రోమీయులకు 12:6-21
6
మనలో అందరికి అనుగ్రహించబడిన కృపను బట్టి మనం వేరు వేరు కృపావరాలు కలిగి ఉన్నాము. నీ కృపావరం ప్రవచనా వరమైతే నీ విశ్వాసానికి అనుగుణంగా ప్రవచించు.
7
ఆ కృపావరం సేవచేయడమైతే సేవ చేయి. ఆ కృపావరం బోధించడమైతే బోధించు;
8
ఒకవేళ అది ప్రోత్సహించడమైతే ప్రోత్సహించు; ఒకవేళ అది దానం చేయడమైతే ధారళంగా దానం చేయి; ఒకవేళ ఇతరులను నడిపించడమైతే శ్రద్ధగా నడిపించు, ఒకవేళ అది కనికరం చూపించడమైతే, సంతోషంగా చూపించండి.
9
ప్రేమ నిష్కళంకంగా ఉండాలి. చెడ్డదాన్ని ద్వేషించి మంచిని పట్టుకోవాలి.
10
ప్రేమలో ఒకరిపట్ల ఒకరు శ్రద్ధ కలిగి ఉండండి. మీకన్న ఎక్కువగా ఒకరిని ఒకరు గౌరవించండి.
11
అత్యాసక్తి చూపడంలో ఎన్నడూ వెనుకబడవద్దు కాని మీరు ఆత్మీయ ఉత్సాహం కలిగి దేవుని సేవించండి.
12
నిరీక్షణలో సంతోషించండి, కష్టాల్లో సహనం కలిగి ఉండండి, ప్రార్థన చేసేప్పుడు విశ్వాసంతో ఉండండి.
13
అవసరంలో ఉన్న పరిశుద్ధులతో పంచుకోండి. ఆతిథ్యం ఇవ్వండి.
14
మిమ్మల్ని హింసించినవారిని దీవించండి; వారిని దీవించండి కాని శపించవద్దు.
15
ఆనందించే వారితో కలిసి ఆనందించండి, దుఃఖించేవారితో కలిసి దుఃఖించండి.
16
ఒకరితో ఒకరు ఐక్యమత్యం కలిగి జీవించండి. గర్వం ఉండవద్దు కాని మీకన్న తక్కువ స్థాయిలో ఉన్న ప్రజలతో కూడా సహవాసం చేయండి. అహంకారం ఉండవద్దు.
17
చెడుకు ప్రతిగా ఎవరికి చెడు చేయకండి. అందరి దృష్టికి సరియైనవిగా ఉన్నవాటిని చేసేలా జాగ్రత్తపడండి.
18
మీకు సాధ్యమైనంత వరకు అందరితో సమాధానం కలిగి జీవించండి.
19
నా ప్రియ స్నేహితులారా, పగ తీర్చుకోకండి కాని, “పగ తీర్చుకోవడం నా పని, వారికి తగిన ప్రతిఫలాన్ని ఇస్తానని ప్రభువు చెప్పారు” అని వ్రాయబడిన ప్రకారం దేవుని ఉగ్రతకు విడిచిపెట్టండి.
20
అయితే, “మీ శత్రువు ఆకలితో ఉంటే వానికి ఆహారం పెట్టండి; అతడు దాహంతో ఉంటే వానికి త్రాగడానికి ఇవ్వండి. మీరు ఇలా చేయడం ద్వారా అతని తలపై మండుతున్న నిప్పులు కుప్పగా పోస్తారు.”
21
చెడును మీమీద గెలవనివ్వక, మంచితో చెడును ఓడించండి.
Settings