Skip to content
రోమీయులకు 3:1-20

రోమీయులకు 3:1-20

1
అయితే యూదునిగా ఉండడం వల్ల ప్రయోజనమేమిటి? సున్నతిలో ఉన్న విలువేమిటి?
2
ప్రతీ విషయంలోను ఎక్కువే! మొదటిగా, దేవుని మాటలు యూదులకు అప్పగించబడ్డాయి.
3
వారిలో కొందరు అవిశ్వాసంగా ఉన్నంత మాత్రాన వారి అవిశ్వాసం దేవుని విశ్వసనీయతను నిరర్థకం చేస్తుందా?
4
ఎన్నటికి కాదు; ప్రతి ఒక్క మనిషి అబద్ధికుడు కావచ్చు కాని దేవుడు సత్యవంతుడు. దేవుని గురించి లేఖనంలో ఇలా వ్రాయబడి ఉన్నది, “మాట్లాడినప్పుడు నీవు నీతిమంతుడవని నిరూపించబడతావు తీర్పు తీర్చునప్పుడు నీవు జయిస్తావు.”
5
అయితే మన దుర్మార్గాన్ని బట్టి దేవుడు నీతిమంతుడని మరింత స్పష్టమవుతుంటే, మనమేమి చెప్పగలం? దేవుడు తన ఉగ్రతను మనమీద చూపితే ఆయన అన్యాయస్థులు అవుతారా? నేను మానవరీతిగా మాట్లాడుతున్నాను.
6
ఖచ్చితంగా కాదు! ఒకవేళ అలా అయితే, దేవుడు లోకానికి ఎలా తీర్పు తీర్చగలరు?
7
అయితే కొందరు, “ఒకవేళ నా అబద్ధం వలన దేవుని సత్యం వ్యాపించి ఆయనకు మహిమ కలిగితే నేను పాపిగా ఎందుకు తీర్పు తీర్చబడాలి?” అని వాదిస్తారు.
8
“మంచి జరగడానికి చెడు చేద్దాం” అని మేము చెప్తున్నామని కొందరు దూషిస్తున్నట్లుగా మేమెందుకు చెప్పకూడదు? అలాంటి వారికి వచ్చే శిక్ష న్యాయమైనదే!
9
అప్పుడు మనం ఏమని నిర్ధారించాలి? మనకు ఏమైనా ప్రయోజనం ఉందా? ఎంత మాత్రం లేదు! యూదులు, యూదేతరులు ఒకేలా పాప బంధకాలలో ఉన్నారని మేము ముందుగానే చెప్పాము.
10
దీని గురించి లేఖనాల్లో ఈ విధంగా, “నీతిమంతులు ఎవరూ లేరు, ఒక్కరు కూడా లేరు;
11
గ్రహించగలినవారు ఒక్కరు కూడా లేరు; దేవుని వెదకేవారు ఒక్కరు కూడా లేరు.
12
అందరు దారి తప్పి చెడిపోయారు, వారందరు కలిసి అప్రయోజకులయ్యారు; మేలు చేసేవారు ఒక్కరు కూడా లేరు, ఒక్కరు కూడా లేరు.”
13
“వారి గొంతుకలు తెరచిన సమాధుల్లా ఉన్నాయి; వారు నాలుకలతో మోసం చేస్తారు.” “వారి పెదవుల క్రింద సర్పాల విషం ఉంది.”
14
“వారి నోటి నిండా శాపాలు, పగ ఉన్నాయి.”
15
“వారి పాదాలు రక్తాన్ని చిందించడానికి త్వరపడుతున్నాయి;
16
వారి మార్గాల్లో నాశనం, కష్టం ఉన్నాయి,
17
సమాధాన మార్గం వారికి తెలియదు.”
18
“వారి కళ్లలో దేవుని భయం లేదు.”
19
ప్రతి నోరు మౌనంగా ఉండేలా, లోకమంతా దేవునికి లెక్క అప్పగించేలా ధర్మశాస్త్రం చెప్పేవన్నీ ధర్మశాస్త్రానికి లోబడేవారికి చెప్తుందని మనం తెలుసు.
20
కాబట్టి ధర్మశాస్త్ర క్రియల ద్వారా ఎవరూ దేవుని దృష్టిలో నీతిమంతునిగా తీర్పు తీర్చబడరు, కాని ధర్మశాస్త్రం ద్వారా మన పాపాల గురించి మనం తెలుసుకుంటాము.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options