Skip to content
యోహాను 4:7-30

యోహాను 4:7-30

7
ఒక సమరయ స్త్రీ నీరు తోడుకోడానికి అక్కడికి వచ్చినప్పుడు యేసు ఆమెతో, “నాకు త్రాగడానికి నీళ్లు ఇవ్వగలవా?” అని అడిగారు. ఆయన శిష్యులు ఆహారం కొనడానికి ఊరిలోనికి వెళ్లారు.
9
ఆ సమరయ స్త్రీ ఆయనతో, “నీవు యూదుడవు, నేను సమరయ స్త్రీని. నీవు నన్ను త్రాగడానికి ఇవ్వమని ఎలా అడుగుతావు?” అన్నది. ఎందుకంటే యూదులు సమరయులతో సహవాసం చేయరు.
10
యేసు, “నీవు దేవుని బహుమానం గురించి, నిన్ను నీళ్లు అడుగుతున్న వ్యక్తి గురించి తెలుసుకుంటే నీవే ఆయనను అడిగేదానివి. ఆయన నీకు జీవజలాన్ని ఇచ్చి ఉండేవాడు” అని ఆమెకు జవాబిచ్చారు.
11
అందుకు ఆమె, “అయ్యా, ఈ బావి చాలా లోతైనది. పైగా నీళ్లు తోడుకోడానికి నీ దగ్గర ఏమి లేదు. మరి ఆ జీవజలం నీకు ఎక్కడ దొరుకుతుంది?
12
మా పితరుడైన యాకోబు ఈ బావిని మాకిచ్చాడు. ఈ బావి నీళ్లను అతడు, అతని కుమారులు త్రాగారు; అతని పశువులు కూడా త్రాగాయి. నీవు అతనికంటే గొప్పవాడివా?” అని అడిగింది.
13
అందుకు యేసు, “ఈ నీళ్లు త్రాగిన వారందరికి మళ్ళీ దాహం వేస్తుంది.
14
కానీ నేనిచ్చే నీళ్లు త్రాగే వారికి ఇక ఎప్పటికీ దాహం వేయదు. నిజానికి, నేనిచ్చే నీళ్లు వారిలో నిత్యజీవానికి నీటి ఊటగా ఉంటుంది” అన్నారు.
15
ఆ స్త్రీ ఆయనతో, “అయ్యా, నాకు దాహం వేయకుండా, నీళ్లు చేదుకోడానికి ఇంత దూరం రానవసరం లేకుండ ఆ నీటిని నాకు ఇవ్వండి” అన్నది.
16
ఆయన ఆమెతో, “వెళ్లి, నీ భర్తను పిలుచుకొనిరా” అని చెప్పారు.
17
అందుకు ఆమె, “నాకు భర్త లేడు” అన్నది. యేసు ఆమెతో, “నీకు భర్త లేడని నీవు చెప్పింది వాస్తవమే.
18
నిజానికి, నీకు అయిదుగురు భర్తలు ఉండేవారు. ఇప్పుడు నీతో ఉన్నవాడు నీ భర్త కాడు. నీవు సత్యమే చెప్పావు” అన్నారు.
19
అప్పుడు ఆ స్త్రీ, “అయ్యా, నీవు ప్రవక్తవని నేను గ్రహిస్తున్నాను.
20
మా పితరులు ఈ పర్వతం మీద ఆరాధించారు, కానీ యూదులైన మీరు ఆరాధించవలసిన స్థలం యెరూషలేములో ఉందని అంటారు” అన్నది.
21
అప్పుడు యేసు ఆమెతో, “అమ్మా, నన్ను నమ్ము. ఒక సమయం వస్తుంది అప్పుడు మీరు తండ్రిని ఈ పర్వతం మీద గాని యెరూషలేములో గాని ఆరాధించరు.
22
సమరయులైన మీరు మీకు తెలియని దానిని ఆరాధిస్తున్నారు; మేము మాకు తెలిసిన దానిని ఆరాధిస్తున్నాం, ఎందుకంటే రక్షణ యూదులలో నుండే వస్తుంది.
23
అయినా నిజమైన ఆరాధికులు పరలోక తండ్రిని ఆత్మతో, సత్యంతో ఆరాధించే ఒక సమయం వస్తుంది. అది ఇప్పటికే వచ్చేసింది. ఎందుకంటే అలాంటి ఆరాధికుల కోసమే తండ్రి చూస్తున్నారు.
24
దేవుడు ఆత్మ కాబట్టి ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి” అని చెప్పారు.
25
అప్పుడు ఆ స్త్రీ ఆయనతో, “క్రీస్తు వస్తాడని నాకు తెలుసు. ఆయన వచ్చినప్పుడు అన్ని విషయాలను మాకు వివరిస్తాడు” అని అన్నది.
26
అప్పుడు యేసు, “నీతో మాట్లాడుతున్న నేనే ఆయనను” అని చెప్పారు.
27
ఇంతలో ఆయన శిష్యులు అక్కడికి వచ్చి యేసు ఆ స్త్రీతో మాట్లాడుతూ ఉండడం చూసి ఆశ్చర్యపడ్డారు. కానీ, “నీకు ఏమి కావాలి? అని గాని, ఆమెతో ఎందుకు మాట్లాడుతున్నావు?” అని గాని ఎవరు అడగలేదు.
28
అప్పుడు ఆ స్త్రీ తన నీటి కుండను అక్కడే వదిలిపెట్టి ఊరిలోనికి వెళ్లి ప్రజలతో,
29
“రండి, నేను చేసిందంతా నాతో చెప్పిన ఆయనను చూడండి, ఈయనే క్రీస్తు కాడా?” అని చెప్పింది.
30
వారు ఊరి నుండి బయలుదేరి ఆయన దగ్గరకు వచ్చారు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options