ప్రకటన 14:6-13
6
ఆ తర్వాత నేను ఇంకొక దేవదూత ఆకాశం మధ్య ఎగిరివెళ్తూ భూమి మీద జీవిస్తున్న ప్రతి దేశానికి, ప్రతి జాతి వారికి, ప్రతి భాష మాట్లాడేవారికి, ప్రతి జనులకు శాశ్వతమైన సువార్తను ప్రకటించడాన్ని చూశాను.
7
అతడు పెద్ద స్వరంతో, “దేవునికి భయపడి ఆయనకు మహిమ చెల్లించండి! ఎందుకంటే ఆయన తీర్పు తీర్చే గడియ వచ్చింది! ఆకాశాలను, భూమిని, సముద్రాన్ని నీటి ఊటలను సృష్టించిన దేవుని ఆరాధించండి!” అని చెప్పాడు.
8
రెండవ దేవదూత అతని వెంబడించి, “ ‘కూలిపోయింది! బబులోను మహా పట్టణం కూలిపోయింది!’ అది తన వ్యభిచార మద్యాన్ని అన్ని దేశాలకు త్రాగించింది” అని చెప్పాడు.
9
మూడవ దేవదూత వారిని వెంబడించి పెద్ద స్వరంతో, “మృగాన్ని దాని విగ్రహాన్ని పూజించి, తమ నుదుటి మీద లేదా చేతి మీద దాని ముద్ర వేయించుకొంటే,
10
వారు ఏమి కలపకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమనే మద్యాన్ని త్రాగుతారు. పవిత్ర దేవదూతల ఎదుట వధించబడిన గొర్రెపిల్ల సన్నిధిలో అగ్ని గంధకంతో బాధించబడతారు.
11
ఆ మృగాన్ని దాని విగ్రహాన్ని పూజించిన లేదా దాని పేరు ముద్రను వేయించుకొన్నవారు విశ్రాంతి లేకుండా రాత్రింబగళ్ళు వేదన పొందుతారు. ఆ వేదన పొగ ఎల్లప్పుడు లేస్తూనే ఉంటుంది” అని బిగ్గరగా చెప్పాడు.
12
ఇది యేసు క్రీస్తుకు నమ్మకంగా ఉండి ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఉన్న దేవుని ప్రజలు సహనాన్ని చూపించాల్సిన సమయం.
13
అప్పుడు పరలోకం నుండి ఒక స్వరం, “ఇప్పటినుండి ప్రభువులో ఉంటూ చనిపోయే వారు ధన్యులు! అని వ్రాసి పెట్టు” అని చెప్పింది. దేవుని ఆత్మ, “అవును నిజమే, తమ ప్రయాస నుండి విశ్రాంతి పొందుతారు. ఎందుకంటే వారి క్రియల ఫలాన్ని వారు పొందుతారు” అని పలకడం వినిపించింది.
Settings