Skip to content
న్యాయాధిపతులు 1:21-36

న్యాయాధిపతులు 1:21-36

21
అయితే బెన్యామీను గోత్రం వారు యెరూషలేములో నివసిస్తున్న యెబూసీయులను తరమలేదు; ఇప్పటివరకు యెబూసీయులు బెన్యామీనీయులతో కలిసి నివసిస్తున్నారు.
22
యోసేపు గోత్రాల వారు బేతేలుపై దాడి చేసినప్పుడు యెహోవా వారితో ఉన్నారు.
23
పూర్వం లూజు అని పిలువబడిన బేతేలును వేగుచూడటానికి వారు యోసేపు ఇంటివారు మనుష్యులను పంపినప్పుడు,
24
ఆ వేగులవారు ఆ పట్టణం నుండి ఒక వ్యక్తి రావడం చూసి అతనితో, “అయ్యా, దయచేసి పట్టణంలోకి ఎలా వెళ్లాలో మాకు చూపించు, మేము నీకు ఏదైనా ఉపకారం చేస్తాం” అని అన్నారు.
25
కాబట్టి అతడు చూపించాడు, వారు అతన్ని, అతని కుటుంబాన్నంతటిని వదిలి పట్టణస్థులందరిని ఖడ్గంతో హతం చేశారు.
26
తర్వాత ఆ వ్యక్తి హిత్తీయుల దేశానికి వెళ్లి, అక్కడ పట్టణం కట్టుకుని దానికి లూజు అనే పేరు పెట్టాడు. నేటి వరకు దాని పేరు అదే.
27
అయితే మనష్షే గోత్రం వారు బేత్-షానును తానాకును దోరును ఇబ్లెయామును మెగిద్దో ప్రజలను, వారి చుట్టూ ఉన్న స్థావరాలను వెళ్లగొట్టలేదు, ఎందుకంటే కనానీయులు అక్కడ నివసించడానికి గట్టిగా పట్టుపట్టారు.
28
ఇశ్రాయేలీయులు బలవంతులైన తర్వాత కనానీయుల చేత వెట్టిపనులు చేయించుకున్నారు కాని వారిని ఎప్పుడూ పూర్తిగా వెళ్లగొట్టలేదు.
29
ఎఫ్రాయిం గోత్రం వారు కూడా గెజెరులో ఉన్న కనానీయులను వెళ్లగొట్టలేదు, కనానీయులు వారి మధ్యలోనే నివసించారు.
30
జెబూలూను గోత్రం వారు కూడా కిత్రోను నహలోలులో ఉన్న కనానీయులను వెళ్లగొట్టలేదు, కాబట్టి కనానీయులు వారి మధ్యలోనే నివసించారు. అయితే జెబూలూనీయులు వారితో వెట్టిపనులు చేయించారు.
31
ఆషేరు గోత్రం వారు కూడా అక్కోను సీదోనును అహ్లాబును అక్సీబును హెల్బాను ఆఫెకును రెహోబును వెళ్లగొట్టలేదు.
32
ఆషేరీయులు వారిని వెళ్లగొట్టలేదు కాబట్టి వారు కనానీయ నివాసుల మధ్యలో నివసించారు.
33
నఫ్తాలి గోత్రం వారు కూడా బేత్-షెమెషును బేత్-అనాతులో ఉన్నవారిని వెళ్లగొట్టలేదు; నఫ్తాలీయులు కూడా కనానీయ నివాసుల మధ్యలో నివసించారు, బేత్-షెమెషులో, బేత్-అనాతులో ఉన్నవారు వారికి వెట్టిపనులు చేశారు.
34
అమోరీయులు దాను గోత్రం వారిని మైదానం దిగువకు రాకుండ కొండసీమ ప్రాంతానికి పరిమితం చేశారు.
35
అమోరీయులు హెరెసు పర్వతంలో, అయ్యాలోనులో, షయల్బీములో నివసించడానికి నిశ్చయించుకున్నారు, కానీ యోసేపు గోత్రాల బలం ఎక్కువైనప్పుడు, వారు అమోరీయులతో వెట్టిపనులు చేయించుకొన్నారు.
36
అమోరీయుల సరిహద్దు అక్రబ్బీం నుండి సెల వరకు విస్తరించింది.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options