Skip to content
యిర్మీయా 33:1-13

యిర్మీయా 33:1-13

1
యిర్మీయా ఇంకా కావలివారి ప్రాంగణంలో బంధించబడి ఉండగా, యెహోవా వాక్కు అతనికి రెండవసారి వచ్చింది:
2
“యెహోవా ఇలా అంటున్నారు, ఆయన భూమిని సృష్టించారు, యెహోవా దానిని రూపించి, స్థాపించారు; యెహోవా అని పేరు కలిగినవారే ఇలా చెప్తున్నారు,
3
‘నాకు మొరపెట్టు, నేను నీకు జవాబు ఇస్తాను, నీకు తెలియని, నీవు పరిశోధించలేని గొప్ప విషయాలను నీకు చెప్తాను.’
4
బబులోనీయులతో జరిగిన యుద్ధంలో ముట్టడి దిబ్బల వల్ల ఖడ్గం వల్ల నాశనమైన ఈ పట్టణంలోని ఇళ్ళ గురించి, యూదా రాజభవనాల గురించి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఇలా అంటున్నారు: ‘అవి నా కోపం ఉగ్రత వల్ల నేను చంపిన మనుష్యుల శవాలతో నిండిపోతాయి. ఈ పట్టణపు దుష్టత్వాన్ని బట్టి దానికి నేను నా ముఖాన్ని దాచుకుంటాను.
6
“ ‘అయినప్పటికీ, నేను దానికి ఆరోగ్యాన్ని స్వస్థతను తెస్తాను; నేను నా ప్రజలను స్వస్థపరచి వారు సమృద్ధిగా సమాధానాన్ని సత్యాన్ని ఆస్వాదించేలా చేస్తాను.
7
నేను యూదాను, ఇశ్రాయేలీయులను చెర నుండి తిరిగి రప్పించి వారు ఎలా పూర్వం ఉన్నారో వారిని తిరిగి అలాగే నిర్మిస్తాను.
8
వారు నాకు వ్యతిరేకంగా చేసిన పాపాలన్నిటి నుండి నేను వారిని శుద్ధి చేస్తాను, నాపై తిరుగుబాటు చేసిన వారి పాపాలన్నిటిని క్షమిస్తాను.
9
అప్పుడు నేను వారి కోసం చేయబోతున్న మంచి పనులన్నిటి గురించి విన్న భూప్రజలందరి ముందు ఈ పట్టణం నాకు కీర్తిని ఆనందాన్ని గౌరవాన్ని తెస్తుంది. నేను వారికి ఇచ్చే విస్తారమైన వృద్ధిని సమాధానాన్ని చూసి వారు భయంతో వణికిపోతారు.’
10
“యెహోవా ఇలా అంటున్నారు: ‘ఈ స్థలం గురించి మీరు ఇలా అంటున్నారు, “ఇది మనుష్యులు జంతువులు లేక పాడైపోయింది” అని మీరు చెప్పే ఈ స్థలంలోనే, మనుష్యులుగానీ, జంతువులుగానీ నివసించకుండా పాడైపోయిన యూదా పట్టణాల్లో యెరూషలేము వీధుల్లో
11
సంతోషకరమైన శబ్దాలు, ఆనంద ధ్వనులు, వధూవరుల స్వరాలు మరోసారి వినిపిస్తాయి. వారు యెహోవా ఆలయానికి కృతజ్ఞతార్పణలు తీసుకువస్తూ, “సైన్యాల యెహోవాకు స్తుతులు చెల్లించండి, యెహోవా మంచివాడు; ఆయన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది” అంటారు. ఎందుకంటే నేను వారిని చెర నుండి తిరిగి రప్పిస్తాను’ అని యెహోవా అంటున్నారు.
12
“సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: ‘మనుష్యులు, జంతువులు లేక నిర్జనమైన ఈ స్థలంలో, దాని పట్టణాలన్నింటిలో గొర్రెల కాపరులు తమ మందలకు విశ్రాంతి ఇచ్చేందుకు మళ్ళీ పచ్చికబయళ్లు ఉంటాయి.
13
కొండ ప్రాంత పట్టణాల్లో, పడమటి పర్వత ప్రాంతాల్లో, దక్షిణ ప్రాంతంలో, బెన్యామీను ప్రాంతంలో, యెరూషలేము చుట్టూ ఉన్న గ్రామాల్లో, యూదా పట్టణాల్లో మందలు లెక్కించే వారిచేత లెక్కించబడతాయి’ అని యెహోవా చెప్తున్నారు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options