1 రాజులు 7:34-51
34
ప్రతి స్తంభానికి నాలుగు మూలలకు నాలుగు దిమ్మెలు ఉన్నాయి, వాటిని స్తంభాలతో కలిపి పోత పోశారు.
35
స్తంభం పైన చుట్టూ జానెడు ఎత్తుగల గుండ్రని బొద్దు ఉంది. స్తంభం, దానిపై ఉన్న చట్రాలు, పలకలు ఒకటిగా పోత పోయబడ్డాయి.
36
అతడు పలకల మీద, చట్రాల మీద స్థలమున్న ప్రతీ చోట కెరూబు, సింహాలు, ఖర్జూర వృక్షాల ఆకారాలను, వాటి చుట్టూ పూదండలతో పాటు చెక్కించాడు.
37
ఈ విధంగా ఆ పది స్తంభాలు చేయించాడు, అన్నిటికీ ఒకే పోత, ఒకే కొలత, ఒకే ఆకారము.
38
తర్వాత అతడు పది ఇత్తడి తొట్లు చేయించాడు. ప్రతి తొట్టి అడ్డుకొలత నాలుగు మూరలు. ప్రతి తొట్టిలో నలభై బాతులు పట్టేది, ఒక్కొక్క స్తంభం మీద ఒక్కో తొట్టి పెట్టారు.
39
అతడు దేవాలయానికి కుడివైపు అయిదు స్తంభాలను, ఎడమవైపు అయిదు స్తంభాలను పెట్టించాడు. నీళ్ల తొట్టెను దక్షిణం వైపు దేవాలయానికి కుడి ప్రక్క ఆగ్నేయ దిక్కుగా పెట్టించాడు.
40
అతడు కుండలను, చేటలను, చిలకరించడానికి వాడే గిన్నెలను కూడా చేయించాడు. కాబట్టి హూరాము యెహోవా ఆలయానికి రాజైన సొలొమోను ఆజ్ఞ ప్రకారం పనంతా చేసి ముగించాడు:
41
రెండు స్తంభాలు, ఆ రెండు స్తంభాల మీద ఉన్న గిన్నెలాంటి రెండు పీటలు, గిన్నెలాంటి పీటలను కప్పడానికి రెండు అల్లికలు,
42
స్తంభాలపై ఉన్న గిన్నెలాంటి పీటలను అలంకరిస్తూ ఒక్కొక్క అల్లికకు రెండేసి వరుసల చొప్పున ఆ రెండు అల్లికలకు నాలుగు వందల దానిమ్మపండ్లు,
43
పది పీటలు వాటిపై ఉన్న పది తొట్లు,
44
నీళ్ల తొట్టె దాని క్రింద ఉన్న పన్నెండు ఎడ్లు,
45
కుండలు, చేటలు, చిలకరించడానికి వాడే గిన్నెలు. హూరాము యెహోవా ఆలయానికి సొలొమోను రాజు చేయమన్న ఈ వస్తువులన్నీ మెరుగుపెట్టిన ఇత్తడితో తయారుచేశాడు.
46
రాజు వీటన్నిటిని యొర్దాను సమతల మైదానంలో, సుక్కోతుకు సారెతానుకు మధ్య ఉన్న బంకమట్టితో పోతపోయించాడు.
47
ఆ ఇత్తడి వస్తువుల సంఖ్య చాలా ఎక్కువ కాబట్టి సొలొమోను వాటిని తూకం వేయించలేదు; ఆ ఇత్తడి బరువు ఎంతో తెలుసుకోడానికి లేదు.
48
యెహోవా మందిరానికి సొలొమోను చేయించిన తక్కిన వస్తువులు: బంగారు బలిపీఠం; సన్నిధి రొట్టెలు పెట్టే బంగారు బల్ల;
49
మేలిమి బంగారు దీపస్తంభాలు (గర్భాలయం ఎదుట కుడి ప్రక్కన అయిదు, ఎడమ ప్రక్కన అయిదు); బంగారు పుష్పాలు దీపాలు పట్టుకారులు;
50
అలాగే మేలిమి బంగారు పళ్లాలు, వత్తులు కత్తిరించే కత్తెరలు, చిలకరించే గిన్నెలు, పాత్రలు, ధూపకలశాలు; అనే అతి పరిశుద్ధ స్థలమైన గర్భాలయ తలుపులకు, మందిర ప్రధాన గది తలుపులకు, బంగారు బందులు చేయించాడు.
51
రాజైన సొలొమోను యెహోవా మందిరానికి చేసిన పని అంతా ముగిసిన తర్వాత, తన తండ్రి దావీదు ప్రతిష్ఠించిన వెండి, బంగారు, వస్తువులను తెప్పించి యెహోవా మందిర ఖజానాలో పెట్టాడు.
బైబిల్ పాఠం: Biblica® Open Telugu Contemporary Version™, © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. · CC BY-SA 4.0“Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc., used with permission.
Settings