న్యాయాధిపతులు 14:8-19
8
కొంతకాలం తర్వాత, ఆమెను పెళ్ళి చేసుకోవడానికి అతడు తిరిగి వెళ్లినప్పుడు, ఆ సింహం కళేబరాన్ని చూద్దామని ప్రక్కకు తిరిగాడు. ఆ కళేబరంలో తేనెటీగ గుంపును, కొంచెం తేనెను అతడు చూశాడు.
9
అతడు కొంచెం తేనెను చేతుల్లోకి తీసుకుని తింటూ ముందుకు వెళ్లాడు. అతడు తన తల్లిదండ్రులను తిరిగి కలుసుకున్నప్పుడు, వారికి కొంచెం ఇచ్చాడు, వారు కూడా తిన్నారు. అయితే సింహం కళేబరంలో నుండి ఆ తేనెను తీసిన సంగతి మాత్రం వారితో చెప్పలేదు.
10
అతని తండ్రి ఆ అమ్మాయిని చూడటానికి వెళ్లాడు. సంసోను అక్కడ ఒక విందు ఏర్పాటు చేశాడు, పెళ్ళికుమారుడు అలా చేయడం అక్కడి ఆనవాయితి.
11
ప్రజలు అతన్ని చూడగానే వారు అతనికి తోడుగా ఉండడానికి ముప్పైమంది యువకులను తీసుకువచ్చారు.
12
సంసోను వారితో అన్నాడు, “మీకు ఒక పొడవు కథ చెప్తాను, ఈ విందు జరిగే ఏడు రోజుల్లో మీరు దాని జవాబు చెప్తే, ముప్పై సన్నని నారబట్టలు, ముప్పై జతల దుస్తులు ఇస్తాను.
13
ఒకవేళ మీరు జవాబు చెప్పలేకపోతే, ముప్పై సన్నటి నారబట్టలు, ముప్పై జతల దుస్తులు మీరు నాకు ఇవ్వాలి.” వారు అన్నారు, “నీ పొడుపు కథ చెప్పు, మేము వింటాము.”
14
అందుకు అతడు అన్నాడు, “తినే దానిలో నుండి తిండి వచ్చింది, బలమైన దానిలో నుండి తియ్యనిది వచ్చింది.” మూడు రోజుల వరకు వారు దానికి జవాబివ్వలేకపోయారు.
15
నాల్గవ రోజున వారు సంసోను భార్యతో అన్నారు, “ఆ పొడుపు కథ అర్థమేమిటో మాకు చెప్పమని నీ భర్తను ఒప్పించు లేకపోతే నిన్ను, నీ తండ్రి ఇంటివారిని దహించి వేస్తాము. మా స్వాస్థ్యాన్ని కాజేయడానికి మమ్మల్ని ఆహ్వానించారా?”
16
అప్పుడు సంసోను భార్య అతనిపై పడి ఏడుస్తూ, “నీవు నన్ను ద్వేషిస్తున్నావు, నేనంటే నీకు ప్రేమ లేదు. నా ప్రజలకు ఒక పొడుపు కథ వేశావు, కానీ దాని అర్థం నాకు చెప్పలేదు” అన్నది. అతడు అన్నాడు, “దాని అర్థం నా తండ్రికి కాని తల్లికి గాని చెప్పలేదు, కాబట్టి నీకెందుకు దానిని వివరించాలి?”
17
విందు జరిగిన ఏడు రోజులు కూడా ఆమె ఏడుస్తూనే ఉంది. ఆమె ఏడుస్తూ, అతన్ని ఇంకా విసిగిస్తున్నందుకు ఏడవ రోజున అతడు దాని అర్థం చెప్పాడు, ఆమె ఆ పొడుపు కథను తన ప్రజలకు వివరించింది.
18
ఏడవ రోజు సూర్యాస్తమయం కాకముందు, ఆ నగరవాసులు అతనితో అన్నారు, “తేనె కంటే తియ్యగా ఉండేదేంటి? సింహం కంటే బలమైనదేది?” అందుకు సంసోను, “మీరు నా దూడ దున్నకపోతే నా పొడుపు కథను చెప్పే వారే కాదు” అన్నాడు.
19
అప్పుడు యెహోవా ఆత్మ బలంగా అతని మీదికి వచ్చాడు. అతడు అష్కెలోను పట్టణానికి వెళ్లి, అక్కడి వారి ముప్పైమందిని చంపి, వారి వస్త్రాలను దోచుకొని పొడుపు కథ అర్థం చెప్పిన వారికిచ్చాడు. కోపంతో మండి పడుతూ అతడు తన తండ్రి ఇంటికి తిరిగి వెళ్లాడు.
Settings