కంటెంట్‌కు వెళ్లండి

అపొస్తలుల కార్యములు5

అననీయ సప్పీరలు పరిశుద్ధాత్మతో అబద్ధమాడుట

1
అననీయ అనేవాడు తన భార్యయైన సప్పీరాతో కలిసి తన పొలాన్ని అమ్మాడు.
2
అతడు తన భార్యకు తెలిసే ఆ అమ్మిన డబ్బు నుండి కొంత దాచుకొని, మిగిలిన దానిని తెచ్చి అపొస్తలుల పాదాల దగ్గర పెట్టాడు.
3
అప్పుడు పేతురు, “అననీయా, పొలాన్ని అమ్మిన డబ్బులో కొంత నీవు దాచుకొని పరిశుద్ధాత్మతో అబద్ధమాడడానికి ఎలా సాతాను నీ హృదయాన్ని ప్రేరేపించాడు?
4
అమ్మక ముందు అది నీదే కాదా? దానిని అమ్మిన తర్వాత ఆ డబ్బు నీ ఆధీనంలోనే ఉంది కదా! అలాంటప్పుడు ఇలాంటి పని చేయాలని నీవు ఎలా ఆలోచించావు? నీవు మనుష్యులతో కాదు కాని దేవునితోనే అబద్ధమాడావు” అన్నాడు.
5
అననీయ ఆ మాటలు విని, వెంటనే క్రిందపడి చనిపోయాడు. జరిగిన విషయాన్ని విన్నవారందరిలో గొప్ప భయం పుట్టింది.
6
అప్పుడు కొంతమంది యువకులు వచ్చి, అతని శరీరాన్ని బట్టలతో చుట్టి, మోసుకువెళ్లి పాతిపెట్టారు.
7
మూడు గంటల తర్వాత, జరిగిన సంగతి తెలియని అతని భార్య లోపలికి వచ్చింది.
8
పేతురు ఆమెను, “నీవు అననీయ కలిసి ఆ పొలాన్ని ఇంతకే అమ్మారా? నాకు చెప్పు” అని అడిగాడు. అందుకు ఆమె, “అవును, ఇంతకే అమ్మాము” అని జవాబిచ్చింది.
9
అందుకు పేతురు ఆమెతో, “ప్రభువు ఆత్మను పరీక్షించడానికి మీరు ఎందుకు ఒక్కటయ్యారు? ఇదిగో, నీ భర్తను పాతిపెట్టిన వారి పాదాలు గుమ్మం దగ్గరే ఉన్నాయి, వారు నిన్ను కూడా మోసుకుపోతారు” అన్నాడు.
10
ఆ క్షణమే ఆమె అతని పాదాల దగ్గర పడి చనిపోయింది. అప్పుడు ఆ యువకులు లోపలికి వచ్చి, ఆమె చనిపోయిందని చూసి, ఆమె శరీరాన్ని మోసుకుపోయి తన భర్త ప్రక్కనే ఆమెను పాతిపెట్టారు.
11
సంఘంలో ఈ సంగతులను విన్నవారందరిలో గొప్ప భయం పుట్టింది.

అపొస్తలుల సూచకక్రియలు మరియు సంఘవృద్ధి

12
అపొస్తలులు ప్రజల మధ్యలో అనేక సూచకక్రియలను, అద్భుతాలను చేశారు. విశ్వసించిన వారందరు సొలొమోను మండపంలో కలుసుకొనేవారు.
13
ప్రజలు వారిని చాలా గౌరవించినప్పటికి, ఎవరు వారితో కలిసే ధైర్యం చేయలేకపోయారు.
14
అయినా, మరి ఎక్కువ సంఖ్యలలో స్త్రీలు పురుషులు ప్రభువును నమ్ముకొని విశ్వాసుల గుంపులో చేరారు.
15
అపొస్తలుల కార్యాలను బట్టి అనేకమంది రోగులను మంచాల మీద తీసుకువచ్చి, పేతురు వెళ్లేటప్పుడు అతని నీడ పడినా చాలని భావించి వీధుల్లో పరుపు మీద పడుకోబెట్టారు.
16
యెరూషలేము చుట్టుప్రక్కల ఉన్న పట్టణపు ప్రజలు తీసుకుని వచ్చిన రోగులు అపవిత్రాత్మలతో పీడింపడే వారందరు కూడా స్వస్థపడ్డారు.

