకోలేదు.
6
రాజు, అతని అధికారుల నుండి ఉత్తరాలు తీసుకుని వార్తాహరులు రాజాజ్ఞ ప్రకారం యూదా, ఇశ్రాయేలు దేశమంతా వెళ్లారు. ఆ ఉత్తరంలో ఇలా వ్రాసి ఉంది: “ఇశ్రాయేలు ప్రజలారా, అబ్రాహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వైపుకు తిరగండి. అష్షూరు రాజుల చేతిలో నుండి తప్పించుకుని మిగిలి ఉన్న మీ దగ్గరకు ఆయన తిరిగి వస్తారు.
7
తమ పూర్వికుల దేవుడైన యెహోవాకు నమ్మకద్రోహం చేసిన మీ తల్లిదండ్రుల్లా మీ తోటి ఇశ్రాయేలీయుల్లా ఉండకండి. మీరు చూస్తున్నట్లుగా ఆయన వారిని నాశనానికి అప్పగించారు.
8
మీ పూర్వికుల్లా మూర్ఖంగా ప్రవర్తించకుండ యెహోవాకు లోబడండి. ఆయన శాశ్వతంగా పవిత్రం చేసి ప్రత్యేకించుకున్న పరిశుద్ధాలయంలోకి రండి. మీ దేవుడైన యెహోవాను సేవించండి, అప్పుడు ఆయన తీవ్రమైన కోపం మీమీద నుండి మళ్ళవచ్చు.
9
మీరు యెహోవా వైపు తిరిగితే మీ తోటి ఇశ్రాయేలీయులపై మీ పిల్లలపై వారిని బందీలుగా తీసుకువెళ్లిన వారికి కనికరం కలుగుతుంది. వారు ఈ దేశానికి తిరిగి వస్తారు. ఎందుకంటే మీ దేవుడైన యెహోవా దయ కరుణ గలవారు. మీరు ఆయన వైపు తిరిగితే ఆయన మీ నుండి తన ముఖం త్రిప్పుకోరు.”
10
వార్తాహరులు జెబూలూను ప్రదేశం వరకు ఎఫ్రాయిం మనష్షేల దేశాల్లోని ప్రతి పట్టణానికి వెళ్లారు. అయితే ప్రజలు వారిని తృణీకరించి నవ్వులపాలు చేశారు.
బైబిల్ పాఠం: Biblica® Open Telugu Contemporary Version™, © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. · CC BY-SA 4.0“Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc., used with permission.