అపొస్తలులు అరెస్టు చేయబడి అద్భుతముగా విడిపించబడుట

17
ప్రధాన యాజకుడు అతనితో ఉన్నవారంతా, అనగా సద్దూకయ్యుల తెగవారు అసూయతో నిండుకొన్నారు.
18
కాబట్టి వారు అపొస్తలులను పట్టుకుని పట్టణపు చెరసాలలో వేయించారు.
19
కానీ ప్రభువు దూత ఆ రాత్రివేళ చెరసాల తలుపులు తెరచి, వారిని బయటకు తీసుకువచ్చి,
20
“వెళ్లి, దేవాలయ ఆవరణంలో నిలబడి ఈ జీవం గురించి ప్రజలందరికి బోధించండి” అని వారితో చెప్పాడు.
21
తమకు చెప్పిన ప్రకారం తెల్లవారగానే వారు దేవాలయ ఆవరణంలోనికి వెళ్లి ప్రజలకు బోధించడం మొదలుపెట్టారు. ప్రధాన యాజకుడు అతని సహచరులు రాగానే, యూదా న్యాయసభ వారిని పిలిపించి, అపొస్తలులను చెరసాల నుండి తీసుకురమ్మని అధికారులను పంపించారు.
22
వారు చెరసాలకు వచ్చి చూసినపుడు వారక్కడ కనబడలేదు. ఆ అధికారులు తిరిగివెళ్లి న్యాయసభ వారికి,
23
“మేము వెళ్లినప్పుడు చెరసాల జాగ్రత్తగానే తాళం వేయబడి కావలివారు తలుపుల దగ్గర నిలబడే ఉన్నారు; కానీ మేము తలుపులు తెరిచినప్పుడు, లోపల మాకు ఎవరు కనబడలేదు” అని చెప్పారు.
24
ఆ మాటలు విని, దేవాలయ కాపలా అధికారి ముఖ్య యాజకులు కలవరంతో, ఇది దేనికి దారితీస్తుందో అని ఆందోళన చెందారు.
25
అప్పుడు ఒకడు వచ్చి, “చూడండి, మీరు చెరసాలలో పెట్టినవారు దేవాలయ ఆవరణంలో నిలబడి ప్రజలకు బోధిస్తున్నారు” అని చెప్పాడు.
26
వెంటనే కాపలా అధికారి తన సేవకులతో వెళ్లి, అపొస్తలులను తీసుకువచ్చారు. ప్రజలు తమను రాళ్లతో కొడతారేమో అని భయపడి, వారు బలప్రయోగం చేయలేదు.
27
ప్రధాన యాజకుడు ప్రశ్నించాలని అపొస్తలులను న్యాయసభ ముందు నిలబెట్టారు.
28
అప్పుడు ప్రధాన యాజకుడు, “ఈ పేరట బోధించకూడదు అని మీకు మేము ఖచ్చితంగా ఆదేశించాము, అయినాసరే మీ బోధలతో యెరూషలేమును నింపి ఈ మనుష్యుని హత్యచేసిన నేరాన్ని మా మీదికి తేవాలని చూస్తున్నారు” అని అన్నాడు.

మనుష్యులకంటే దేవునికి విధేయత

29
అందుకు పేతురు ఇతర అపొస్తలులు, “మేము మనుష్యుల కన్నా దేవునికే లోబడాలి కదా!
30
మీరు సిలువ మీద వ్రేలాడదీసి చంపిన యేసును మన పితరుల దేవుడు సజీవంగా లేపారు.
31
ఆయన ఇశ్రాయేలీయుల ప్రజలకు పశ్చాత్తాపాన్ని, పాపక్షమాపణను దయచేయడానికి, దేవుడు ఆయనను అధిపతిగా రక్షకునిగా తన కుడిచేతి వైపుకు హెచ్చించారు.
32
మేము, అలాగే దేవునికి లోబడిన వారికి ఇవ్వబడిన పరిశుద్ధాత్మ ఈ సంగతులకు సాక్షులము.”
33
న్యాయసభ వారు ఈ మాటలను విని మరింత కోపం తెచ్చుకుని వారిని చంపాలని అనుకున్నారు.
34
అయితే న్యాయసభలోని ఒకడు, ప్రజలందరి చేత గౌరవించబడే పరిసయ్యుడైన గమలీయేలు అనే ధర్మశాస్త్ర ఉపదేశకుడు లేచి, వారిని కొంతసేపు బయట ఉంచమని ఆదేశించాడు.
35
తర్వాత న్యాయసభతో, “ఇశ్రాయేలీయులారా, ఈ మనుష్యులకు మీరు ఏమి చేయాలనుకుంటున్నారో దాని గురించి జాగ్రత్తగా ఉండండి.
36
ఎందుకంటే కొంతకాలం క్రిందట థూదా అనే ఒకడు, తాను గొప్పవానినని చెప్పుకొన్నాడు, ఇంచుమించు నాలుగువందలమంది అతన్ని అనుసరించారు. అతడు చంపబడిన తర్వాత, అతని అనుచరులు చెదరిపోయారు, ఏమి మిగలకుండా పోయింది.
37
అతని తర్వాత, జనాభా లెక్కలను వ్రాసే రోజుల్లో గలిలయుడైన యూదా అనేవాడు లేచి ప్రజలను తిరుగుబాటు చేయడానికి ప్రేరేపించాడు. అతడు కూడా చంపబడ్డాడు, అతని అనుచరులు కూడా చెదరిపోయారు.
38
కాబట్టి ప్రస్తుత ఈ పరిస్థితిలో నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే: వారిని వదిలేయండి! వారిని వెళ్లనివ్వండి. వారి ఉద్దేశాలు లేదా క్రియలు మనుష్యుల వలన వచ్చినవైతే అవే ఆగిపోతాయి.
39
కాని అది దేవుని నుండి అయితే, వారిని మీరు ఆపలేరు; మీరు దేవునితో పోరాడుతున్నట్లే అని మీరు తెలుసుకుంటారు” అన్నాడు.
40
అతని మాటలను వారు అంగీకరించారు, కాబట్టి అపొస్తలులను లోపలికి పిలిచి వారిని కొట్టించారు. తర్వాత యేసు పేరట మాట్లాడకూడదని వారిని ఆదేశించి పంపించారు.
41
ఆ నామాన్ని బట్టి అవమానం పొందడానికి తగినవారిగా ఎంచడంతో సంతోషిస్తూ అపొస్తలులు న్యాయసభ నుండి బయటకు వెళ్లిపోయారు.
42
వారు ప్రతీ రోజు మానక దేవాలయ ఆవరణాల్లో ఇంటింట సువార్తను బోధిస్తూ “యేసే క్రీస్తు” అని ప్రకటించుచున్నారు.
Use arrow keys to navigate
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options